భారత్ లో ‘సింగిల్ డోస్’కు ఆదరణ దక్కుతుందా?

భారత్ లో సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్ అనుమతులకు మరో ముందడుగు పడింది. స్పుత్నిక్ లైట్ పేరుతో ఇప్పటికే రష్యాలో వినియోగంలో ఉన్న ఈ సింగిల్ డోస్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డాక్టర్ రెడ్డీస్…

భారత్ లో సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్ అనుమతులకు మరో ముందడుగు పడింది. స్పుత్నిక్ లైట్ పేరుతో ఇప్పటికే రష్యాలో వినియోగంలో ఉన్న ఈ సింగిల్ డోస్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డాక్టర్ రెడ్డీస్ సంస్థ భారత ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. ప్రస్తుతం డాక్టర్ రెడ్డీస్ సంస్థ, రష్యా సహకారంతో స్పుత్నిక్-వి టీకాను భారత్ లో పంపిణీ చేస్తోంది. నేరుగా రష్యా నుంచి స్పుత్నిక్-వి టీకాను దిగుమతి చేసుకుని దాన్ని ఆస్పత్రుల ద్వారా ప్రజలకు అందిస్తోంది.

ప్రస్తుతం రష్యాలో స్పుత్నిక్-వి తో పాటు, స్పుత్నిక్ లైట్ కూడా పంపిణీ చేస్తున్నారు. ఈ టీకా సామర్థ్యం కూడా సంతృప్త స్థాయిలో ఉండటంతో.. రష్యాతో పాటు పలు ఇతర దేశాలు కూడ ఈ వ్యాక్సిన్ వాడకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఇప్పుడు భారత ప్రభుత్వం సింగిల్ డోస్ టీకాకు అనుమతి ఇవ్వాల్సి ఉంది.

ప్రస్తుతం భారత్ లో కొవాక్సిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్-వి టీకాలు పంపిణీ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నేరుగా కొవాక్సిన్, కొవిషీల్డ్ సేకరించి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తోంది. అటు ప్రైవేట్ ఆస్పత్రులు కూడా వీటిని నేరుగా ఉత్పత్తిదారుల నుంచి సేకరించి నామమాత్రపు ధరకు అందిస్తున్నాయి. స్పుత్నిక్-వి టీకాను మాత్రం డాక్టర్ రెడ్డీస్ సంస్థ నేరుగా రష్యా నుంచి దిగుమతి చేసుకుని కార్పొరేట్ ఆస్పత్రుల ద్వారా పంపిణీ చేస్తోంది.

ఇప్పుడు రాబోతున్న సింగిల్ డోస్ టీకా స్పుత్నిక్ లైట్ ని కూడా డాక్టర్ రెడ్డీస్ సంస్థ దిగుమతి చేసుకోవాల్సి ఉంది. అయితే ముందుగా భారత ప్రభుత్వం వద్ద అత్యవసర వినియోగ అనుమతి కోసం ఈ సంస్థ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా దరఖాస్తు సమర్పించింది.

ఇంతకీ ''సింగిల్ డోస్'' క్లిక్ అవుతుందా?

భారత్ లో ఇప్పటి వరకూ ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ కలిపి మొత్తం 22కోట్ల వ్యాక్సిన్ లు వేశారు. ఇటీవల కాలంలో టీకాల కొరత వల్ల ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ కి మధ్య చాలా గ్యాప్ వచ్చేసింది. చాలామంది ప్రజలు ఇబ్బంది పడ్డారు. అయినప్పటికీ ఫస్ట్ డోస్ వేయించుకున్న కోట్లాది మంది ప్రజలు, సెకెండ్ డోస్ వేయించుకోవాల్సిందే. 

స్పుత్నిక్-లైట్ (సింగిల్ డోస్) వైపు వీళ్లు మళ్లే అవకాశం లేదు. ఈ గ్యాప్ లో మరికొంతమంది కోవీషీల్డ్ లేదా కోవాక్సిన్ వేసుకోవడం ఖాయం. ఈ నేపథ్యంలో.. స్పుత్నిక్-లైట్ ను ఆఘమేఘాల మీద ఇండియాకు రప్పించినా దాని వల్ల ఉపయోగం ఉంటుందా అనేది ప్రశ్నార్థకం. 

అధికారుల అంచనా ప్రకారం.. 45 ఏళ్లు దాటిన వ్యక్తులకు స్పుత్నిక్-లైట్ అందుబాటులోకి రాదు. 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తుల్లో కొందరికి మాత్రం ఈ సింగిల్ డోస్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే భవిష్యత్తులో సింగిల్ డోస్ వల్ల ఉపయోగం ఎక్కువ. ఎక్కువమంది రెండు డోసుల కంటే సింగిల్ డోస్ కు ప్రాధాన్యం ఇస్తారు.