సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం 2016 మే 31 న రాయలసీమ నీటి సమస్య పరిష్కారానికి కీలకమైన సిద్దేశ్వరం అలుగు సాధన కోసం 25 వేల మంది రైతులు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ప్రజా శంకుస్థాపన చేసిన రోజు. ఒక్క రాజకీయ పార్టీ అండలేకుండా, ప్రభుత్వ నిర్బంధాన్ని ఎదుర్కొన్న ప్రజాస్వామిక చారిత్రక పోరాటం అది.
సిద్దేశ్వరం నేపథ్యం……
సిద్దేశ్వరం రాయలసీమ ప్రజల చిరకాల స్వప్నం. దాదాపు 9 దశాబ్దాల పాలకుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యం. పలితంగా రతణాల సీమగా ఉండాల్సిన రాయలసీమ నేడు కరువుసీమగా మారి ప్రపంచం ముందు సాయం కోసం ధీనంగా నిలబడిన దైన్యస్దితి. 1911-12 ప్రాంతములోనే ఆంగ్లేయుల కాలంలో మెకన్జి సిపార్సుల మేరకు సిద్దేశ్వరం సర్వేచేసి నిర్మాణానికి అంగీకారం తెలిపారు. తదనంతరం 1958 ప్రాంతములో భారత ప్లానింగ్ కమిషన్ పరిపాలన అనుమతులు మంజూరు చేసింది.
రాయలసీమకు 18 లక్షల ఎకరాలకు, నాటి తమిళనాడుకు 5 లక్షల ఎకరాలకు మొత్తం 22 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా దాదాపు 250 tmc ల సామర్ద్యం తో ప్రాజెక్ట్ ను రూపొందించారు. అదే జరిగి ఉంటే నేడు రాయలసీమకు 250 tmc ల నికరజలాలు హక్కుగా మారి ఉండేది. అంతేకాదు సీమ మొత్తం వ్యవసాయం వృద్ధి చెంది దానికి అనుబంధంగా పరిశ్రమలు, అపార ఖనిజ సంపద, వాతావరణ అనుకూల పరిస్దితుల నేపథ్యంలో గణనీయమైన అబివృద్ధి సాదించి భారతదేశంలోనే అత్యంత అబివృద్ధి చెందిన ప్రాంతముగా నేడు మన రాయలసీమ ఉండేది. అందుకే సిద్దేశ్వరం నిర్మాణం రాయలసీమ నీటి అవసరాలకు అత్యంత ముఖ్యం.
నికర జలాలు ఉన్నా అనుభవించలేని దుస్థితి….
రాయలసీమకు నికరజలాల కేటాయింపులో అన్యాయం జరిగింది. అదే సందర్భంలో ఉన్న 133.7 tmc లలో కనీసం సగం నీటిని వాడుకోలేక పోతున్నాము. ప్రాజెక్ట్ లవారిగా పరిశీలిస్తే..
1. HLC ఈ తుంగభద్ర హైలెవల్ కెనాల్ కి ఉన్న 32.5 TMC లో 17,18 TMC లు మాత్రమే వాడుకుంటున్నాము.
2. LLC 29.5 TMC లలో 11 TMC లు మాత్రమే వాడుకుంటున్నాము.
3. KC కెనాల్ కు 39.9 TMC లు ఉండగా ప్రభుత్వం కాకి లెక్కలు చెప్పి 50,60 TMC లు డ్రా అవుతున్నట్లు చూపిస్తున్నారు. కాని వాస్తవం లో 15 TMC లు మాత్రమే వాడుకుంటున్నాము.
4. బైరవాన్ తిప్పా 4.9 TMC లలో కేవలం 0.5 TMC లు వాడుకుంటున్నాము.
5. SRBC లో 19 TMC లు ఉన్నా అందులో ఉపయోగించుకుంటున్నది 7,8 TMC లు మాత్రమే.
స్దూలంగా చెప్పాలంటే సీమకు అధికారికం గా, హక్కుగా ఉన్న 133.7 TMC లలో మనం దాదాపు సగం అంటే 65 TMC లను వాడుకోవడంలేదు. దీని ఖరీదు వరి పంట అయితే కనీసం 5,6 లక్షల ఎకరాలు, అదే డ్రిప్ లాంటి వ్యవసాయం అయితే 13 లక్షల ఎకరాలు పంటనీటిని వాడుకోలేని పరిస్దితి. ఇవి కాక శ్రీశైలం లోని క్యారి ఓవర్ క్రింద 60 TMC లు, పట్టిసీమ నిర్మాణం ద్వారా 45 TMC లు, పులిచింతల ద్వారా ఒప్పందం మేరకు 54 TMC లను మనం వాడుకోవాలి.
