రఘురామ కట్టుకథలకు స్పందించేదెందరు?

ఒక చిన్న కథ చెప్పుకుందాం.. ఒక పెండ్లాం.. రోడ్డుమీదికొచ్చి ‘‘అయ్యో నా మొగుడు నన్ను చితక కొట్టేశాడు.. చంపేయడానికి ప్రయత్నిస్తున్నాడు..’’ అని నానా శోకాలు పెడుతూ గొంతు చించుకుని ఏడ్చిందనుకుందాం. ఏమవుతుంది? జనం వచ్చి..…

ఒక చిన్న కథ చెప్పుకుందాం.. ఒక పెండ్లాం.. రోడ్డుమీదికొచ్చి ‘‘అయ్యో నా మొగుడు నన్ను చితక కొట్టేశాడు.. చంపేయడానికి ప్రయత్నిస్తున్నాడు..’’ అని నానా శోకాలు పెడుతూ గొంతు చించుకుని ఏడ్చిందనుకుందాం. ఏమవుతుంది? జనం వచ్చి.. ఆమె మొగుడిని నిలదీస్తారు, కనీసం ప్రశ్నిస్తారు, లేదా సర్ది చెబుతారు! ‘‘అలా భార్యను కొట్టవద్దు బాబూ’’ అంటారు. 

అలా నలుగురూ వచ్చి ఆమెకు మద్దతుగా మాట్లాడి, భర్తను మందలిస్తేనే.. ఆ పెండ్లాం మాటలకు జనంలో క్రెడిబిలిటీ ఉన్నట్టు లెక్క! ఆమె జట్టు విరబోసుకుని, రైక చింపుకుని రోడ్డు మీద ఎంత గగ్గోలుగా ఏడ్చినా, మొగుణ్ని తూలనాడినా.. రోడ్డున పోయే వారు గానీ, ఇరుగు పొరుగు గానీ.. వారిలో ఒకరిద్దరు మినహా ఎవరూ పెద్దగా స్పందించలేదు అనుకోండి.. ఆమె మాటలకు క్రెడిబిలిటీ లేదని అర్థం. ఆమె నిత్య అబద్ధాల కోరు అని, భర్త మీద అబద్ధాలతోనే తన జీవితాన్ని గడపాలని అనుకుంటున్నదని యావత్తు ప్రపంచమూ నమ్ముతున్నట్లు అర్థం!

ఈ కథ ఏ ప్రస్తావనలో చెప్పుకుంటున్నామో ఈసరికి అర్థమయ్యే ఉండాలి. వైఎస్సార్ కాంగ్రెస్ టికెట్ మీద జగన్ ఫోటో పెట్టుకుని గెలిచిన ఎంపీ రఘురామరాజు.. ఈ కథలో పెండ్లాం పాత్రను పోషిస్తున్నాడు. ‘నన్ను ఏపీ ప్రభుత్వం చంపేస్తున్నది బాబోయ్’ అని గగ్గోలు పెడుతున్నాడు. టెక్నికల్ గా పోలీసు కేసులు పెట్టడం అనే దశ దాటి, పార్లమెంటులోని ఇతర ఎంపీలందరకూ ఆయన లేఖ రాశారు. లేఖలో ఏం రాశారు అని ఆశ్చర్యపోకండి. కొన్ని రోజులుగా చెబుతున్న మాటలే లేఖలో ఉన్నాయి.

నన్ను ప్రధాని సభకు వెళ్లనివ్వకుండా చేశారు, వెళ్తే నన్ను చంపేయాలని చూశారు, రైలు బుక్ చేసుకుంటే.. బోగీని తగలెట్టి చంపేయడానికి ప్రయత్నించారు.. నా ఇంటిలోకి చొరబడే ప్రయత్నం చేశారు.. రెక్కీ నిర్వహించారు..అన్నీ ఇలాంటి అవాకులూ చెవాకులే. ఏపీ సీఐడీ కానిస్టేబుల్ ను దారుణంగా కొట్టినందుకు రఘురామ, ఆయన కొడుకు, భద్రత సిబ్బందిపై కేసు చాలా గట్టిగానే ఉంది. వీడియో సాక్ష్యాలు కూడా వారికి ప్రతికూలంగానే ఉన్నాయి. సీఆర్పీఎఫ్ సిబ్బంది సస్పెండ్ అయ్యారు కూడా. ఇలాంటి నేపథ్యంలో పోలీసు కేసు పరంగా.. తనకు వాతావరణం అనుకూలం లేదని గ్రహించిన రఘురామ.. తెలంగాణ పోలీసు అధికారుల మీద కూడా నిందలు ఆపాదిస్తూ ఎంపీలకు లేఖ రాశారు.

ఎంపీలకు లేఖ రాయడం ద్వారా ఏం సాధించదలచుకున్నారనేది సస్పెన్స్. ఎందుకంటే.. ఆ లేఖ వలన ఫలితం ఏముంటుందో తెలియదు! ఒకవేళ రఘురామ మాటలను ఎంపీలు నమ్మినట్లయితే.. వారంతా ఒక బృందంగా ఏర్పడి.. పార్లమెంటు స్పీకరును కలిసి.. సహచర ఎంపీకి ఇలాంటి ప్రమాదకర పరిస్థితి ఉండడం దారుణమని, ఏపీ ప్రభుత్వాన్ని మందలించాలని ఒక వినతి ఇవ్వాలి. అలా వినతి ఇచ్చేలా కొందరు ఎంపీలను బతిమాలడం పెద్ద పని కాకపోవచ్చు. కానీ.. వారు ఎవరు,ఎందరు స్పందించారు. అనేది ముఖ్యం! 

రఘురామ మాటలను ఆయన లేఖలు రాసిన ఎంపీల్లో ఎందరు నమ్ముతున్నారనేది ముఖ్యం. స్పీకరుకు లేఖ ఇవ్వడం సంగతి తర్వాత.. కనీసం ఎందరు ఎంపీలు.. రఘురామను చంపడానికి ఏపీ ప్రభుత్వం ప్రయత్నించడం కరెక్టు కాదు.. అని కనీసం ట్వీట్ చేస్తారో వేచి చూడాలి. లేకపోతే.. రఘురామ లేఖ, ఆయన వ్యక్తిత్వం నవ్వులపాలు అవుతుంది.

నిజానికి వాళ్లందరూ స్పందించడం కూడా.. ఆయన కోరిక కాకపోవచ్చు. లేఖ ముసుగులో.. అడ్డగోలుగా బురద చల్లడం మాత్రమే ఆయన ఆశిస్తుండవచ్చు. అంతవరకు తాను సఫలం అయ్యానని సంబరపడుతుండవచ్చు.