ప్రధాని మోడీని ఏకంగా చంద్రబాబే మెచ్చుకుంటున్నారు. ఆయన బాటలో నడవాలని అందరికీ చెబుతున్నారు. మోడీ ప్రభుత్వం కరోనా నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని పెద్ద పెద్ద సర్టిఫికేట్లు ఇస్తున్నారు.
ఓ విధంగా మోడీని పొగిడేందుకు ఇదొక అవకాశంగా బాబు తీసుకున్నారు. అయితే ఆయన పార్టీకి చెందిన తమ్ముడు మాత్రం వేలెత్తి చూపుతూ మోడీనే విలన్ గా చేస్తున్నారు. దేశంలో కరోనా రెండవ స్టేజ్ కి రావడానికి మోడీయే కారణమని ఘాటు వ్యాఖ్యలే చేస్తున్నారు.
కరోనా విషయంలో మొదట్లో మోడీ సర్కార్ నిర్లక్ష్యం చేసిందని, జనవరిలోనే మేలుకొని ఉంటే ఇపుడు దేశం మొత్తం లాక్ డౌన్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చేది కాదని విశాఖ అర్బన్ జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ వాసుపల్లి గణేష్ కుమార్ మండిపడుతున్నారు.
ఇతర దేశాల నుంచి వచ్చిన వారిని వేరేగా ఉంచి తనిఖీలు చేయించలేదని, అందరికీ జనంలోకి కలిపేశాక ఇపుడు దేశం మొత్తానికి తాళం వేసి 130 కోట్ల మంది ప్రజానీకాన్ని బాధ పెడుతున్నారని నిందిస్తున్నారు.
అంతే కాదు, లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న వారి కుటుంబాలకు ప్రతీ ఒక్కరి ఖాతాలో పది వేల రూపాయలు వేయాలని కూడా కొత్త డిమాండ్ ముందు పెడుతున్నారు. మొత్తానికి తెలుగుదేశం అధినేత మోడీ భేష్ అంటూంటే పచ్చ తమ్ముడే విమర్శలు చేయడం ఇంటెరెస్టింగ్ పాయింటే మరి.