ఆనందయ్య మందుకు పిచ్చ పాపులారిటీ తెచ్చిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య మృతి చెందారు. ఆనందయ్య ఇచ్చిన చుక్కల ముందు తీసుకున్న తర్వాత 10 నిమిషాల్లో లేచి కూర్చున్నానని చెప్పింది ఈయనే. ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని కృష్ణపట్నం వచ్చిన తనను ఆనందయ్య బతికించాడని, ఇప్పుడు తను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని అప్పట్లో చెప్పారు కోటయ్య. ఆ వీడియో బాగా వైరల్ అయింది.
కోటయ్య వీడియో వైరల్ అయిన తర్వాతే కృష్ణంపట్నంకు జనం పోటెత్తడం మొదలుపెట్టారు. అయితే ఆ తర్వాత కోటయ్య ఆరోగ్య పరిస్థితి బాగాలేదంటూ మరికొన్ని వీడియోలు, కథనాలు వచ్చాయి. అప్పట్లో వాటిని కోటయ్య కుటుంబీకులు ఖండించారు.
అయితే ఆ తర్వాత 2 రోజులకే కోటయ్య పరిస్థితి విషమంగా మారింది. దాదాపు వారం రోజుల నుంచి నెల్లూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న కోటయ్య, నిన్న అర్థరాత్రి మృతిచెందారు. ఈయనది కోట మండలం తిన్నెలపూడి.
అటు ఆనందయ్య స్వగ్రామం కృష్ణపట్నంను కూడా కరోనా కబలించింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా 72 మందికి కరోనా సోకినట్టు తాజాగా నిర్థారణ అయింది. ఇంకా మరికొందరి ఆర్టీపీసీఆర్ ఫలితాలు రావాల్సి ఉంది. గ్రామం మొత్తానికి ఇప్పుడు కరోనా నిర్థారణ పరీక్షలు చేయిస్తున్నారు.
మొన్నటివరకు ఈ గ్రామంలో ఎవ్వరూ మాస్క్ పెట్టుకోలేదు. తమకు ఆనందయ్య మందు ఉండగా, భయం దండగ అన్నట్టు వ్యవహరించారు. అయితే ఎప్పుడైతే ఆనందయ్య మందు కోసం తెలుగు రాష్ట్రాల నుంచి కరోనా రోగులు కృష్ణపట్నంకు పోటెత్తారో.. స్థానికులకు కూడా భయం పట్టుకుంది. ఎక్కడెక్కడ్నుంచో కరోనా రోగులు ఓ చిన్న ఊరికి వస్తే వైరస్ సోకకుండా ఉంటుందా?
గ్రామస్తుల భయమే నిజమైంది. కృష్ణపట్నంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఓవైపు పోలీస్ పికెట్ ఏర్పాటుచేసినప్పటికీ.. ఏదో ఒక మూల నుంచి బయట వ్యక్తులు ఊరిలోకి రావడం, ఆరాలు తీయడంతో కేసుల సంఖ్య పెరిగినట్టు భావిస్తున్నారు.