వైసీపీ కీల‌క వ్య‌క్తి ఆచూకీ ఎక్క‌డ‌?

డేటా చోరీ, పెగాస‌స్‌, ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారాలు మ‌రోసారి ఏపీలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ వ్య‌వ‌హారాలు నిగ్గు తేల్చేందుకు ఎమ్మెల్యేల‌ కోరిక మేర‌కు ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం శాస‌న‌స‌భ ఉప‌సంఘాన్ని ఏర్పాటు…

డేటా చోరీ, పెగాస‌స్‌, ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారాలు మ‌రోసారి ఏపీలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ వ్య‌వ‌హారాలు నిగ్గు తేల్చేందుకు ఎమ్మెల్యేల‌ కోరిక మేర‌కు ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం శాస‌న‌స‌భ ఉప‌సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంఘానికి తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి నేతృత్వం వ‌హిస్తున్నారు.  

ఏపీ అసెంబ్లీ అప్ప‌గించిన బాధ్య‌త‌ను నెర‌వేర్చే క్ర‌మంలో భూమ‌న నేతృత్వంలో వ‌రుస భేటీలు నిర్వ‌హిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఈ సంద‌ర్భంగా భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సేవ మిత్ర యాప్ ద్వారా డేటా చౌర్యం జరిగిందన్నారు. దాదాపు 40 లక్షల ఓట్లను తొలగించార‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో 2016-19 మ‌ధ్య పెద్ద కుట్ర జ‌రిగింద‌ని భూమ‌న ఆరోపించారు. రాజ్యాంగంలోని వ్యక్తిగత గోప్యత హక్కుకు విరుద్ధంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిందని ఆయ‌న విమర్శించారు. దీంతో ప్రజల భద్రతకు కూడా ప్రమాదకరంగా పరిణమించిందన్నారు.

టీడీపీకి అనుకూలంగా ఉన్నవారి ఓట్లే ఉంచి వ్యతిరేకంగా ఉన్నవారి ఓట్లను తొలగించేందుకు ప్రైవేటు ఏజెన్సీల ద్వారా యత్నించారని ఆయ‌న‌ చెప్పారు. ప్రజల వ్యక్తిగత డేటా చోరీ చేసి అడ్డదారుల్లో రాజకీయ లబ్ధి పొందేందుకు కుట్రపన్నారని ఆయ‌న మండిప‌డ్డారు. భూమ‌న చెప్ప‌డం వ‌ర‌కూ అంతా బాగుంది. నాడు టీడీపీ కుట్ర‌ల్ని క‌నిపెట్టి, వైసీపీ విజ‌యంలో అత్యంత కీల‌క పాత్ర పోషించిన ఐటీ నిపుణుడు తుమ్మ‌ల లోకేశ్వ‌ర‌రెడ్డి నేడు ఎక్క‌డున్నారు? ఏం చేస్తున్నార‌నే ప్ర‌శ్న‌కు స‌మాధానం లేదు. అస‌లు ఆయ‌న ఆచూకీ లేదంటే… పార్టీ కోసం ప్రాణాల మీద‌కు తెచ్చుకున్న వాళ్ల‌ను ఈ ప్ర‌భుత్వం ఎంత మాత్రం ప‌ట్టించుకుంటున్న‌దో అర్థం చేసుకోడానికి ఇంత‌కంటే నిద‌ర్శ‌నం అవ‌స‌రం లేదు.

తుమ్మ‌ల లోకేశ్వ‌ర‌రెడ్డి ఎపిసోడ్ వైసీపీ నాయ‌కులు, కార్య‌కర్త‌ల‌కు పెద్ద గుణ‌పాఠం అని చెప్ప‌క త‌ప్ప‌దు. వైసీపీ విజ‌యంలో లోకేశ్వ‌ర‌రెడ్డి పాత్ర ఏంటి? అస‌లు ఆయ‌న ఏం చేశారో తెలుసుకుందాం. వైసీపీ విజ‌యంలో ప్ర‌శాంత్ కిషోర్ (పీకే) టీం కీల‌క పాత్ర పోషించింద‌ని అంద‌రూ అనుకుంటుంటారు. కానీ నాటి అధికార పార్టీ టీడీపీ త‌మ‌కు ఓట్లు వేయ‌ర‌నే అనుమానం ఉన్న సుమారు 41.50 ల‌క్ష‌ల ఓట్లు పీకేసినా… పీకే పీకిందేమీ లేదు.

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సేవా మిత్రా అనే యాప్‌ను తీసుకొచ్చింది. దీన్ని గ్రామీణ స్థాయిలో ఏర్పాటుచేసి, వైసీపీకి ఖచ్చితంగా ఓట్లు వేసే వారిని గుర్తించింది. ఈ నేప‌థ్యంలో 2018, సెప్టెంబ‌ర్ నాటికి వైసీపీ మ‌ద్ద‌తుదారుల‌ని టీడీపీ అనుమానించి 41 ల‌క్ష‌ల 50వేల 457 మంది ఓట్ల‌ను నిర్దాక్షిణ్యంగా తొల‌గించింది. 

