షా మాటలు.. ప్రమాద సంకేతాలు!

ఢిల్లీ రాష్ట్రంలో అధికారుల నియామకం, బదిలీలను నిర్దేశించే ఢిల్లీ సర్వీసుల బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. ఢిల్లీ లో పాలన సాగిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు, విపక్షాల కూటమి ఇం.డి.యా నుంచి కూడా…

ఢిల్లీ రాష్ట్రంలో అధికారుల నియామకం, బదిలీలను నిర్దేశించే ఢిల్లీ సర్వీసుల బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. ఢిల్లీ లో పాలన సాగిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు, విపక్షాల కూటమి ఇం.డి.యా నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొన్న ఈ బిల్లు ఇప్పుడు రాష్ట్రపతి సంతకం కోసం వెళ్లనుంది. ఆ తంతు పూర్తయిన తర్వాత చట్టం అవుతుంది.

ఢిల్లీ సర్వీసుల బిల్లు లోక్ సభలో ముందే ఆమోదం పొందగా ఎన్డీయే సర్కారుకు పూర్తి మెజారిటీలేని రాజ్యసభలో తాజాగా ఆమోదం పొందింది. అనుకూలంగా 131, వ్యతిరేకంగా 102 ఓట్లు వచ్చాయి. ఈ బిల్లుకు ఎన్డీయేలో లేని బిజూ జనతాదళ్, వైసీపీ, తెలుగుదేశం పార్టీలు ఉన్నాయి. 

మెజారిటీ ఉన్నప్పుడు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఏ బిల్లు అయినా చట్టం రూపం దాల్చడం విశేషం కాదు గానీ.. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా రాజ్యసభలో అమిత్ షా ప్రసంగం చాలా భయాలను రేకెత్తిస్తోంది.

ప్రజల హక్కులను పరిరక్షించడానికి, సమర్థమైన అవినీతి రహితమైన పరిపాలన అందించడానికి ఈ బిల్లును తీసుకువచ్చాం అని అమిత్ షా తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఢిల్లీలో అవినీతిని అంతమొందించడమే తమ లక్ష్యం అని వెల్లడించారు.

ఈ మాటలు గమనించిన వారికి కలుగుతున్న భయం ఏమిటంటే.. అవినీతి అనేది కేవలం ఢిల్లీ లో మాత్రమే ఉన్నదా? లేదా, ఢిల్లీ అవినీతిని అరికట్టడం మీద మాత్రమే కేంద్రప్రభుత్వం శ్రద్ధ చూపిస్తున్నదా? అని!

అవినీతిని కట్టడి చేయడమే ఈ బిల్లు వెనుక లక్ష్యం అని చెబుతున్నట్లయితే.. ఆ బిల్లు ఇవాళ ఢిల్లీ రాష్ట్రానికి పరిమితం కావొచ్చు గాక.. కానీ భవిష్యత్తులో కేంద్రంలోని సర్కారుకు ఇష్టంలేని ఏ రాష్ట్రం విషయంలోనైనా ఇదే కారణాలతో మరో బిల్లు తీసుకురావడం అనేది కష్టం కాదు.

ఢిల్లీలో సుప్రీం కోర్టు ఉంటుందని, విదేశీ రాయబార కార్యాలయాలు ఉంటాయని, అనేక మంది విదేశీ ప్రతినిధులు వస్తుంటారని ఈ కారణాల వల్ల ఈ బిల్లు తెస్తున్నామని అమిత్ షా ప్రకటించారు.

ఇవాళ గ్లోబలైజేషన్ నేపథ్యంలో దేశంలోని అనేక నగరాలు ప్రపంచ నగరాలుగా ఆవిష్కృతం అవుతున్నాయి. ప్రతి రాష్ట్రానికి ఏదో ఒక ప్రత్యేక పరిస్థితులు తప్పకుండా ఉంటాయి. అలాంటి ప్రత్యేక పరిస్థితుల్ని జాబితాగా ఏకరవు పెడుతూ.. అందుకోసం అధికారుల నియామకాలు, బదిలీల మీద కూడా నియంత్రంణ లేని విధంగా ప్రతిచోటా సర్వీసుల చట్టం వర్తింపజేస్తాం అని కేంద్రం ముందు ముందు ప్రకటించదు అని గ్యారంటీ ఏముంది అని ప్రజలు సందేహిస్తున్నారు.

రాష్ట్రాల అధికారాలకు కత్తెర వేసే క్రమంలో ఇది చాలా కీలక పరిణామం అని, వ్యూహాత్మకంగా ఢిల్లీ లో తొలుత చట్టం తెచ్చారని పలువురు విశ్లేషిస్తున్నారు.