జేపీ ముందరికాళ్లకు భీశెట్టి బంధాలు!

రాజకీయాల్లో ఎంతో సంస్కరణలు తీసుకురావాలని, చట్టసభల్లో కూర్చుని చట్టాల నిర్మాణంలో తన వంతు చిత్తశుద్ధి గల పాత్ర పోషించాలని లోక్ సత్తా సారథి, మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణకు బలమైన కోరిక ఉంది.…

రాజకీయాల్లో ఎంతో సంస్కరణలు తీసుకురావాలని, చట్టసభల్లో కూర్చుని చట్టాల నిర్మాణంలో తన వంతు చిత్తశుద్ధి గల పాత్ర పోషించాలని లోక్ సత్తా సారథి, మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణకు బలమైన కోరిక ఉంది.

రాజకీయాల్లో ఉండే అవ్యవస్థ గురించి ఆయనకు క్లారిటీ ఉంది. నాయకులు, అధికారులు వ్యవస్థల్ని ఎంతగా గాడి తప్పించి.. సమాజానికి ప్రజాస్వామ్యానికి చేటుచేస్తున్నారో.. ఆయన వివరించి చెప్పగలిగినంతగా మరొకరు చెప్పలేరు. తన గళాన్ని దేశమంతా వినిపించాలని, ప్రజలందరిలోనూ ఆలోచన రేకెత్తించాలని అందుకు చట్టసభల్లో తాను ఉండాలని ఆయనకు కోరిక! ఏదో ఒక నాటికి అవకాశం కలిసి వచ్చినప్పుడు చట్టసభల్లో ప్రవేశించాలనే ఆయన అనుకుంటూ ఉంటారు.

అయితే అలాంటి జయప్రకాశ్ నారాయణ కలలకు, కోరికలకు ఆయన సొంత పార్టీ నాయకుడు భీశెట్టి బాబ్జీ గండికొడుతున్నారు. జయప్రకాశ్ నారాయణ ఇక ఎన్నికల రాజకీయాల్లోకి వచ్చే అవకాశమే లేదని.. ఆయన తరఫున భీశెట్టి ప్రకటించేస్తున్నారు. తద్వారా ‘చాన్సు దొరికితే ఎన్నికల్లోకి’ అనుకుంటున్న జేపీ కలలకు భీశెట్టి గండి కొడుతున్నారు.

ఆప్కాబ్ వేడుకలలో ముఖ్యమంత్రి జగన్ తో కలిసి పాల్గొన్న తరువాత.. జేపీ , వైసీపీలో చేరుతారని ప్రచారం జరగడం సోషల్ మీడియా వెర్రి తలలు వేసే రోజుల్లో వింత కాదు. ఆయన విజయవాడ ఎంపీగా వైసీపీ తరఫున పోటీచేస్తారని పుకార్లు పుట్టడమూ ఆశ్చర్యకరం కాదు. అవన్నీ అబద్ధాలే అయి ఉండొచ్చు కూడా. జేపీ క్రెడిబిలిటీని దెబ్బతీయడానికి వ్యూహాత్మకంగా జరిగిన కుట్ర కావొచ్చు కూడా.

కానీ భీశెట్టి బాబ్జీ మీడియా ముందుకు వచ్చి వాటిని ఖండించడానికి చేసిన ప్రయత్నం ఇంకా చిత్రంగా ఉంది. జేపీ వ్యవస్థలను ప్రేమిస్తారనే బాబ్జీ మాట నిజమే. అయితే పదవులకోసం వెంపర్లాడలేదనే మాట తప్పు.

తన పార్టీ తరఫున ఆరోజున రాష్ట్రంలో ఎక్కడినుంచైనా పోటీచేయగల అవకాశం ఉన్నా.. తన కమ్మ సామాజికవర్గం మరియు ఆంధ్రా సెటిలర్లు గరిష్టంగా ఉండే కూకట్ పల్లి నియోజకవర్గాన్ని మాత్రమే ఎంచుకుని ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి జయప్రకాశ్ నారాయణ. 

అలాగే.. 2014 ఎన్నికల్లో ఎంపీగా మల్కాజ్ గిరి నియోజకవర్గం నుంచే పోటీచేయడానికి కారణం కూడా అదే. ఆంధ్ర ఓటర్ల మీద ఆశే. ఆ ఎన్నికల్లో లోక్ సత్తా ఫ్లెక్సిల మీద, అప్పటి బిజెపి ప్రధాని అభ్యర్తి నరేంద్రమోడీ ఫోటోలను కూడా ముద్రించుకుని.. కమలదళం ఓట్లు కూడా కొల్లగొట్టి ఎంపీగా గెలవాలని జేపీ చేసిన కుటిలయత్నాలను దాచిపెట్టడం సాధ్యం కాదు కదా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి జేపీ ఇక ఎన్నికల్లోకి రానే రారని అంటూ.. భీశెట్టి బాబ్జీ ఆయన కలలకు గండికొట్టేశారని పలువురు అనుకుంటున్నారు.