ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఇదిగో ఇతడే పవన్ కల్యాణ్!

పవన్ కల్యాణ్ పబ్లిక్ కు కనిపించి ఎన్నాళ్లయింది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కాస్త కష్టమే. అప్పుడెప్పుడో తిరుపతి ఎన్నికల ప్రచార సభల్లో ఓసారి కనిపించారు. ఆ తర్వాత మరో 2-3 ఫొటోలు కనిపించాయి.…

పవన్ కల్యాణ్ పబ్లిక్ కు కనిపించి ఎన్నాళ్లయింది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కాస్త కష్టమే. అప్పుడెప్పుడో తిరుపతి ఎన్నికల ప్రచార సభల్లో ఓసారి కనిపించారు. ఆ తర్వాత మరో 2-3 ఫొటోలు కనిపించాయి. ఆ తర్వాత కరోనా సోకి మంచంపై పడుకున్న స్టిల్ ఒకటి వచ్చింది. అంతే.. ఆ తర్వాత పవన్ కనిపించలేదు.

నిజంగా పవన్ కల్యాణ్ కనిపించలేదు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా ఆయన పబ్లిక్ లోకి రాలేదు సరికదా, కనీసం ఒక్క ఫొటో కూడా సోషల్ మీడియాలో రిలీజ్ చేయలేదు. అలా కొన్నాళ్లుగా కనిపించకుండా తిరుగుతున్న ఈ ''అజ్ఞాతవాసి'' ఎట్టకేలకు ఈరోజు దర్శన భాగ్యం కలిగించారు. అది కూడా తన తనయుడితో కలిసి.

పవన్ కల్యాణ్, అతడి కొడుకు అకిరా నందన్ కలిసి దిగిన ఫొటోలు ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా రోజుల తర్వాత పవన్ కనిపించాడనే ఆనందం మరోవైపు, పవన్ పక్కన అకిరాను చూసిన డబుల్ ఆనందంతో మరోవైపు పవన్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

ఈ రెండు ఫొటోలపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా కథనాలు వినిపిస్తున్నాయి. అకిరా సంగీతం నేర్చుకుంటున్నాడని, మ్యూజిక్ క్లాస్ కోసం కొడుకును పవన్ కల్యాణ్ అకాడమీ వరకు డ్రాప్ చేసి వచ్చారని, ఆ టైమ్ లో సంగీతం టీచర్ తో దిగిన ఫొటోలే ఇవని ప్రచారం నడుస్తోంది.

ఈ ప్రచారం సంగతి పక్కనపెడితే.. జనసైనికులకు మాత్రం పవన్ దర్శనభాగ్యం కలిగింది. తమ నాయకుడు ఈ దేశంలోనే ఉన్నాడనే విషయంపై వాళ్లు ఇప్పటికి ఓ అవగాహనకు వచ్చారు. ఎప్పుడూ ప్రెస్ నోట్ లోనే కనిపించే జనసేనాని, ఇలా ఒక్కసారిగా ఫొటోలో ప్రత్యక్షమై.. తను కూడా పార్టీలో ఉన్నానని చెప్పకనే చెప్పారు.