జ‌గ‌న్ పాలిట మ‌రో నిమ్మ‌గ‌డ్డ‌!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయాలు కులాల వారీగా విభ‌జ‌న అయ్యాయి. ముఖ్యంగా అధికారం కోసం క‌మ్మ‌, రెడ్డి సామాజిక వ‌ర్గాల మ‌ధ్య కొన్ని ద‌శాబ్దాలుగా రాజ‌కీయ పోరాటం సాగుతోంది. ఒక్కో ఎన్నిక‌ల్లో ఒక్కో సామాజిక వ‌ర్గం ఆధిప‌త్యం…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయాలు కులాల వారీగా విభ‌జ‌న అయ్యాయి. ముఖ్యంగా అధికారం కోసం క‌మ్మ‌, రెడ్డి సామాజిక వ‌ర్గాల మ‌ధ్య కొన్ని ద‌శాబ్దాలుగా రాజ‌కీయ పోరాటం సాగుతోంది. ఒక్కో ఎన్నిక‌ల్లో ఒక్కో సామాజిక వ‌ర్గం ఆధిప‌త్యం చెలాయిస్తోంది. మిగిలిన సామాజిక వ‌ర్గాలు ఈ రెండు సామాజిక వ‌ర్గాల ప‌ల్ల‌కీలు మోయ‌డానికి మాత్ర‌మే ప‌రిమితం కావాల్సిన దుస్థితి నెల‌కుంది.

ఈ నేప‌థ్యంలో రాజ‌కీయ ప‌రిధి దాటి ప్ర‌స్తుతం ఒక సామాజిక వ‌ర్గం ఉన్న‌తాధికారుల‌తో కూడా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ పోరాటం చేస్తున్న ప‌రిస్థితి. జ‌గ‌న్‌ది పోరాటం కాదు, వేధింపుల‌ని ఆ సామాజిక వ‌ర్గ నేత‌లు, అధికారులు విమ‌ర్శిస్తున్నారు. ఈ ప‌రిస్థితికి అనేక కార‌ణాలున్నాయి. ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్‌తో కొన్ని నెల‌ల పాటు ఏపీ ప్ర‌భుత్వం ఫైట్ చేయ‌డం చూశాం. స్థానిక సంస్థ‌ల ఎన్నికల‌కు నామినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతుండ‌గా అర్థాంత‌రంగా వాయిదా వేశార‌నే కోపంతో నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌పై ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మండిప‌డ్డారు.

త‌న సామాజిక వ‌ర్గానికి చెందిన చంద్ర‌బాబుకు మేలు చేద్దామ‌నే కుట్ర‌లో భాగంగానే నిమ్మ‌గ‌డ్డ ఎన్నిక‌లు వాయిదా వేశార‌ని జ‌గ‌న్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. అప్పుడు మొద‌లైన పోరు… చివ‌రికి ఎస్ఈసీగా నిమ్మ‌గ‌డ్డ‌ను తొల‌గించ‌డం, దానిపై ఆయ‌న న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించ‌డం తెలిసిందే. చివ‌రికి న్యాయ‌స్థానం ఆదేశాల‌తో నిమ్మ‌గ‌డ్డ తిరిగి ఎస్ఈసీగా నియ‌మితులై కొన్నింటికి ఎన్నిక‌లు జ‌రిపించారు. మంత్రుల ఫిర్యాదు మేర‌కు నిమ్మ‌గ‌డ్డ‌కు ప్రివిలేజ్ క‌మిటీ నోటీసులు జారీ చేయ‌డం త‌దిత‌ర ప‌రిణామాలు యుద్ధ వాతావ‌ర‌ణాన్ని త‌ల‌పించాయి.

