ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాదులో రెండురోజుల పాటు ఉండబోతున్నారు. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం వస్తున్న ఈ అగ్రనేత.. రెండురోజులు ఇక్కడే ఉంటారు. మాధాపూర్ లోని హైటెక్స్ లో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం జరుగుతోంది. అయితే హైదరాబాదు నగరంలో దిగిన తర్వాత.. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వేదికలు రీచ్ కావడానికి ప్రధాని మోదీ రోడ్డు మార్గాన్ని ఎంచుకోవడం లేదు!
సాధారణంగా పబ్లిక్ ఉండే ప్రాంతాలకు వెళ్లినప్పుడు.. లోకల్ గా రోడ్డు మార్గంలోనే వెళ్లడానికి మోదీ ప్రిఫర్ చేస్తుంటారు. అందులో ఆయన ఎత్తుగడ ఒకటి ఉంటుంది. రోడ్డు మార్గంలో ఆయన ప్రయాణిస్తూ ఉంటే.. రోడ్డుకు ఇరువైపులా జనసందోహం క్రిక్కిరిసి ఆయనకోసం నిరీక్షిస్తూ ఉంటుంది. ఆ జనసందోహం ఆయనను చూసి కేరింతలు కొడుతూ ఉంటారు. వారికి అభివాదం చేస్తూ.. చేయి ఊపుతూ సాగిపోవడంలో ఆయన ఒక మజాను ఆస్వాదిస్తుంటారు!
కానీ హైదరాబాదు నగరంలో అలాంటి అవకాశాన్ని ఆయన ఎంచుకోలేదు! వద్దనుకున్నారు. ఢిల్లీనుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్ పోర్టుకు వచ్చే మోడీ.. అక్కడినుంచి.. హైటెక్స్ లో జరగబోయే పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశానికి హెలికాప్టర్ లో చేరుకుంటారు. ఆదివారం సాయంత్రం పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభకోసం.. బేగంపేట విమానాశ్రయం దాకా హెలికాప్టర్ లో వెళ్లి.. అక్కడినుంచి పెరేడ్ గ్రౌండ్స్ వరకు మాత్రం రోడ్డుమార్గంలో వెళ్తారు. ఆయన పర్యటన ఇలా నగరంలోనే ఎక్కువభాగం.. వాయుమార్గంలోనే సాగుతోంది.
ఎందుకిలాగ? ఆయనకు ఇష్టమైన రీతిలో రోడ్డుమార్గంలోనే తిరుగుతూ.. జనానికి అభివాదాలు చేసే చాన్స్ ఎందుకు వదులుకున్నారు? ఒక మాట స్ఫురిస్తోంది.
గతంలో కావేరీ జలాల వివాదం జరుగుతున్నప్పుడు మోడీ చెన్నైలో పర్యటించారు. ఆయన సహజశైలిలో విమానం దిగేశాక రోడ్డు మార్గంలో జనానికి అభివాదం చేస్తూ వెళ్లాలని అనుకున్నారు. కానీ.. మోడీకి అతి భయంకరమైన నిరసనజ్వాలలు వ్యక్తం అయ్యాయి. నల్లచొక్కాలు, నల్ల ప్లకార్డులతో రోడ్డు పొడవునా తమిళులు నిలబడ్డారు. రోడ్డమ్మట వెళ్లాలంటేనే సంకోచించిన మోడీ.. అప్పటికప్పుడు.. షెడ్యూలుకు భిన్నంగా.. హెలికాప్టర్ లో కార్యక్రమ వేదికకు చేరుకున్నారు. అయినా తమిళులు వదిలిపెట్టలేదు. నల్ల బెలూన్లు గాల్లోకి ఎగరవేసి.. మోడీకి తమ నిరసన కనిపించేలాగా ఝలక్ ఇచ్చారు.
ఆ తమిళనాడు పరాభవం మోడీకి గుర్తొచ్చి నట్లుంది. అసలే హైదరాబాదులో రెండు మూడు రోజులుగా మోడీ ప్రయాణించే మార్గాల్లో ఆయనకు వ్యతిరేకంగా ఫ్లెక్సిపోస్టర్లు పెద్దసంఖ్యలో వెలిశాయి. అడుగు పెట్టే సమయానికి ఈ నిరసన మరింత ఉధృతం అవుతుందని అనుకున్నారేమో.. ముందు జాగ్రత్తగా హెలికాప్టర్ లో తిరగడానికే డిసైడైనట్లు అనిపిస్తోంది.