బ్రహ్మారెడ్డి బతుకుని ‘డైపర్‘గా మార్చేసిన లోకేష్!

జూలకంటి బ్రహ్మారెడ్డి అంటే.. ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి అని అనుకోవచ్చు గానీ.. ఆయనకు ఇంకా ఘనమైన చరిత్ర ఉంది. బాబాయి సహా ఏడుగురిని హత్యచేసిన కేసులో ఆయన ప్రధాన నిందితుడు.…

జూలకంటి బ్రహ్మారెడ్డి అంటే.. ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి అని అనుకోవచ్చు గానీ.. ఆయనకు ఇంకా ఘనమైన చరిత్ర ఉంది. బాబాయి సహా ఏడుగురిని హత్యచేసిన కేసులో ఆయన ప్రధాన నిందితుడు. ఫ్యాక్షన్ ప్రత్యర్థులతో కాదు కదా.. సొంత కుటుంబంలోనే హత్యల పరంపరను కొనసాగించిన వ్యక్తిగా ఆయనను మాచర్ల నియోజకవర్గం గుర్తుంచుకుంటుంది. రెండు వరుస ఓటముల తర్వాత.. రాజకీయాలకే దూరంగా ఉన్న బ్రహ్మారెడ్డిని, తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఏరికోరి మరీ తిరిగి తీసుకువచ్చి మాచర్ల పార్టీ ఇన్చార్జిగా నియమించారు.

అలాంటి ఫ్యాక్షన్, నేర నేపథ్యం ఉన్న జూలకంటి బ్రహ్మారెడ్డి జీవితాన్ని చినబాబు నారా లోకేష్ చాలా సింపుల్ గా.. తన అజ్ఞానం నిండిన మాటల ప్రవాహంలో పసిపిల్లలకు తొడిగే డైపర్ లాగా మార్చేశారు! లేకిగా ఉండే చవకబారు మాటలు మాట్లాడకూడదనే వివేకం లోకేష్ కు ఎటూ ఉండదు. ఆయన మాటలు అన్నవి అన్నట్లుగా రాయడం కూడా కుదరదు. 

కాకపోతే.. ‘‘మాచర్లలో ప్రత్యర్థులకు సూసూ పోయించడమే జూలకంటి బ్రహ్మారెడ్డి బాధ్యత’’ అని ప్రకటించి నారా లోకేష్ తన పాదయాత్రలో సంచలనం సృష్టించారు. ‘మాచర్ల ఇన్చార్జిగా బ్రహ్మారెడ్డిని తెచ్చారంటే.. ఏదో అక్కడ పార్టీకి జీవం పోసి, తెలుగుదేశాన్ని మళ్లీ గెలిపించడానికి తెచ్చారేమో అనుకున్నామే.. ఆయన డ్యూటీ అందరితో సూసూ పోయించడమేనా?’ అని లోకేష్ మాటలను విన్న జనం నవ్వుకుంటున్నారు.

నారా లోకేష్ తన పాదయాత్రలో భాగంగా.. మాచర్లలో పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ని విమర్శించడం ఆయన రొటీన్ ప్రసంగాల్లో ఒక భాగం. అయితే.. నారాలోకేష్ తెలివితేటలు, పరిజ్ఞానం, భాష మీద ఆయనకున్న పట్టు అందరికీ తెలిసినవే. ‘పిన్నెల్లి’ అనే పదం పలకడం కూడా చేతకాని లోకేష్.. పిల్లి బ్రదర్స్ అంటూ వారికి సూసూ పోయించడానికి (ఆయన అన్న పదం రాస్తే చీప్ గా ఉంటుంది) బ్రహ్మారెడ్డి అన్నను తీసుకువచ్చాం అంటూ వెల్లడించారు. బ్రహ్మారెడ్డి అన్నను ఇన్చార్జిగా ప్రకటించిన రోజునుంచే వారు సూసూ పోసుకుంటున్నారని కూడా తేల్చిచెప్పారు.

మాచర్లలో అందరితో సూసూ పోయించడం కూసం బ్రహ్మారెడ్డి ని పార్టీ పదవిలో నియమించి, ఆ నియోజకవర్గంలో సులభ్ కాంప్లెక్సులను లీజుకు తీసుకోవాలని నారా లోకేష్ అనుకుంటున్నారేమో అని.. ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు.

ఓ సినిమాలో ఆలీ పాత్ర ఉంటుంది. ఆలీ బావ సుమన్. వాళ్ల కొడుకు పసివాడిగా ఉన్నప్పుడు.. మామయ్య ఆలీ ఎత్తుకుంటే తప్ప సూసూపోయడు. ఆలీ ఎత్తుకోగానే సూసూ పోసేస్తాడు. ఆలీ పాపులారిటీ పెరిగిపోతుంది. ఊరంతా తమ పిల్లలు సూసూ పోయకపోతే.. ఆలీ వద్దకు క్యూకట్టి మరీ వస్తుంటారు. ‘నన్ను వీడు డైపర్ లాగా వాడేస్తున్నాడు’ అని ఆలీ అనుకోవడం సినిమాలో ట్విస్ట్. 

ఇప్పుడు నారా లోకేష్ ప్రసంగం తరువాత.. జూలకంటి బ్రహ్మారెడ్డి కూడా బహుశా.. నా బతుకును లోకేష్ మరీ డైపర్ లాగా మార్చేశాడు.. అని చింతిస్తుంటారేమో.