ఆయన పలికినదే భాగవతం. పలికించెడి వాడు పరమాత్ముడు. అదే జనాలకు అందిన భాగ్యం. కేంద్రంలో నరేంద్ర మోడీ జమానాలో అలాగే ఉంది మరి. ఎపుడో ఎనిమిదేళ్ళకు క్రితం ప్రత్యేక హోదాని ప్రధాని అభ్యర్ధిగా మోడీ ఏపీ ఎన్నికల సభలలో హామీ ఇచ్చారు. అంతవరకూ ఓకే అనుకున్నా ప్రధాని అయ్యాక మోడీ నోటి వెంట హోదా మాట వచ్చిందా అన్నది చూడాలి.
ఇక కేంద్ర మంత్రులు తొలి విడత ప్రభుత్వంలో హోదా అన్నది లేదు. దానికి కాలం చెల్లిపోయింది అని చెప్పేశారు. ఇపుడు వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక మోడీ మొదటిసారి ఏపీకి వస్తున్నారు. భీమవరంలో ఆయన ఈ నెల 4న జరిగే అల్లూరి జయంతి వేడుకలలో పాలు పంచుకుంటారు.
అయితే మోడీ అల్లూరి గురించి బాగానే మాట్లాడుతారు. అలాగే కేంద్రం ఏపీకి ఎంతో చేసిందని చెప్పినా చెబుతారు. అయితే ప్రధాని నోటి వెంట ప్రత్యేక హోదా విషయం ప్రస్తావనకు వస్తుందా. ఇది నిజంగా అత్యాశ. అయితే హోదా విషయం ఆయనకు గుర్తు లేకపోయినా గుర్తు చేయాల్సిన బాధ్యత ఏపీ జనాలకు అయితే ఉంది.
ఇక ఏపీలో ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులు అయితే తాము ఏపీకి రాక రాక వస్తున్న మోడీకి హోదా గురించి గుర్తు చేసి తీరుతామని అంటున్నారు. దాంతో పాటు విభజన హామీల గురించి కూడా మోడీ మాట్లాడాలని కూడా కోరుకుంటున్నారు. ఈ విషయంలో మీడియా మీటింగ్స్ పెట్టి చేసే డిమాండ్స్ చేస్తే మాత్రం వర్కౌట్ అవుతుందా.
విశాఖ నుంచే ఇపుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిరసనలతో పాటు హోదా డిమాండ గొంతులు కూడా వినిపించబోతున్నాయి. మోడీ మాస్టార్ వీటిని ఆలకిస్తారా. ఏమో.