కమలం పార్టీలో రాజకీయ భవిష్యత్తు ఉంటుందా? 

భూ కబ్జాదారుడిగా ముద్రపడి, మంత్రి పదవి పోగొట్టుకున్న ఈటల రాజేందర్ బీజేపీలో చేరిపోవడం దాదాపు ఖాయమైపోయింది. ఢిల్లీ వెళ్లి అక్కడ పార్టీ పెద్దలతో చర్చలు జరుపుతున్నాడు. ఈటల రాజేందర్ ను పార్టీలో చేర్చుకునే విషయంలో…

భూ కబ్జాదారుడిగా ముద్రపడి, మంత్రి పదవి పోగొట్టుకున్న ఈటల రాజేందర్ బీజేపీలో చేరిపోవడం దాదాపు ఖాయమైపోయింది. ఢిల్లీ వెళ్లి అక్కడ పార్టీ పెద్దలతో చర్చలు జరుపుతున్నాడు. ఈటల రాజేందర్ ను పార్టీలో చేర్చుకునే విషయంలో పార్టీ పెద్దలు చాలానే కసరత్తు చేసి ఉంటారు. మంత్రి పదవి పోయాక ఈటల చాలామందితో చర్చలు జరిపాడు. తన నియోజకవర్గంలో తన అభిమానులతో, టీఆర్ఎస్ నాయకులతో మాట్లాడాడు.

కాంగ్రెస్ నాయకులతో, బీజేపీ నాయకులతో, కోదండరాం లాంటి వారితో చర్చలు జరిపాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డితో మాట్లాడాడు. మొన్నీ మధ్యదాకా బీజేపీలోకి పోనని చెప్పాడు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా బీజేపీలో చేరానని అన్నాడు. ఈటల కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా ప్రయత్నాలు చేశారు.

ఈటల ఎపిసోడ్ బయట పడగానే ఆయనకు మద్దతుగా రేవంత్ రెడ్డి చాలా గట్టిగా మాట్లాడాడు. దేవరాయాంజల భూముల్లోకి వెళ్ళాడు. ఈటల హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నాయకులతో మాట్లాడాక ట్రబుల్ హరీష్ రావును కేసీఆర్ రంగంలోకి దించారు. ఆయన వారితో మంతనాలు జరిపిన తరువాత తామంతా టీఆర్ఎస్ లోనే ఉంటామని చెప్పారు. మొత్తమ్మీద కేసీఆర్ ను ఎదుర్కోవాలంటే ఒక బలమైన తిరుగుబాటుదారుడు కావాలని, ఆయనను ఒక ఆయుధంగా ఉపయోగించుకోవాలని కాంగ్రెస్, టీఆర్ఎస్ భావించాయి.

ఈ ప్రయత్నాల్లో బీజేపీ విజయం సాధించింది. కేసీఆర్ ఎప్పుడైతే ఈటలను మంత్రి పదవి నుంచి తొలగించారో అప్పుడే ఈటల సొంత పార్టీ పెడతాడాని చాలామంది ఊహించారు. ఈటలకు ఒంటరిగా, అంటే సొంత పార్టీ పెట్టి కేసీఆర్ మీద పోరాడగల శక్తి ఉందని, ఆయనకు అంతటి ఇమేజ్ ఉందని అనుకున్నారు. కానీ ఈటల ఆ ఊహాగానాలన్నీ, ఆ అంచనాలన్నీ పటాపంచలు చేస్తూ బీజేపీలోకి వెళ్లాలనుకోవడం ఆశ్చర్యంగా ఉంది. ఈటలది తొందరపాటు నిర్ణయమా ? బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాడా తెలియదు.

తన రాజకీయ భవిష్యత్తుకు ఉపయోగపడుతుందనే ఆయన బీజేపీని ఎంచుకొని ఉండొచ్చు. ఈటల రాజకీయ నేపథ్యం చూసినా, ఆయన రాజకీయ భావజాలం చూసినా ఆయన బీజేపీలో చేరకూడదు. ఎందుకంటే ఆయన రాజకీయ భావజాలానికి పూర్తి వ్యతిరేకం బీజేపీ. ఈటల తీవ్రవాద వామపక్ష రాజకీయాల నుంచి తన రాజకీయ జీవితం ప్రారంభించాడు. అంటే కాలేజీ రోజుల్లో పీడీఎస్‌యూ నుంచి ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. 

ఆ తరువాత తెలంగాణా ఉద్యమం సందర్భంగా టీఆర్ఎస్ లో చేరాడు. చివరకు తన భవిష్యత్తు కోసం బీజేపీని ఎంచుకున్నాడు. రాజకీయాల్లో భావజాలం, సిద్ధాంతాలు వగైరా పనిచేయవు. ఇప్పుడున్న బీజేపీకి కూడా అవి అవసరంలేదు. కేసీఆర్ మీద ఆయుధంగా ఉపయోగపడతాడా, లేదా అనేదే ముఖ్యం. తెలంగాణా బీజేపీలో అసలు సిసలైన బీజీపీ నాయకులకే విలువ లేకుండా పోయిందని కొందరు చెబుతున్నారు. 

ఇక ఈటల రాకను కొందరు బీజేపీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. ఆయన వస్తే తాము పార్టీలో ఉండమంటున్నారు. ఇలా అనే నాయకులు కూడా వేరే పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చినవారే. ఈటల అధికారికంగా బీజేపీలో చేరాక వీరి వ్యవహారశైలి ఎలా ఉంటుందో మరి. ఈటలకు బీజేపీ నాయకులు ఏం ఆశలు పెట్టారో, ఏం హామీలు ఇచ్చారో తెలియదు.

ఇక ఆదివారం  తెలంగాణా కేబినెట్ మీటింగ్ అయిదు గంటలపాటు జరిగినట్లు వార్తలు వచ్చాయి. కేవలం లాక్ డౌన్ గురించే ఇంత సుదీర్ఘంగా చర్చించారా అని అనుకున్నారు. కానీ అజెండా గురించి డిస్కస్ చేసింది కేవలం రెండు గంటలే. అధికారులను బయటకు పంపిన తరువాత మూడు గంటల పాటు కేసీఆర్ మంత్రులతో మాట్లాడారు. ఈటల బీజేపీలో చేరినందువల్ల టీఆర్ఎస్ కు ఎలాంటి నష్టం లేదని కేసీఆర్ అన్నారు.

రాష్ట్రంలో బీజేపీకి భవిష్యత్తు లేదని చెప్పారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో చిత్తుగా ఓడిపోయిన విషయం చెప్పారు. బీజేపీ వల్ల ఈటలకు ప్రయోజనం లేదన్నారు. ఈటల పార్టీలో, పరిపాలనలో చాలా తప్పులు చేశాడన్నారు. అందుకే బయటకు పంపానన్నారు. మరి ఈటల అధికారికంగా బీజేపీలో చేరేముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాడా ?