నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు విషయంలో ఊహించినట్టే జరుగుతోంది. కేసుకు సంబంధించి నోరు మెదప వద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో , ఇక ఆయన వాయిస్ ఉండదని ఆశించిన వారికి నిరాశే మిగిలింది. రఘురామ మాట్లాడక పోయినప్పటికీ, తన ఆలోచనలు, ఆరోపణలను లీక్ల రూపంలో ఎల్లో మీడియాకు ఎప్పటికప్పుడు అందజేస్తూ చక్కగా పని కానిస్తున్నారు.
రెడ్లపై తన అక్కసును వెళ్లగక్కుతూనే ఉన్నారనే అభిప్రాయాలు బలపడుతున్నాయి. తాజాగా ఆర్మీ ఆస్పత్రి రిజిస్ట్రార్ కేపీ రెడ్డితో అదే సామాజిక వర్గానికి చెందిన మరో ఇద్దరు ఉన్నతాధికారులపై కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్కు ఇచ్చిన ఫిర్యాదులో తీవ్ర ఆరోపణలు చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే రెడ్ల అధికారులపై ఫిర్యాదు తూటా పేల్చారు. తనను ఆర్మీ ఆస్పత్రి నుంచి త్వరగా డిశ్చార్జ్ చేసేందుకు వైద్యులపై కేపీ రెడ్డి ఒత్తిడి తెచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కేపీ రెడ్డితో పాటు టీటీడీ ఏఈవో ధర్మారెడ్డి, గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డిలు తనను ఏపీ సీఐడీకి అప్పగించేందుకు కుట్రపన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మిలటరీ ఆస్పత్రిలో మఫ్టీ పోలీసులు తన కోసం మకాం వేసేందుకు కేపీ రెడ్డి సహకరించారని ఆరోపించారు. కేపీ రెడ్డిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని రాజ్నాథ్సింగ్కు విజ్ఞప్తి చేయడం విశేషం.
తిరిగే కాలు, తిట్టే నోరు ఊరికే ఉండవని గతంలో చెప్పుకున్నాం. తాను అనుకున్నది చేయడానికి ఏం చేయడానికైనా ఆయన వెనుకాడరనే పేరు ఉంది. ఒకవైపు నడవలేని పరిస్థితుల్లోనూ ఫిర్యాదులు చేయడానికి మాత్రం శక్తిని కూడదీసుకుని కేంద్ర మంత్రుల దగ్గరికి వెళుతున్నారు. వరుస పెట్టి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకుని ఫిర్యాదులు చేస్తుండడం గమనార్హం. ఇంతటితో ఆయన ఊరుకునే వాతావరణం కనిపించడం లేదు.
తన పట్ల మాత్రం అందరూ చాలా పద్ధతిగా వ్యవహరించాలని కోరుకునే రఘురామకృష్ణంరాజు , ఇతరుల విషయంలో ఆయన వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారి తీస్తోంది. మొత్తానికి మాట్లాడకుండానే తన ఉద్దేశాల్ని మాత్రం లోకానికి చేరేలా పక్కా ప్రణాళికతో రఘురామ ముందుకెళుతున్నట్టుగా కనిపిస్తోంది.