ప‌వ‌న్ వ్య‌క్తిగ‌త జీవితాన్ని ట‌చ్ చేసిన మ‌హిళా నేత‌

వైసీపీ మ‌హిళా విభాగం అధ్య‌క్షురాలిగా పోతుల సునీత నియ‌మితులైన త‌ర్వాత మొట్ట మొద‌టి మీడియా స‌మావేశంలోనే జ‌న‌సేనాని వ్య‌క్తిగ‌త జీవితాన్ని ట‌చ్ చేశారు. త‌మ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ గ‌తంలో  ప్ర‌తిప‌క్ష నేత‌గా…

వైసీపీ మ‌హిళా విభాగం అధ్య‌క్షురాలిగా పోతుల సునీత నియ‌మితులైన త‌ర్వాత మొట్ట మొద‌టి మీడియా స‌మావేశంలోనే జ‌న‌సేనాని వ్య‌క్తిగ‌త జీవితాన్ని ట‌చ్ చేశారు. త‌మ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ గ‌తంలో  ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న‌ప్పుడు ప‌వ‌న్ ప‌ర్స‌న‌ల్ లైఫ్‌ను టార్గెట్ చేసిన వైనాన్ని పోతుల సునీత తాజాగా మ‌రిపించారు. ఎమ్మెల్సీ, వైసీపీ మ‌హిళా విభాగం నూత‌న అధ్య‌క్షురాలు పోతుల సునీత మీడియాతో మాట్లాడుతూ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై ధ్వ‌జ‌మెత్తారు.

మ‌హిళ ర‌క్ష‌ణ విష‌య‌మై త‌న పార్టీ వీర‌మ‌హిళ‌ల స‌మావేశంలో ఇవాళ ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాట్లాడార‌న్నారు. మ‌హిళ‌ల ర‌క్ష‌ణ విష‌య‌మై మాట్లాడేముందు, ఆయ‌న వారి ప‌ట్ల ఏ విధంగా వ్య‌వ‌హ‌రించారో అవ‌గ‌తం చేసుకోవాల‌ని సునీత సూచించారు. ప‌వ‌న్ వ్య‌క్తిగ‌త జీవితాన్ని చూస్తే ఆయ‌న మ‌హిళ‌ల‌కు ఏ విధంగా గౌర‌వం ఇచ్చారో రాష్ట్ర ప్ర‌జ‌లంతా తెలుసుకున్నార‌న్నారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు కుటుంబం, వివాహ బంధం అన్నా న‌మ్మ‌కం, విశ్వాసం లేవ‌న్నారు.

ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఒక సినిమా హీరో అని అన్నారు. సినిమాలో రెండు డ్యాన్సులేస్తాడు, రెండు డైలాగ్‌లు చెబుతాడ‌ని చెప్పుకొచ్చారు. కానీ నిజ జీవితంలో అలా వుండ‌ద‌న్నారు. అయితే  నిజ జీవితంలో మ‌హిళల జీవితాల‌తో ఆడుకున్నాడ‌ని ఘాటు విమ‌ర్శ‌లు చేశారు.  ప‌వ‌న్ బ‌హుభార్య‌త్వ‌మే ఆయ‌న మ‌హిళ‌ల‌ను ఏ విధంగా గౌర‌విస్తార‌ని చెప్పేందుకు నిద‌ర్శ‌న‌మ‌ని పోతుల సునీత తెలిపారు.

లోక‌ల్‌గా ఒకామె, నేష‌న‌ల్ లెవెల్‌లో మ‌రొకామె, ఇంట‌ర్నేష‌న‌ల్‌గా మ‌రొకామెను వివాహ‌మాడార‌న్నారు. అలాగే మ‌రొక‌రిని కూడా వివాహం చేసుకునేందుకు ప‌వ‌న్ సిద్ధ‌మ‌వుతున్నార‌ని వింటున్నామ‌న్నారు. వివాహ బంధం అనేది ప‌విత్ర‌మైన బంధ‌మ‌న్నారు. ఏడ‌డుగుల‌తో ఏర్ప‌డిన వివాహ బంధానికి ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎలాంటి నిర్వ‌చ‌నం ఇచ్చారో ఆంధ్ర రాష్ట్ర మ‌హిళ‌లంతా అర్థం చేసుకోవాల‌ని సునీత కోరారు. జీవితాంతం ఒక మ‌హిళ‌తోనే క‌లిసి న‌డ‌వాల‌నే ఆలోచ‌న‌లో ప‌వ‌న్ లేర‌ని విమ‌ర్శించారు. పెళ్లి చేసుకున్న వారిని వ‌దిలేసిన నీచ సంస్కృతి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ది అని తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శించారు.

ఏపీలో మ‌హిళ‌ల ర‌క్ష‌ణ గురించి మాట్లాడే నైతిక హ‌క్కు ప‌వ‌న్‌కు లేద‌న్నారు. ఎందుకంటే ఒక దుశ్శాస‌నుడు, కీచ‌కుడు మ‌హిళ ర‌క్ష‌ణ గురించి నీతులు చెబితే ఎలా వుంటుందో, ప‌వ‌న్ మాట‌లు అలా వుంటాయ‌ని దెప్పి పొడిచారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ ద‌గ్గ‌ర మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేద‌న్నారు. ఎవ‌రైనా ప‌వ‌న్‌క‌ల్యాణ్ ద‌గ్గ‌రికి  వెళ్లాలంటే వారికి ర‌క్ష‌ణ క‌ల్పించాల్సి వుంటుంద‌ని ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. హోంమంత్రి వ‌నిత వ్యాఖ్య‌ల‌ను ప్ర‌తిసారి ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ‌క్రీక‌రిస్తున్నార‌ని ఆమె మండిప‌డ్డారు.