నిర్మాత అనిల్ సుంకర కు, ఏజెంట్ సినిమా హోల్ సేల్ బయ్యర్ సతీష్(వైజాగ్) కు నడుమ టస్సెల్ కొనసాగుతూంది. కోర్టులో ఈ కేసు 9 కి వాయిదా పడింది. మరోపక్క కోర్టు బయట సెటిల్ మెంట్ ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మైత్రీ రవి, నట్టి కుమార్ తదితరులు నిర్మాత అనిల్ సుంకరతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ మేరకు తన వంతు బాధ్యతగా 8.50 కోట్లు వెనక్కు ఇవ్వడానికి అనిల్ సుంకర అంగీకరించినట్లు తెలుస్తోంది.
ఈ రోజు నుంచి ఆరు నెలల లోగా ఎనిమిదిన్నర కోట్లు తాను సతీష్ కు ఇస్తానని లిఖితపూర్వకంగా ఇస్తానని, అవి సతీష్ ఎవరికి ఎలా సర్దు కుంటారో ఆయన ఇష్టమని, ఇది వన్స్ ఫర్ ఆల్ ఫైనల్ సెటిల్ మెంట్ అని అనిల్ సుంకర ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
అయితే అమౌంట్ విషయంలో తనకు ఓకె అని, కానీ తనకు ఇప్పుడే కావాలని, లేదా తను బాకీ వున్నవారికి అనిల్ సుంకర లేఖ ఇవ్వాలని, తనకు లేఖ ఇవ్వనవసరం లేదని సతీష్ పట్టుబట్టినట్లు తెలుస్తోంది.
సతీష్ కు తాను పరిహారం ఇస్తా కానీ ఆయన బకాయి పడినవారికి తాను లేఖ ఎందుకు ఇస్తా అని అనిల్ సుంకర నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సెటిల్ మెంట్ అక్కడితో ఆగిపోయింది.
నిజానికి ఎనిమిదిన్నర కోట్లు వెనక్కు ఇవ్వడం మంచి ప్రతిపాదనే. లేఖ విషయంలో ఏదో విధంగా అడ్జస్ట్ చేసుకుని, సతీష్ వ్యవహారాన్ని ఓ కొలిక్కి తెచ్చుకుని వుంటే బాగుండేది అన్న అభిప్రాయాలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.
ఎందుకంటే ఇలా కేసులు, వివాదాలు అనే బయ్యర్లను భవిష్యత్ లో ఏ నిర్మాత కూడా ఎంటర్ టైన్ చేయరని, అది వ్యాపార రీత్యా సతీష్ కు మైనస్ అవుతుందని అంటున్నారు. తాను పెద్ద మొత్తం దిల్ రాజు/శిరీష్ కు బాకీ పడ్డా అని, వారు ఆరు నెలలు ఊరు కోరు అన్నది సతీష్ వాదనగా వుంది.
ఇదిలా వుంటే ఏజెంట్ సినిమా రిజల్ట్ పుణ్యమా అని ఉత్తరాంధ్రలో ఇప్పటి వరకు తమకు వైజాగ్ సతీష్ నుంచి వున్న పోటీ బాధ ఇకపై దిల్ రాజు/శిరీష్ లకు వుండదు. ఎందుకంటే ఇప్పట్లో సతీష్ కోలుకోవడం కష్టం.
అందుకే ఇప్పటికే వేరే మార్గాల ద్వారా వైజాగ్ ఏరియాకు మైత్రీ ఖుషీ సినిమాను తీసుకోవడానికి దిల్ రాజు/శిరీష్ ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
ఇదిలా వుంటే ఈ టోటల్ వ్యవహారం మంగళవారం నుంచి కొత్త మలుపులు తిరగబోతోందని తెలుస్తోంది.