– సెప్టెంబర్, 2018  డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్  ప్రకారం 3,51,95,260 ఓట్లను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

– ఏప్రిల్, 2019  ఫైనల్ ఓటర్ లిస్ట్ ప్రకారం 3,93,45,717 ఓట్లను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

– మీరు గమనిస్తే, సెప్టెంబర్, 2018  డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ , ఏప్రిల్, 2019  ఫైనల్ ఓటర్ లిస్ట్ మధ్య ఉన్న తేడా 41 ల‌క్ష‌ల 50 వేల 457 ఓట్లు. ఏడు నెలల కాలంలో ఇన్ని ఓట్లు పెరగడం అన్నది అనూహ్య ప‌రిణామం. ఇవన్నీ కొత్త ఓటర్లుగా నమోదు చేసుకున్నవి కావు. ఇందులో కొత్తగా 18 సంవత్సరాలు నిండిన వారు నమోదు చేసుకున్న ఓట్లు కొన్ని మాత్రమే. మరి మిగిలిన ఓట్ల మాటేమిటి ?

టీడీపీ ప్రభుత్వం ఒక పక్కా ప్రణాళిక ప్రకారం దాదాపు వైసీపీ గెలవడానికి వీలున్న నియోజకవర్గాల్లో ఆ పార్టీ మ‌ద్ద‌తుదారుల‌కు సంబంధించి 30 వేల‌ నుంచి 40 వేల‌ ఓట్లను తొలగించింది. ఈ సంచ‌ల‌న విష‌యం బ‌య‌ట‌పడటంతో టీడీపీ ఒక్క‌సారిగా షాక్‌కు గురైంది. లక్షల ఓట్లు తొల‌గింపున‌కు గురి కావ‌డం అప్పట్లో ఏపీలో తీవ్ర సంచ‌ల‌న‌మైంది.

టీడీపీ వ్యూహాన్ని తీవ్రంగా దెబ్బ‌కొట్టిన లోకేశ్వ‌ర‌రెడ్డిని ఏపీ పోలీసులు టార్గెట్ చేశారు. హైద‌రాబాద్‌లో ఉంటున్న లోకేశ్వ‌ర‌రెడ్డి ఇంటిపై బాబు పాల‌న‌లోని పోలీసులు దాడికి పాల్ప‌డ‌డం క‌ల‌క‌లం రేపింది. త‌న‌ను కిడ్నాప్ చేయ‌డానికి ఏపీ పోలీసులు ప్రయత్నించారని తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, ఏపీ పోలీసులు అక్కడ నుంచి వెళ్లిపోయారు.

– సెప్టెంబర్, 2018  డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ తో పోల్చినట్లయితే ఏప్రిల్, 2019 నాటికి మొత్తం ఓటర్ల సంఖ్య 3,93,45,717 కి పెరిగింది. అంటే 11.77% ఓట్లు అదనంగా ఓటర్ల జాబితాలో పెరిగాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 10.77% ఓట్ల మెజార్టీతో అధికారాన్ని సొంతం చేసుకుంది.  

– 2019 ఎన్నికల్లో వైసీపీకి 1,56, 83,592 ఓట్లు (49.95%), టీడీపీకి 1,23,01,741 ఓట్లు (39,18%)  వచ్చాయి.

– 2018 సెప్టెంబర్ నుంచి 2019 ఏప్రిల్ నాటికి అంటే 7 నెలల కాలానికి అదనంగా కొత్తగా ఓటర్ల జాబితాలో చేరే వారి సంఖ్య చాలా తక్కువగానే ఉంటుంది. తొలగించిన‌ ఓట్లు భారీగా పునరుద్ధరించ‌డంతో ఆ సంఖ్య 41,050,457కి చేరాయి.

-2018, 2019ల‌లో దొంగ ఓట్ల మీద, వైసీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగించడం మీద ఏకధాటిగా రాష్ట్ర‌ ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం, అలాగే రాష్ట్ర హైకోర్టుకు వెళ్లి, తొలగించిన ఓట్లను తిరిగి పునరుద్ధరించేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వ‌చ్చింది. నాటి ప్ర‌తిపక్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, వైసీపీ నాయ‌కుల‌తో క‌లిసి ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేశారు. టీడీపీ ప్రభుత్వం తొలగించిన ఓట్లు ఎన్నికల కమిషన్ ద్వారా తిరిగి పునరుద్ధరించారు. ఎంతమంది అభిమానులు ఉంటే ఏమి లాభం? ఓటు వేసే టైంకి వాళ్ల పేర్లు ఓటరు జాబితాలో లేకపోతే చేయగలిగేదేముంది?

ఒక‌వేళ ఈ ఓట్ల తొల‌గింపును క‌నుక్కోలేక పోయి వుంటే… 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ ప‌రిస్థితి ఏమ‌య్యేది? అనే ప్ర‌శ్న‌కు మ‌రోసారి ప్ర‌తిప‌క్షానికే ప‌రిమితం కావాల్సి వ‌చ్చేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. న‌వ‌ర‌త్నాల ప‌థ‌కాలు, పీకే టీం త‌దిత‌ర వ్య‌వ‌స్థ‌లు ఎన్ని వున్నా… వైసీపీ మ‌ద్ద‌తుదారుల‌కు ఓట్లే లేక‌పోతే చేయ‌గ‌లిగేదేముంటుంది?  

సొదుం ర‌మ‌ణ‌