పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా.. మాదెప్పుడూ అగ్ర రాజ్యమేనంటుంటారు అమెరికావాళ్లు. ఇతర దేశాలపై పైచేయి కోసం పరితపించే అమెరికాను.. ఇప్పుడు కరోనా వణికిస్తోంది. కరోనా విజృంభణకు ముందు చైనాకే పెద్ద ప్రమాదం, మిగతా దేశాలన్నింటికి పెద్ద ముప్పేమీ లేదని అనుకున్నారంతా. కానీ రోజుల వ్యవధిలోనే చైనా కరోనాని కట్టడి చేసింది. పాపం ఇటలీ బలైపోయింది. కరోనా చైనాకే పరిమితం అని లైట్ తీసుకున్న ఇటలీ నేడు భారీ మూల్యం చెల్లించుకుంది, తాజాగా అమెరికా ఆ లిస్ట్ లో దూసుకెళ్తోంది.
చైనాలో 81వేల పైచిలుకు కరోనా పాజిటివ్ కేసులున్నాయి, ఇటలీలో 75వేలకు చేరుకున్నాయి. అమెరికాలో 68,960. ఆందోళనకర విషయం ఏంటంటే.. అమెరికాలో రోజురోజుకీ శరవేగంగా కరోనా వ్యాపిస్తోంది. అమెరికాలో మరణాల సంఖ్య వెయ్యి దాటిపోయింది. అధ్యక్షుడు ట్రంప్ నిర్లక్ష్యమే దీనికి కారణం అంటున్నారు విశ్లేషకులు. ఈ పాపమంతా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేనంటున్నారు.
లాక్ డౌన్ ప్రకటించడానికి వెనకాడ్డం వల్లే అమెరికాలో ఈ పరిస్థితి దాపురించింది. కేవలం కొన్ని రాష్ట్రాలకే లాక్ డౌన్ పరిమితం చేయడం, ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుందనే సాకు చూపి రోజు వారీ వ్యవహారాల కోసం పట్టుబట్టడం ట్రంప్ మూర్ఖత్వానికి పరాకాష్ట. ఆ మూర్ఖత్వానికి ఇప్పుడు అమెరికా భారీ మూల్యం చెల్లించుకుంటోంది.
అద్భుతమైన సాంకేతిక, ఆర్థిక వనరులు.. అన్నీ ఉన్న అమెరికా.. కరోనాని కట్టడి చేయడానికి అవస్థలు పడుతోంది. అన్నీ ఉన్నా అధ్యక్ష పీఠంలో ఉన్న వ్యక్తి సమర్థుడు కాకపోవడంతోనే అమెరికాకు ఈ కష్టాలన్నీ. ఇప్పటివరకూ ట్రంప్ పై వచ్చిన విమర్శలు చూస్తుంటే.. ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో కచ్చితంగా ఆయనకు ఓటమి తప్పదని అర్థమవుతోంది.