ఎన్నికల్లో పైచేయి సాధించేందుకు రాజకీయ పార్టీలు అన్ని రకాల ప్రయోగాలు చేస్తుంటాయి. సామదాన బేధ దండోపాయాలను ప్రదర్శిస్తుంటాయి. ఎన్నికలకు ఎంతో ముందుగానే టీడీపీ ఆ ఆస్త్రాన్ని ప్రయోగిస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల్లో పోలీస్‌శాఖ పాత్ర కీలకం. పోలీసుల సహకారం ఉన్న రాజకీయ పార్టీలకు పోల్‌మేనేజ్‌మెంట్ చేసుకోవడం సులువవుతుంది. ఈ విషయం బాగా తెలిసిన చంద్రబాబు, లోకేశ్ పోలీస్ అధికారులను నయాన్నో, భయాన్నో లొంగతీసుకోడానికి ప్రయత్నిస్తున్నారు.
తాజాగా పాదయాత్రలో నారా లోకేశ్ వార్నింగ్ ఈ విషయాన్నే తెలియజేస్తోంది. చిత్తూరు ఎస్పీ రిషాంత్‌రెడ్డి పేరును ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, వార్నింగ్ ఇవ్వడం ద్వారా ఇతర పోలీస్ అధికారులను కూడా భయపెట్టి, తమ కంట్రోల్‌లోకి తెచ్చుకునే వ్యూహం కనిపిస్తోంది. రిషాంత్‌రెడ్డి పేరును తన ఎర్ర డైరీలో మొదటి పేరుగా రాసుకున్నట్టు లోకేశ్ తెలిపారు. రిషాంత్‌రెడ్డి కండువా వేసుకోని వైసీపీ కార్యకర్త అని ఆయన విమర్శించారు.
చంద్రబాబునాయుడిపై రాళ్ల దాడి చేసిన వారు ఆయనకు కనిపించలేదని నిష్టూరమాడారు. తొమ్మిది నెలలు ఓపిక పడితే ఆయన కళ్లకు శస్త్ర చికిత్స చేయించి అన్నీ కనిపించేలా చేస్తామన్నారు. పులివెందులలో పిల్ల వేషాలు వేస్తే మనవాళ్లు తరిమి కొట్టారన్నారు. పుంగనూరులో పెద్దిరెడ్డి గ్యాంగ్ రెచ్చిపోతే మనవాళ్లు కరెంట్ షాక్ ఇచ్చారని లోకేశ్ గొప్పలు చెప్పుకున్నారు.
లోకేశ్ చెబుతున్నట్టుగా టీడీపీ వాళ్లే వైసీపీ వాళ్లను తరిమికొట్టడం, కరెంట్ ఇవ్వడం లాంటివి చేసినప్పుడు, ఇక యువ నాయకుడి బాధ ఏంటో అర్థం కాదు. మళ్లీ తానే చంద్రబాబుపై వైసీపీ వాళ్లు రాళ్ల దాడి చేశారని ఆరోపణలు చేయడం లోకేశ్‌కే చెల్లింది.
రిషాంత్‌రెడ్డి పేరు ఎర్రడైరీలో రాసుకున్నానని చెప్పడం, 9 నెలల్లో టీడీపీ ప్రభుత్వం వస్తాదని భరోసా ఇచ్చే కామెంట్స్ చేయడం అంటే… అధికారులందరినీ బ్లాక్ మెయిల్ చేయడం తప్ప, మరేమీ కాదు. ఇంతకూ ఈ సారైనా ఆయన మంగళగిరిలో గెలుస్తారా? లేదా? అనేది మొదట చూసుకోవాలి. ఆ తర్వాతే ఏదైనా!