కోర్టు కంటే కేసీఆర్ తీర్పు ఏమిటనేదే ముఖ్యం!

సాధారణంగా ప్రజాస్వామ్యంలో శాసన, అధికార, న్యాయవ్యవస్థలు ఒకరిపై ఒకరు చెక్ పాయింట్స్ లాగా, ఒకరు తప్పు చేస్తే మరొకరు సరిదిద్దే వ్యవస్థలు లాగా వ్యవహరిస్తుంటాయి. Advertisement శాసన, అధికార వ్యవస్థలు రకరకాల వక్ర ప్రయోజనాలతో,…

సాధారణంగా ప్రజాస్వామ్యంలో శాసన, అధికార, న్యాయవ్యవస్థలు ఒకరిపై ఒకరు చెక్ పాయింట్స్ లాగా, ఒకరు తప్పు చేస్తే మరొకరు సరిదిద్దే వ్యవస్థలు లాగా వ్యవహరిస్తుంటాయి.

శాసన, అధికార వ్యవస్థలు రకరకాల వక్ర ప్రయోజనాలతో, స్వార్ధ ఉద్దేశాలతో ఏదైనా తేడాగా ఉండే నిర్ణయం తీసుకున్నప్పటికీ.. ఆయా నిర్ణయాల యొక్క రాజ్యాంగ బద్ధతను ప్రశ్నించి అవి చెల్లకుండా చేసేందుకు న్యాయవ్యవస్థ అంతిమ నిర్ణేతత లాగా ఉంటుంది.

కానీ ఈ అరుదైన సందర్భంలో సుప్రీం కోర్టు ఇవ్వగల తుది తీర్పు కంటే, భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మదిలో మెదలుతున్న తీర్పు ఏమిటి అనేదే కీలకం కానుంది. అదే కొత్తగూడెం నియోజకవర్గం నుంచి 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలుపు వ్యవహారం!

ఆ ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకుడు వనమా వెంకటేశ్వరరావు విజయం సాధించారు. అయితే వనమా తన ఎన్నికల అఫిడవిట్లో అబద్ధాలు చెప్పారని, తప్పుడు వివరాలు సమర్పించారని ఆరోపిస్తూ ఓటమిపాలైన భారాస అభ్యర్థి జలగం వెంకటరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఆ పిటిషన్ను విచారించిన హైకోర్టు మొత్తానికి వనమా వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా అనర్హుడు అని ప్రకటించింది. ఆయన ఎన్నిక చెల్లదు అని తేల్చింది. వనమాను అనర్హుడిగా చేసిన నేపథ్యంలో రెండో స్థానంలో నిలిచిన జలగం వెంకటరావును ఎమ్మెల్యేగా పరిగణించాలని కూడా హైకోర్టు తేల్చి చెప్పింది.

అయితే తెలంగాణలో ఎన్నికలు రావడానికి కేవలం మూడు నాలుగు నెలల వ్యవధి మాత్రమే ఉంది. ఈ మూడు నాలుగు నెలలే ఎమ్మెల్యేగా జలగం వెంకటరావు అధికారం వెలగబెట్టాలి. అయితే ఈలోగా వనమా వెంకటేశ్వరరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయనకు ఊరట కలిగిస్తూ హైకోర్టు తీర్పు మీద సుప్రీం స్టే ఇచ్చింది.

కౌంటర్ అఫిడవిట్ల దాఖలు వాటికి వనమా సమాధానం తదితర రూపాల్లో మొత్తానికి ఇంకో నెల వరకు గడువు ఉంది. ఆ తర్వాత కూడా తక్షణమే విచారణ పూర్తవుతుందనే నమ్మకం లేదు. మొత్తానికి సుప్రీంకోర్టులో కొత్తగూడెం ఎన్నిక- వనమా విజయం అనే వ్యవహారం ఒక కొలిక్కి వచ్చేలోగా అసెంబ్లీ ఎన్నికలే వచ్చేయవచ్చు అని అందరూ అనుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అన్నదానికి ప్రాధాన్యం లేకుండా పోయింది. కెసిఆర్ తీర్పు ఏమిటి అనేది అందరూ ఎదురు చూస్తున్న సంగతి.

వచ్చే ఎన్నికలలో కొత్తగూడెం నుంచి భారాస అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుని బరిలోకి దించుతారా, లేదా న్యాయపరమైన విజయాన్ని సాధించి నైతికంగా తానే ఎమ్మెల్యే అని చెప్పుకోగల జలగం వెంకటరావుకు అభ్యర్థిత్వం ఇస్తారా అనేది కీలకంగా ఉంది.