అంటే దాదాపు 159 TMC ఇంకా రాయలసీమ వాడుకోవడానికి అవకాశం ఉంది. అధికారికంగా ఉన్న 133.7 TMC లనే వాడుకునే ఏర్పాట్లు లేనపుడు ఇంకా అవకాశం ఉన్న 159 TMC లను ఎలా వాడుకోవాలి. రెండు కారణాల వలన సీమ ప్రాంతం నీటిని వాడుకోలేక పోతుంది. 1 నీటి నిల్వ చేసుకునే ఏర్పాట్లు తగినంతగా సీమలో లేవు. 2 అవకాశం ఉన్న శ్రీశైలం లో 854 అడుగుల ఎత్తుకు నీటిని ఉంచకుండా 69 జీఓ ద్వారా 834 అడుగుల వరకు నీటిని క్రిష్ణా డెల్టాకు తీసుకు వెలుతుండటం వలన సీమకు నీటి కష్టాలు వచ్చాయి. అందుకే 1. జీఓ నెం 69 ని రద్దు చేసి శ్రీశైలం నీటి మట్టాని 854 అడుగులు ఉండేలా చూడటం. 2. శ్రీశైలంకి 86 కీలోమీటర్ల పైన 860 అడుగల ఎత్తులో సిద్దేశ్వరం అలుగును నిర్మించాలి.
సిద్దేశ్వరం అలుగు ప్రయోజనం….
సిద్దేశ్వరం అలుగును శ్రీశైలం కు పైన నిర్మిస్తాం కాబట్టి 50 tmc ల నీటిని నిల్వ ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సిద్దేశ్వరం అలుగు కాబట్టి కృష్ణా నీరు సిద్దేశ్వరం పొంగిన తర్వాతనే శ్రీశైలం కు వెలుతుంది. అంటే కచ్చితంగా 50 TMC లు నీరు నిల్వ ఉంటుంది.
బ్యాక్ వాటర్ తో పనిచేసే పోతిరెడ్డి పాడు 842 అడుగులు కాబట్టి కనీసం 19 అడుగుల నీరు చేరి తెలుగు గంగా, గాలేరు-నగరి, SRBC లకు నీటి సమస్య పరిష్కారమవుతుంది. హంద్రీ-నీవా ఎత్తిపోతల పథకానికి నీటి సమస్య రాకుండా ఉండటంతో బాటు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం ద్వారా బైరవాన్ తిప్ప ప్రాజెక్ట్ కు కూడా నీరు ఇవ్వవచ్చు.
మారిన పరిస్థితులలో సిద్దేశ్వరం ఆవశ్యకత..
సీమ పైన తెలంగాణ తో సహ మిగిలిన రాష్ట్రాలు ప్రాజెక్ట్ లు కడుతున్నారు. అవి తరవాత కాలంతో నికరజలాల ప్రాజెక్ట్ లుగా మారి పోతే సీమకు నీటి మీద కనీస హక్కును కోల్పోతాము. అందుకే ఒక సారి సిద్దేశ్వరం ప్రాజెక్ట్ ను కోల్పోయి దాదాపు 250 TMC ల నికర జలాలను కోల్పోయాము. మళ్లీ ఇప్పుడు ఆ చిన్నపాటి ప్రాజెక్ట్ ను కూడా సాధించుకోక పోతే సీమ భవితవ్యం ప్రమాదంలో పడక మానదు. శ్రీశైలం ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం పూడిక వలన 100 TMC తగ్గింది.
శ్రీశైలం భద్రత రీత్యా ఒత్తిడి తగ్గించాల్సిన అవసరాన్ని CWC ఎప్పుడో గుర్తించినది. పోలవరం పూర్తి అయితే కృష్ణా డెల్టా అవసరం తీరుతుంది కనుక రాయలసీమకు శ్రీశైలం నీటిని వినియోగించే అవకాశాలు తక్కువే. తెలంగాణకు నాగార్జున సాగర్ ద్వారా 99.5 TMC నీటిని శ్రీశైలం నుంచి నీరు తీసుకునే హక్కు ఉంది. ప్రారంభంలో ఆ నీటిని తీసుకుంటే కనీస నీటి మట్టం నిర్వహణ సాధ్యం కాదు. అందువలన రాయలసీమ నీటి అవసరాలకు సిద్దేశ్వరం కచ్చితంగా కీలకం. దాన్ని సాధించుకోవడం రాయలసీమ ప్రజల కర్తవ్యం.
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పోతిరెడ్డిపాడు వెడల్పు , కాల్వల సామర్థ్యం పెంపు , రిజర్వాయర్ ల నిర్మాణం వైపు ఆడుగులు వేస్తుంది. 40 వేల కోట్ల రూపాయల అంచనాతో SPV ను ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్టు పరిధిలోకి సిద్దేశ్వరం , గుండ్రేవుల , సోమశిల – కండలేరు సామర్థ్యం 4 TMC కు పెంచడం , చెరువుల పునరుద్ధరణ పనులను చేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి.
గత ప్రభుత్వాల నిర్లక్ష్యంపై రాయలసీమ సమాజం పోరాడింది. వైసిపి ప్రభుత్వం పరిష్కరించాలని ఆశిస్తోంది. రాయలసీమ ప్రజల ఆకాంక్షలను , రాయలసీమ నీటి సమస్య పరిష్కారానికిగాను సిద్దేశ్వరం నిర్మాణంపై అధికారిక నిర్ణయం తీసుకోవాలని సిద్దేశ్వరం ప్రజా శంకుస్థాపన 5 వార్షికోత్సవం సందర్భంగా రాయలసీమ ప్రజలు డిమాండు చేస్తున్నారు.
-మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి , సమన్వయ కర్త , రాయలసీమ మేధావుల ఫోరం , తిరుపతి. 9490493436.