శ్రీశైలంలో 861 అడుగులకు నీటి మట్టం చేరుకుందని, బోర్డు అనుమతి లభిస్తే పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని విడుదల చేస్తామని అధికారులు అంటున్నారు. శ్రీశైలంలో 854 అడుగులకు నీటి మట్టం చేరుకోగానే పోతిరెడ్డిపాడుకు నీటిని విడుదల చేయవచ్చు. 861 అడుగులకు నీరు చేరుకున్నా బోర్డు అనుమతి కావాలంట?
తెలంగాణ ప్రభుత్వం కల్వకుర్తి ద్వారా 840 అడుగుల నుంచే నీటిని సరఫరా చేసేందుకు ఏ బోర్డు అనుమతి ఇచ్చింది? విశేషం ఏమిటంటే పోతిరెడ్డిపాడు ద్వారా SRBC కి 19 TMC లు, తెలుగు గంగ ద్వారా చెన్నై నగరానికి 15 TMC ల నీరు విడుదల చేసుకునే హక్కు ఉంది. కల్వకుర్తికి ఏ హక్కు ఉంది? హక్కు ఉన్న పోతిరెడ్డిపాడుకు బోర్డు అనుమతి కోసం వేచి చూస్తున్న అధికారులు హక్కు లేని, అనుమతి లేని కల్వకుర్తి ద్వారా తెలంగాణ ప్రభుత్వం నీటిని సరఫరా చేస్తుంటే ప్రశ్నించాలని, KRMB కి ఫిర్యాదు చేయాలని కూడా అనిపించకపోవడం రాయలసీమ దుస్థితికి అద్దం పడుతుంది.
మరో విశేషం ఏమిటంటే గత ఏడాది 123 TMC ల నీరు పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు అందులో తెలుగు గంగకు 65 TMC లు విడుదల చేశారట!. సోమశిలకు చేరిన నీరు కూడా రాయలసీమ లెక్కల్లో వేసేసారేమో అన్న అనుమానం కలుగుతోంది.
అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం పోలవరంపై పెడుతున్న శ్రద్ధలో 10వ వంతు రాయలసీమ మీద పెడితే సీమ ప్రాజెక్టులకు నీటి విడుదల ఆవశ్యకత, హక్కులు అర్థం అవుతాయి. ఇప్పటికయినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జోక్యం చేసుకుని రాయలసీమ ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో అధికార అలసత్వం కారణంగా జరుగుతున్న నష్టాన్ని గుర్తించి దిద్దుబాటు చర్యలు చేపట్టాలి.
పోలవరం పేరుతో రాయలసీమ ప్రజలను భ్రమలు పెట్టే ప్రయత్నాలను రాజకీయ పార్టీలు విడనాడాలి. కృష్ణ నీరు నిల్వ, సరఫరాకు అనుగుణంగా సిద్దేశ్వరం అలుగు- పోతిరెడ్డిపాడు, తుంగభద్ర నీటిని నిల్వ చేసుకునేలా గుండ్రేవుల నిర్మాణం, GNSS, HNSS పూర్తి చేసి చెరువుల పునరుద్ధరణతోనే రాయలసీమ నీటి సమస్యకు పరిష్కారం.
మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి, సమన్వయ కర్త, రాయలసీమ మేధావుల ఫోరం