పెద్ద నోటు ముద్రణపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. లోక్‌సభ సమావేశాల్లో భాగంగా ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ పెద్ద నోటు రూ.2000 ముద్రణను నిలిపివేసినట్టు ప్రకటించారు. కొంత కాలంగా రూ.2000 నోటు పెద్దగా చెలామణిలో లేకపోవడంతో రద్దు చేస్తారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ప్రజల్లో నెలకున్న సందేహ నివృత్తి కోసం ఓ సభ్యుడు ప్రశ్న సంధించారు. దీంతో గత రెండేళ్లుగా ఆ పెద్ద నోటును ముద్రించడం లేదని తేల్చి చెప్పారు. బ్లాక్ మనీని అరికట్టేందుకంటూ మోడీ ప్రభుత్వం 2016,
నవంబరు 8 అర్థరాత్రి నుంచి రూ.1000 , రూ.500 కరెన్సీ నోట్లను రద్దు చేసింది. ఆ తర్వాత వెయ్యి రూపాయల కరెన్సీ నోటు స్థానంలో రూ.2000 నోటు తీసుకొచ్చింది. అలాగే కొత్త రూ.500 నోటు కూడా కేంద్రప్రభుత్వం ప్రవేశ పెట్టింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ పెద్ద నోటుకు సంబంధించి మరిన్ని వివరాలు అందించారు.
2018, మార్చి 30వ తేదీ నాటికి మొత్తం 336.2 కోట్ల రూ.2000 నోట్లు చెలామణిలో ఉన్నాయన్నారు. 2021, ఫిబ్రవరి 26 నాటికి ఆ మొత్తం రూ.249.9 కోట్లకు తగ్గినట్టు మంత్రి పేర్కొన్నారు. డిమాండ్‌కు అనుగుణంగా ఆర్బీఐతో చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి వెల్లడించారు.