ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల టీడీపీ ఇన్‌చార్జ్‌ల కష్టాలు పగవారికీ వద్దు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడ్డా పుంగనూరు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా షెడ్యూల్‌లో లేని పుంగనూరుకు వెళ్లాలని చంద్రబాబు అనుకోవడం, దాన్ని పోలీస్‌శాఖ, వైసీపీ శ్రేణులు తిప్పి కొట్టడంతో టీడీపీ జీర్ణించుకోలేకపోతోంది. పుంగనూరులో రణరంగమే జరిగింది.
పుంగనూరులో చంద్రబాబును అడ్డుకోవడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నిరసనలు చేపట్టింది. అలాగే పెద్దిరెడ్డి వైఖరిపై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. కానీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని టీడీపీ నాయకులు పెద్దిరెడ్డి వైఖరిని తప్పు పట్టడానికి ధైర్యం చాలడం లేదు. తమకు సంబంధం లేనట్టు అంతా తేలు కుట్టిన దొంగల్లా మౌనాన్ని ఆశ్రయించడం టీడీపీ అధిష్టానానికి ఆగ్రహం తెప్పిస్తోంది.
చంద్రగిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ పులివర్తి నాని పరిస్థితి దారుణంగా వుంది. చంద్రగిరి టీడీపీ మండలాధ్యక్షుడు సుబ్రమణ్యంనాయుడు మీడియా ముందుకొచ్చి పుంగనూరులో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు వ్యవహరించిన తీరు బాధాకరమని విమర్శించారు. ఇదే విషయమై చంద్రబాబు తప్పు పట్టిన సంగతి తెలిసిందే. చంద్రబాబు మాట్లాడిన అంశాలపై నియోజకవర్గ స్థాయిలో నాయకులు అందుకోవడం సహజమే. కానీ చిత్తూరు టీడీపీ నాయకులు మాత్రం పుంగనూరు ఎపిసోడ్‌పై నోరు మెదపడానికి వణికిపోతున్నారు.
ఇదే పుంగనూరు ఎపిసోడ్‌పై కొత్తగా పార్టీ పెట్టిన రామచంద్ర యాదవ్ నోరు విప్పారు. పెద్దిరెడ్డిని తప్పు పట్టారు. రామచంద్ర యాదవ్ పాటి సాహసం కూడా టీడీపీ నాయకులు చేయలేదంటే, కారణం ఏమై వుంటుందో ఆ పార్టీ అధిష్టానం తెలుసుకోవాల్సిన అవసరం వుంది.
పెద్దిరెడ్డిని ఊరికే చంద్రబాబు తిట్టాల్సిందే. బాబు సొంత జిల్లాలో ఆయన మనుషులెవరూ పెద్దిరెడ్డితో తగాదా పెట్టుకోవడానికి సిద్ధంగా లేరు. టీడీపీకి అనుకూలంగా రామచంద్ర యాదవ్ ఒక్కరే మాట్లాడారు. ఇంతకూ చిత్తూరు జిల్లాలో చంద్రబాబుకు వెన్నుదన్నుగా నిలిచే నాయకులున్నారా? లేదా? అనే అనుమానం కలిగేలా టీడీపీ దయనీయ స్థితిలో వుంది.