తెలంగాణలో కోడి పందేలు ఆడుతూ పోలీసుల దాడి నుంచి తప్పించుకున్న దెందలూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకుడు చింతమనేని ప్రభాకర్ విమర్శలకు దిగారు. పటానుచెరు మండలం చినకంజర్ల శివారులో మామిడితోటలో కోడి పందేలు నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారంతో దాడి చేశామని అక్కడి డీఎస్పీ భీమ్‌రెడ్డి చెప్పారు. చింతమనేనితో పాటు మరికొందరు పరారయ్యారని డీఎస్పీ తెలిపారు.
ఇదేదో ఏపీ పోలీసులు కక్ష కట్టి దాడి చేసినట్టు, కావాలనే తన పేరు ఇరికించినట్టు చింతమనేని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ మేరకు ఆయన ఫేస్‌బుక్ వేదికగా ఎదురు దాడికి దిగారు. కోడి పందేల్లో లేని వ్యక్తిని ఉన్నట్టుగా చూపారని విమర్శించారు.
తాను కోడి పందేలకు దూరమన్నట్టు ఆయన చెప్పడం చూస్తే ఆశ్చర్యం కలిగిస్తోంది. కోడి పందేలు ఆడిస్తున్న వారిలో చింతమనేని కూడా ఉన్నాడని పటానుచెరు డీఎస్పీ చెప్పడాన్ని చింతమనేని రాజకీయ కోణంలో చూడడం విశేషం.
అదేదో పటానుచెరు డీఎస్పీకి ప్రత్యేక ఎజెండా ఉందని, ఇంత రాక్షస రాజకీయం అవసరమా? అని చింతమనేని ప్రశ్నించారు. రాజకీయాన్ని రాజకీయంగానే ఎదుర్కోవాలని డీఎస్పీకి హితవు చెప్పారు. కోడి పందేల నిర్వహణలో తన పాత్ర ఉందనే దుర్మార్గ, నీచమైన ప్రచారాన్ని ఇకనైనా ఆపాలని ఆయన కోరడం గమనార్హం.
ఇలాంటి ప్రచారంతోనే కుప్పకూలే మేడాలు కట్టి అధికారంలోకి వచ్చారని ఆయన పేర్కొన్నారు. ఇంతకూ ఆయన కేసీఆర్ సర్కార్ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని చెప్పదలుచుకున్నారా? అదేదో నేరుగా విమర్శించొచ్చు కదా.
డొంక తిరుగుడు, భయం ఎందుకో మరి! కోడి పందేలకు వెళ్లకుండా వెళ్లారని చింతమనేనిపై నిందలు వేయడానికి పటాన్‌చెరు డీఎస్పీకి కోపం ఎందుకుంటుంది? సచ్ఛీలతను నిరూపించుకోవాలంటే సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం కాదు… వేరే మార్గం వుంటుంది.
ఆ మార్గంపై చింతమనేని దృష్టి పెడితే మంచిది. ఫేస్‌బుక్ పోస్టులకు పటాన్‌చెరు పోలీసులు భయపడరని తెలుసుకుంటే మంచిది.