హీరోయిన్ త్రిష చూడడానికి 18 ఏళ్ల పిల్లలా ఉంటుంది. కానీ ఆమె సౌత్ సినీ ఇండస్ట్రీని 18 ఏళ్లుగా ఏలుతోందంటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. కానీ ఇది నిజం. చెన్నై అందాల బొమ్మ అయిన త్రిష మాతృభాష తమిళంతో పాటు తెలుగు భాషలో అగ్రహీరోలందరితోనూ నటించి మెప్పించింది.
కెరీర్లో ఎన్నో విజయాలు సొంతం చేసుకున్న త్రిష ఇటీవల కాస్త నెమ్మదించింది. దీంతో సినిమాలకు గుడ్‌బై చెప్పి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతుందేమో అనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో మీడియాతో త్రిష అనేక విషయాలు పంచుకొంది.
తాను తెలుగు సినిమాల్లో నటించననే ప్రచారం ఎందుకొచ్చిందో అర్థం కావడం లేదని త్రిష అంది. హీరోయిన్గా గుర్తింపు వచ్చిందే తెలుగు సినిమాలతో అయినప్పుడు, ఆ భాషా చిత్రాల్లో నటించనని ఎందుకంటాను? అని త్రిష ప్రశ్నించింది. ఓ తెలుగు సినిమాలో నటించాలని తనను అడిగినప్పుడు, అంతకు ముందే కోలీవుడ్‌లో కమిట్ కావడంతో కుదరదని చెప్పినట్టు త్రిష పేర్కొంది. ఇంతకు మించి తెలుగు సినిమాల్లో నటించనని తానెవరితోనూ, ఎప్పుడూ చెప్పలేదని త్రిష మరోసారి స్పష్టం చేసింది.
మాలీవుడ్‌లో సినిమా చేయక 15 ఏళ్లకు పైగా అయ్యిందని, సినీరంగంలోకి అడుగు పెట్టిన మొదటి రోజుల్లో అక్కడ చేశానని త్రిష వెల్లడించింది. అక్కడ మంచి కథలు, మంచి అవకాశాలు వస్తున్నాయని, అందుకే ఇప్పుడు అక్కడ చేస్తున్నట్టు త్రిష తెలిపింది.
ఇక డేటింగ్ విషయం మాత్రం తనకు తెలియదని చెప్పింది. కానీ తనకు తెలియకుండానే డేటింగ్లో ఉన్నాననే ప్రచారం సాగుతూ ఉంటుంది. ఏమో తనకే తెలియకుండానే డేటింగ్లో ఉన్నానేమో అని సరదాగా త్రిష చెప్పింది.
ఇక తన పెళ్లి గురించి అన్ని రకాల మీడియాలో తరచూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయని ఆమె చెప్పింది. పెళ్లి చేసుకుంటానని చెప్పానే తప్ప, ఎప్పుడు చేసుకుంటానో చెప్పలేదని ఆమె వెల్లడించింది. అయితే పెళ్లి విషయంలో మాత్రం పెద్దల మాట వినే ప్రసక్తే లేదని, ప్రేమించే చేసుకుంటానని త్రిష కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది.
తాను విదేశాల్లో మాత్రమే పెళ్లి చేసుకుంటానని, అది కూడా లాస్ వేగాస్ అంటే చాలా ఇష్టమని, కుదిరితే అక్కడే తన మెళ్లో మూడు ముళ్లు వేయించుకుంటానని త్రిష ప్రకటించింది. ఆ రోజు త్వరగా రావాలని కోరుకుందాం.