ఓవైపు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో, మహేష్ బాబు సర్కారువారి పాట సినిమాతో బిజీగా ఉంటున్నప్పటికీ.. మహేష్-రాజమౌళి కాంబోలో రాబోతున్న సినిమాపై ఎప్పటికప్పుడు పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. వీళ్లిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా ట్రెజర్ హంట్ కాన్సెప్ట్ తో, ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని ఊహాగానాలు వినిపించాయి.
అయితే ఈ పుకార్లను నిర్మాత కేఎల్ నారాయణ ఖండించారు. మహేష్-రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకు సంబంధించి ఇప్పటివరకు కథ ఫైనలైజ్ అవ్వలేదన్నారాయన.
“రాజమౌళి-మహేష్ సినిమాకు సంబంధించి కథ లాక్ చేయలేదు. బయట వినిపిస్తున్న స్టోరీలైన్స్ కు, మా సినిమాకు ఎలాంటి సంబంధం లేదు. అన్నీ ఊహాగానాలే. సబ్జెక్ట్ ఏంటి, జానర్ ఏంటి అనేది నాకే తెలియదు. ఇక మిగతా వాళ్లకు ఏం తెలుస్తుంది? ఆర్ఆర్ఆర్ రిలీజ్ తర్వాతే మహేష్ మూవీపై స్పష్టత వస్తుంది.”
ఇలా మహేష్-రాజమౌళి సినిమాపై ఎలాంటి అప్ డేట్ లేదనే విషయాన్ని బయటపెట్టారు నారాయణ. లెక్కప్రకారం ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో లాంఛ్ చేయాలనుకున్నారట. కానీ కరోనా వల్ల ప్రాజెక్టు ఇంకాస్త ఆలస్యమౌతోంది.
“నిజానికి ఈ అక్టోబర్ కు రాజమౌళి-మహేష్ సినిమా లాంఛ్ అవుతుందని అనుకున్నాం. లెక్కప్రకారం అప్పటికి ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయిపోవాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్ఆర్ఆర్ అక్టోబర్ కు రిలీజ్ అవుతుందని నేను అనుకోవడం లేదు. బహుశా అది వాయిదా పడొచ్చు. కాబట్టి ఆర్ఆర్ఆర్ రిలీజైన తర్వాతే మా సినిమా ఉంటుంది.”
ఈసారి మాత్రం మహేష్-రాజమౌళి కాంబినేషన్ కు మరో సినిమా అడ్డుగా వచ్చే అవకాశం లేదంటున్నారు నారాయణ. సర్కారువారి పాట తర్వాత మహేష్, ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి.. తన సినిమాకే కమిట్ అయ్యారని నారాయణ స్పష్టంచేశారు.