తాజాగా నిమ్మ‌గ‌డ్డ ఎపిసోడ్‌ను ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు పున‌రావృతం చేస్తున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు కూడా చంద్ర‌బాబు సామాజిక వ‌ర్గ‌మే. ఎవ‌రినీ జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఒక ప‌ట్టాన వ‌దిలిపెట్టే ర‌కం కాదు. టార్గెట్ చేస్తే… తాడోపేడో తేల్చుకునే వ‌ర‌కూ జ‌గ‌న్ ప్ర‌భుత్వం వెళుతుంద‌నేందుకు ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు ఉదంత‌మే నిద‌ర్శ‌నం. ఇటీవ‌ల రెండోసారి స‌స్పెండ్‌కు గురైన సీనియ‌ర్ ఐపీఎస్ ఉన్న‌తాధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు తాజాగా హైకోర్టును ఆశ్ర‌యించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

భద్రత, నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో గత ఏడాది మార్చి 18న ఏసీబీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ నిఘా విభాగం మాజీ అధిపతి ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టులో పిటిష‌న్ వేశారు. పరికరాల కొనుగోలు వ్యవహారంలో తనకు ఎలాంటి పాత్రా లేదని ఆయ‌న పేర్కొన్నారు. తాను ఎలా నిర్దోషో పిటిష‌న్‌లో ఆయ‌న పొందుప‌రిచారు. ఇదిలా వుండ‌గా నిమ్మ‌గ‌డ్డ రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌లో కీల‌క అధికారిగా ప్ర‌భుత్వంపై ఫైట్ చేశారు. కానీ ఏబీ విష‌యం వేరు. ప్ర‌భుత్వంలో ఆయ‌న భాగం. అందుకే సుప్రీంకోర్టు ఆదేశాల మేర‌కు పోస్టింగ్ ఇచ్చిన‌ట్టే ఇచ్చి, క‌నీసం రెండు వారాలు కూడా గ‌డ‌వ‌క‌నే ప్ర‌భుత్వం స‌స్పెండ్ వేటు వేయ‌గ‌లిగింది. కానీ ఏబీ మాత్రం ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు.

సుప్రీంకోర్టు ఆదేశించినా పోస్టింగ్ ఇవ్వ‌ని సంద‌ర్భంలోనూ, అలాగే రెండో స‌స్పెండ్ వేసినప్పుడు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ప్ర‌భుత్వ పెద్ద‌ల‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. అన్నిటికి తెగించార‌ని ఆయ‌న మాట‌లను బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు. ఏబీ మాట‌లు అహంకారపూరితంగా ఉన్న‌ప్ప‌టికీ, ఆయ‌న‌లోని ఆత్మ‌విశ్వాసాన్ని జ‌గ‌న్ స‌ర్కార్ కొట్టి పారేయ‌లేదు. ఎందుకంటే రాజుకంటే మొండివాడు బ‌ల‌వంతుడ‌నే సామెత చందాన‌, ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుతో వ్య‌వ‌హారం ప్ర‌భుత్వం అనుకున్న‌ట్టుగా ఒన్‌సైడ్‌గా వుండ‌దు.

త‌న‌తో పాటు త‌న సామాజిక వ‌ర్గానికి చెందిన ప‌లువురు అధికారుల‌కు పోస్టింగ్‌లు ఇవ్వ‌కుండా ఏపీ స‌ర్కార్ ప‌క్క‌న పెట్టింద‌ని, జీతాలు ఇవ్వ‌కుండా వేధిస్తోంద‌ని ఏబీ ప‌లు సంద‌ర్భాల్లో ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇప్ప‌టికైనా కులాల కుమ్మ‌లాట‌ల‌కు ఏదో ఒక ద‌శ‌లో ప్ర‌భుత్వం ఫుల్‌స్టాప్ పెట్టాల్సి వుంది. ఎందుకంటే అధికారం ఏ సామాజిక వ‌ర్గానికి శాశ్వ‌తం కాదు. కానీ పాల‌కుల క‌క్ష‌పూరిత వైఖ‌రి వ‌ల్ల అంతిమంగా ఏ పాపం ఎరుగ‌ని సామాజిక వ‌ర్గానికి చెందిన అధికారులు, నాయ‌కులు న‌ష్ట‌పోవాల్సి వుంటుంది. ఈ పాపంలో ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు పాత్ర ఎంతో ఆయ‌న మ‌న‌స్సాక్షికే తెలియాలి.