వైఎస్ షర్మిల పార్టీలోకి రోజురోజుకూ వలసలు పెరుగుతున్నాయి. షర్మిల నాయకత్వంలో పనిచేసేందుకు తటస్థులు, మేధావులు, ప్రజా కళాకారులు ఉత్సాహం చూపుతున్నారు.
తాజాగా షర్మిల పార్టీలోకి తెలంగాణకు చెందిన ప్రముఖ ప్రజాగాయకుడు ఏపూరి సోమన్నతో పాటు పెద్ద సంఖ్యలో ఆయన నాయకత్వంలో కళాకారులు చేరడం విశేషం.
కేసీఆర్ నాయకత్వానికి వ్యతిరేకంగా కొన్నేళ్లుగా ఏపూరి సోమన్న బలమైన సాంస్కృతిక పోరాటం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సోమన్న కళాబృందం కాంగ్రెస్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించింది.
కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి పాదయాత్రలోనూ సోమన్న తన ఆటపాటలతో జనాన్ని ఉర్రూతలూగించారు. షర్మిల ఆధ్వర్యంలో పనిచేసేందుకు ముందుకొచ్చిన క్రమంలో సోమన్న మాట్లాడుతూ దివంగత వైఎస్సార్ తెలంగాణ బాగు కోసం పని చేశారని కొనయాడారు. అలాంటి నేత బిడ్డ నేతృత్వంలో పని చేయాలని నిర్ణయించుకోవడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు.