ప్రజాయుద్ధనౌక గద్దర్ పాట, ఉద్యమ స్ఫూర్తిని మిగిల్చి భౌతికంగా ఈ లోకాన్ని వీడారు. మనిషిగా పుట్టినందుకు భూమాత రుణం తీర్చుకున్నారు. గద్దర్ అంటే ఎన్నెన్నో ఉద్యమ గేయాలు మదిలో మెదులుతాయి. గద్దర్ ఆడుతూ పాడుతుంటే రోమాలు నిక్కపొడుచుకుంటాయి. గద్దర్ గురించి ప్రముఖులు, సామాన్యులు గొప్పగా చెప్పారు.
చాలా మందిని ఎంతో అద్భుతంగా తానే తీర్చిదిద్దానని చంద్రబాబు చెబుతుంటారు. పొరపాటునో, గ్రహపాటునో గద్దర్‌ను కూడా విప్లకారుడిగా, ప్రజా వాగ్గేయకారుడిగా తానే తీర్చిదిద్దానని చంద్రబాబు అంటారేమో అని ఆయన అభిమానులు ఆశించారు. ఎందుకనో చంద్రబాబు సంయమనం పాటించి గద్దర్‌ను మలిచిన శిల్పి తానే అని ఆ ఘనతను ఆయన తన ఖాతాలో వేసుకోలేదు.
అయితే చంద్రబాబు నమ్మకస్తుడైన ఓ విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆ లోటును భర్తీ చేసేలా కామెంట్స్ చేశారు. ఆయనేదో అంటే, బాబును ఆరాధించే ఎల్లో పత్రిక ప్రాధాన్యం ఇచ్చింది. గద్దర్‌కు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.లక్ష్మీనారాయణ నివాళులర్పించిన అనంతరం ఎల్లో పత్రికకు మాత్రమే ఎవరికీ తెలియని విషయం చెప్పారు. అప్పట్లో ఈయన సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సెక్రటరీగా వైద్యారోగ్యశాఖ వ్యవహారాలను చూస్తుండే వారట! గద్దర్ ప్రాణాలను చంద్రబాబు శాయశక్తులా కృషి చేసిన వైనాన్ని ఆయన చెప్పిన మాటలు వింటే…ఎవరికైనా షాక్‌తో గుండె పోటు రావాల్సిందే. ఇంతకూ లక్ష్మీనారాయణ ఏమన్నారో ఆయన మాటల్లోనే…
‘గద్దర్‌తో నాది ప్రత్యేకమైన అనుబంధం. ఆయనపై 1997 ఏప్రిల్ 6 ఆదివారం సాయంత్రం హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు అప్పటి సీఎం చంద్రబాబు నాకు ఫోన్ చేశారు. ‘ఓ కవి మీద ఇలాంటి దాడి జరగడం బాధాకరం. గద్దర్‌ను బతికించుకోవాలి. అవసరమైతే బయటి రాష్ట్రాల నుంచి కూడా డాక్టర్లను పిలిపించండి. ఎంత ఖర్చయినా ఫర్వాలేదు. ఆయన మాత్రం కోలుకోవాలి’ అని నిర్దేశించారు.
సీఎం ఆదేశాలతో నిమ్స్‌లో దగ్గరుండి గద్దర్‌కు ట్రట్మెంట్ ఇప్పించామని, మూడు రోజులకు ఆయన కళ్లు తెరవడం, ప్రాణాపాయం లేదని తెలిసిన తర్వాతే అంతా కుదుట పడ్డామని చెప్పారు. అంత వరకూ చంద్రబాబు కలత చెందడాన్ని కళ్లారా చూసినట్టు కూడా ఈ విశ్రాంత ఐఏఎస్ అధికారి మాటలు వింటే ….నాటి వాస్తవ పరిస్థితులు తెలిసిన ప్రజానీకానికి గుండె ఆగినంత పని అవుతుంది.
చంద్రబాబు ప్రభుత్వమే గద్దర్‌పై కాల్పులు జరిపిందనేది జగమెరిగిన సత్యం. నాటి చంద్రబాబు ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లోనే పోలీసులు గద్దర్‌ను అంతమొందించేందుకు ఆయనపై బుల్లెట్లు దించారు. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శించాయి. ఇప్పుడు ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ మాత్రం గద్దర్ ప్రాణాలను కాపాడింది చంద్రబాబే అని, ఆయన కలత చెందారని చెబుతుంటే… ఔరా అని పౌర సమాజం ముక్కున వేలేసుకుంటోంది. ఇటీవల మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ చంద్రబాబు గురించి పరోక్షంగా ఒక కథ చెప్పారు.
ఎర్రగడ్డ ఆస్పత్రికి వెళ్లి రోగిని తన గురించి తెలుసా అని ప్రశ్నించడం, అటు వైపు నుంచి దిమ్మ తిరిగే సమాధానం వచ్చిందని చెప్పి అందర్నీ నవ్వించారు. లక్ష్మీనారాయణ లాంటి వీర భక్తులు చంద్రబాబు గురించి కల్పిత గొప్పలు చెబితే, ఎవరికైనా మండకుండా ఎలా వుంటుంది? వీళ్ల భక్తి పాడుకాను. లక్ష్మీనారాయణకు మతి చెడి ఏదో చెబితే, కనీసం ప్రచురించే వాళ్ల బుద్ధి ఏమైందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.