ట్రాజెడీలోనూ అద్భుత‌ కామెడీ

టీడీపీ నేత‌లు ఎంత గొప్ప న‌టులో నిన్న‌టి మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో తెలిసింది. ఇంత కాలం ప‌ట్ట‌ణాల్లో టీడీపీ బ‌లంగా ఉంద‌నే అభిప్రాయం బ‌లంగా వినిపించేది. కొంత వ‌ర‌కూ ఇది నిజం కూడా. అయితే…

టీడీపీ నేత‌లు ఎంత గొప్ప న‌టులో నిన్న‌టి మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో తెలిసింది. ఇంత కాలం ప‌ట్ట‌ణాల్లో టీడీపీ బ‌లంగా ఉంద‌నే అభిప్రాయం బ‌లంగా వినిపించేది. కొంత వ‌ర‌కూ ఇది నిజం కూడా. అయితే ఓడ‌లు బండ్లు , బండ్లు ఓడ‌ల‌వుతాయ‌నే చందంగా …ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ సంక్షేమ పాల‌న దెబ్బ‌కు టీడీపీ తునాతున‌క‌లైంది.

అస‌లు టీడీపీ ఉనికినే ప్ర‌శ్నార్థ‌కం చేసేలా నిన్న‌టి పుర‌పాల‌క ఎన్నిక‌ల ఫ‌లితాలున్నాయ‌నే అభిప్రాయాలు పెద్ద ఎత్తున వ్య‌క్త‌మ‌వుతున్నాయి. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో త‌గిలిన దెబ్బ‌ల నుంచి కోలుకోకుండానే , అంత‌కంటే తీవ్రంగా మ‌రో రాజ‌కీయ గాయాన్ని వైసీపీ చేసింది. ఇంత ట్రాజెడీలోనూ టీడీపీ నేత‌లు, ఎల్లో మీడియా కామెడీ పండించ‌డం ప్ర‌శంస‌లు అందుకుంటోంది.

తాడిప‌త్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి అల్లుడు, ఎమ్మెల్సీ దీప‌క్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జ‌గ‌న్ బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడేది టీడీపీనే అని చెప్పుకొచ్చారు. మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీపీది నిజమైన విజయమైతే..ఆ పార్టీ నేతలు లైడిటెక్టర్‌ పరీక్షలకు సిద్ధం కావాలని ఆయ‌న డిమాండ్ చేయ‌డం గ‌మ‌నార్హం.

ఇక దీప‌క్‌రెడ్డి బామ్మ‌ర్ది జేసీ ప‌వ‌న్‌రెడ్డి కామెడీ చేయ‌డంలో బావ‌కు మించిపోయాడ‌నే చెప్పాలి. తాడిప‌త్రిలో టీడీపీ మెరుగైన ఫ‌లితాల‌ను సాధించిన నేప‌థ్యంలో జేసీ ప‌వ‌న్‌తో ఓ చాన‌ల్ సేవ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ పేరుతో ఓ డిబేట్ నిర్వ‌హించింది. దీనికి కార‌ణం లేక‌పోలేదు. సేవ్ తాడిప‌త్రి పిలుపు ఆ ప‌ట్ట‌ణంలో బాగా ప‌నిచేసింద‌నే వాద‌న తెర‌పైకి వ‌చ్చిన నేప‌థ్యంలో, ఇప్పుడు సేవ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ అని జేసీ ప‌వ‌న్, స‌ద‌రు ఎల్లో చాన‌ల్ కొత్త రాగాన్ని ఆల‌పించడం విశేషం.

సేవ్ తాడిప‌త్రి, సేవ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ సంగ‌తులు ప్ర‌జ‌లు చూసుకుంటార‌ని… ఇంత‌కూ టీడీపీని ర‌క్షించే వారెవ‌రు? అనే ప్ర‌శ్న సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. త‌ప్పుల‌ను స‌రిదిద్దుకుని, రానున్న రోజుల్లోనైనా పార్టీని ర‌క్షించుకునే చ‌ర్య‌లు చేప‌ట్ట‌కుండా, తాజాగా ప్ర‌జాభిప్రాయాన్ని అప‌హాస్యం చేస్తూ మీడియాను అడ్డుపెట్టుకుని అవాకులు చెవాకులు పేల‌డం ఏంట‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. 

ఇలాగైతే టీడీపీ తుడిచి పెట్టుకుపోవ‌డం గ్యారెంటీ అంటూ నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రికొంద‌రు మాత్రం ఇంత ట్రాజెడీలోనూ కామెడీ క్రియేట్ చేయ‌డం ఒక్క టీడీపీ నేత‌ల‌కు మాత్ర‌మే చెల్లుతుంద‌ని కామెంట్స్ చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. 

ఇంత మాస్ క్యారెక్ట‌ర్ నా కెరియ‌ర్ లో ఎప్పుడు చేయ‌లేదు

బాబుకు సిగ్గుంటే కృష్ణా జిల్లాలో అడుగుపెట్టొద్దు