బీజేపీని ఇరుకున పెట్టిన చంద్రబాబు లవ్ లెటర్

ప్రతిపక్షాలతో కలసి పోరాటం చేస్తామంటూ టీడీపీ మహానాడులో చేసిన తీర్మానాన్ని ఆ పార్టీ నేతలు సైతం లైట్ తీసుకున్నారు కానీ.. బీజేపీ నేతలు మాత్రం తెగ ఇబ్బంది పడిపోతున్నారు. 2 రోజులుగా దానిపై వివరణ…

ప్రతిపక్షాలతో కలసి పోరాటం చేస్తామంటూ టీడీపీ మహానాడులో చేసిన తీర్మానాన్ని ఆ పార్టీ నేతలు సైతం లైట్ తీసుకున్నారు కానీ.. బీజేపీ నేతలు మాత్రం తెగ ఇబ్బంది పడిపోతున్నారు. 2 రోజులుగా దానిపై వివరణ ఇచ్చుకుంటూనే ఉన్నారు. 

టీడీపీతో మేం కలవం, ఆ మాటకొస్తే వైసీపీలాంటి పార్టీతో కూడా కలవబోమంటూ కవర్ చేసుకోడానికి నానా కష్టాలు పడుతున్నారు. చంద్రబాబు మైండ్ గేమ్ తో బీజేపీ నేతలు విలవిల్లాడిపోతున్నారు.

2019 ఎన్నికల నాటికి చంద్రబాబుపై రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అయితే ఆ వ్యతిరేకతని బీజేపీవైపు మళ్లించేందుకు.. ఆ పార్టీతో తెగతెంపులు చేసుకుని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని తిట్టడం మొదలు పెట్టారు బాబు. ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేదని, రాష్ట్ర అభివృద్ధికి సహకరించలేదని నిందలు వేస్తూ సిపంతీ కోసం చూశారు. కానీ ఏపీ ప్రజలు బాబుని చిత్తుచిత్తుగా ఓడించారు.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మాత్రం అన్నీ తట్టుకుని నిలబడింది. దీంతో చంద్రబాబు మరోసారి బీజేపీ పంచన చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కేంద్రంలో ఉన్న పెద్దలు మాత్రం బాబుని దగ్గరకు కూడా రానీయడం లేదు. ఏపీలో కన్నా శకం ముగిసిపోయి వీర్రాజు జమానా వచ్చిన తర్వాత, బాబుతో మరీ ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు బీజేపీ నేతలు. 

టీడీపీ రాజ్యసభ సభ్యులకు కాషాయకండువా కప్పించినంత ఈజీగా చంద్రబాబుకి ఆ పార్టీ స్నేహ హస్తం అందించలేదు. దీంతో ఇప్పుడు ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కి దిగుతున్నారు బాబు. మహానాడు వేదికగా ప్రతిపక్షాలను కలుపుకొనిపోతామంటూ తీర్మానం చేయించారు. 

రాష్ట్రంలో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే, వామపక్షాలు దగ్గరకు రావని, వామపక్షాలు కావాలంటే, బీజేపీని దూరం చేసుకోవాలని అంటూనే.. కేంద్రంలో కొన్ని సందర్భాల్లో వామపక్షాలు, బీజేపీ కూడా కలసి పనిచేశాయని గుర్తు చేశారు బాబు. అలాగే.. ఇప్పుడు ఏపీలో కూడా ఓ మహా కూటమి ఏర్పాటుకి శ్రీకారం చుడుతున్నట్టు హింట్ ఇచ్చారు.

బాబు ప్రకటనతో బీజేపీ ఇరకాటంలో పడింది. ఇప్పటి వరకూ ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతామంటూ బీరాలు పలికారు బీజేపీ నేతలు. టీడీపీని మట్టి కరిపించి, వైసీపీకి గట్టిపోటీ ఇస్తామని చెప్పుకొస్తున్నారు. బాబు ఇచ్చిన స్టేట్ మెంట్ తో ఇప్పుడు బీజేపీ నేతల్లో కలవరం మొదలైంది. అందుకే అసలు వార్త జనాల్లోకి వచ్చేలోపే ఖండన వార్తలు బయటకొచ్చాయి. టీడీపీతో కలసి పనిచేసే ప్రసక్తే లేదంటూ బీజేపీ నేతలంతా స్టేట్ మెంట్లు ఇస్తున్నారు.

బాబుతో కలిస్తే.. ఆ పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేక ప్రభావం ఎక్కడ తమపై పడుతుందోనన్న భయం ఏపీ బీజేపీ నేతల్లో ఉంది. అంతే కాదు.. సీట్ల విషయంలో చంద్రబాబు వేసే జిమ్మిక్కులన్నీ వారికి తెలుసు. అందుకే ఇంకోసారి బాబుతో కలవబోమంటూ తెగేసి చెప్పేస్తున్నారు.

మరోవైపు జనసేన వైపు నుంచి ఇంకా స్పందన రాకపోవడం విశేషం. ఎప్పుడు ఏ పార్టీతో కలుస్తారో వారికే తెలియదు కాబట్టి.. మేము బీజేపీతోనే ఉంటామని వాళ్లు కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. లేదూ.. మేము టీడీపీతో కలవబోమని కూడా క్లారిటీ ఇవ్వట్లేదు. 

మొత్తమ్మీద చంద్రబాబు మహానాడు తీర్మానాలు అధికార పక్షాన్ని కదిలించలేకపోయినా, ప్రతిపక్ష పార్టీల్లో మాత్రం కలకలం రేపాయి. చంద్రబాబు తన లవ్ లెటర్ తో బీజేపీ ఇరుకునపడేశారు. తన బురదను బీజేపీకి కూడా అంటిస్తానంటుంటే, ఆ పార్టీ నేతలు భయంతో పారిపోతున్నారు.