రోడ్డుపై రూల్స్ అన్నీ పాటిస్తున్నామని అనుకుంటాం. సక్రమంగానే డ్రైవ్ చేస్తున్నామని భావిస్తాం. కానీ మనం మాత్రమే సక్రమంగా డ్రైవ్ చేస్తే సరిపోదు. మిగతా వాహనదారులు కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. లేదంటే, ఏం తప్పు చేయకపోయినా ప్రాణాలు పోతాయి. రాత్రి విశాఖలో జరిగిన యాక్సిడెంట్ అలాంటిదే.
తాగిన మత్తులో డ్రైవింగ్ చేసిన ఓ యువకుడు, బైక్ పై వస్తున్న దంపతుల్ని గుద్దేశాడు. భార్యాభర్తలిద్దరూ స్పాట్ లో చనిపోయారు.
ఇంతకీ ఏం జరిగింది.. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఆరుగురు. అంతా టీనేజ్ యువకులే. పైగా మద్యం మత్తులో ఉన్నారు. కారు డ్రైవ్ చేస్తున్నారు. ఎండాడ వైపు వెళ్తున్నారు. సరిగ్గా రాడిసన్ హోటల్ దగ్గరకు వచ్చేసరికి కారు అదుపు తప్పింది. అప్పటికే కారు చాలా స్పీడ్ లో ఉంది. అబ్బాయిలు కంట్రోల్ చేయలేకపోయారు.
దీంతో కారు డివైడర్ ను ఢీకొట్టింది. అక్కడే ఉన్న చెట్టును కూడా కొట్టింది. అవతలి వైపు బైక్ పై ప్రయాణిస్తున్న దంపతులు పృధ్వీరాజ్, ప్రియాంకలను బలంగా ఢీకొట్టింది. దీంతో వాళ్లిద్దరూ అక్కడిక్కడే మృతిచెందారు. తమకు ఏమాత్రం సంబంధం లేని ఈ ఘటనలో భార్యాభర్తలిద్దరూ ప్రాణాలు కోల్పోయారు.
అటు కారులో ఉన్న ఆరుగురిలో మణికుమార్ అనే కుర్రాడికి తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో అతడు కారులోనే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దర్ని పోలీసులు హాస్పిటల్ లో జాయిన్ చేశారు. మిగతా ముగ్గురు మాత్రం పరారయ్యారు. వాళ్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ప్రమాదసమయంలో కారులో కొంతమంది పూటుగా మద్యం సేవించినట్టు పోలీసులు గుర్తించారు. మరీ ముఖ్యంగా కారు నడిపిన వ్యక్తి కూడా తాగినట్టు నిర్థారించారు. కారులో మద్యం బాటిళ్లు కూడా ఉన్నాయి. పెద్ద చెట్టు నేలకొరిగిందంటే, ప్రమాద తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.