మన్నెం వీరుడు అల్లూరి విగ్రహావిష్కరణకు జనసేన అధిపతి పవన్ ను పిలవకపోవడం అన్నది ఎంత అవమానమో, ఎంతటి బాధాకరమో భాజపాతో తనే పొత్తు పెట్టుకున్న పవన్ కు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు. భాజపాతో ఇలాంటి వ్యవహారాలు పవన్ కు కొత్త కాదు. ఢిల్లీ వెళ్లినా అమిత్ షా, మోడీల దర్శన భాగ్యం లేదు. స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరణ చేస్తున్న మాట్లాడే పరిస్థితి పవన్ కు లేదు.
ఇన్ని అవమానాలు ఎదురవుతున్నా, దిగమింగుకుని ఆ పార్టీతో చిత్రమైన పొత్తు నడపుతూనే వున్నారు. అదెంత చిత్రమైన పొత్తు అంటే పవన్ దారి పవన్ దే, భాజపా దారి భాజపాదే. భాజపా పోటీ చేసే ఎన్నికలకు మద్దతు ఇచ్చే బాధ్యత, బరువు పవన్ కు లేవు. అలాగే తెలంగాణలో భాజపాకు బద్ద శత్రువు అయిన టీఆర్ఎస్ తో పవన్ దోస్తీ కడతారు. అక్కడ అదో చిత్రమైన ఈక్వేషన్.
పవన్ ఇలా చిత్రాతి చిత్రమైన దోస్తీ నడుపుతున్నా, ఆయన వెనుక వున్నవాళ్లకు మండాల్సిన దగ్గర మండుతూనే వుంది. ఆ మంట అప్పుడప్పుడు బయటకు వస్తుంటుంది. పవన్ సోదరుడు జనసేన లెఫ్టినెంట్ నాగబాబు ఇప్పుడు అలాంటి మంటనే తన ట్వీట్ లో వెళ్లగకక్కారు.
‘’మన్యం వీరుడు “అల్లూరి సీతారామరాజు” విగ్రహావిష్కరణ భీమవరంలో అద్భుతంగా జరిగింది, ఆ మహానుభావుడికి నా నివాళి..’
అని ఓ ట్వీట్ వేసారు. అంత వరకు బాగానే వుంది. కానీ దానికి కొనసాగింపుగా మరో ట్వీట్ కూడా వేసారు.
ఆ సభ లో మా అన్నయ్య చిరంజీవి గారు తప్ప అందరూ (?) అద్భుతంగా పెరఫార్మెన్సు చేశారు,, ఆ మహనటులంంరికి ఇదే నా అభినందనలు
ఇదీ ఆ రెండో ట్వీట్. అంటే వేదిక మీద మిగిలింది ఎవరు? మోడీ, జగన్ నే కదా? ఆ ఇద్దరు మహానటనతో జీవించేసి, పెర్ ఫార్మెన్స్ ఇచ్చారని నాగబాబు భావన. ఇంతకీ ఆ పెర్ ఫార్మెన్స్ ఏమిటి? చిరంజీవి పట్ల మోడీ, జగన్ కనబర్చిన ప్రేమ అంతా నటనే అని చెప్పడమే నాగబాబు భావనా? అంటే మోడీ, జగన్ ల ప్రేమ అంతా నటన అని దానికి పడిపోవద్దనీ సోదరుడు చిరంజీవిని నాగబాబు హెచ్చరిస్తున్నారని అనుకోవాలేమో?