జనసేన పార్టీ కి మార్గదర్శకుడు, పవన్ కల్యాణ్ ను మించి పార్టీలో బలమైన నాయకుడు అయిన నాదెండ్ల మనోహర్.. మీడియా ముందుకు వస్తే చాలు ఒక్క విషయం చెప్పడానికి ఇటీవలి కాలంలో అత్యుత్సాహపడుతున్నారు. సమయం, సందర్భం ఏమైనా కావొచ్చు.. ఆయనకు పెద్దగా పట్టింపు ఉండదు.
మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారీ.. తాను తెనాలి నియోజకవర్గం నుంచి ఈసారి ఎన్నికల్లో జనసేన తరఫున ఎన్నికల్లో పోటీచేయబోతున్నా అనే సంగతిని ఆయన చెప్పి తీరాల్సిందే. ఆ సీటు తనకు దక్కదని లోలోన భయపడుతున్నారో ఏమో గానీ.. ఆ విషయాన్ని పదేపదే టముకు వేసుకుంటున్నారు.
పవన్ కల్యాణ్ ఏదైనా ఒక విషయం మాట్లాడేసిన తర్వాత.. అదే పాయింట్లకు మరికాస్త మీడియా మైలేజీ తీసుకురావడం లక్ష్యంగా నాదెండ్ల మరొకసారి ప్రెస్ మీట్ పెట్టి.. చెబుతూ ఉంటారు. ఇది చాలా సహజం. అలాగే.. వైకాపా మీద పవన్ ఆరోపణల్ని రిపీట్ చేయడానికి, సర్పంచుల్ని డమ్మీలుగా మార్చి వాలంటీర్లతో పాలన నడిపిస్తున్నారని బురద చల్లడానికి నాదెండ్ల తాజాగా మీడియా ఎదుటకు వచ్చారు. పనిలో పనిగా.. తెనాలిలో తాను గ్యారంటీగా బరిలో ఉంటా అని కూడా చెప్పుకొచ్చారు.
తెనాలి నాదెండ్లకు సొంత నియోజకవర్గం. 2019 ఎన్నికల్లో ఆయన అక్కడినుంచి కేవలం మూడోస్థానంలో నిలిచారు. ముప్ఫయి వేల ఓట్లు కూడా రాలేదు. తెలుగుదేశంతో పొత్తులేని సందర్భం అది. పొత్తు అసలు లేకపోతే.. ఈసారి నాదెండ్లకు ఆ మాత్రం ఓట్లయినా వస్తాయోలేదో అనేది అనుమానమే. ఈ నాలుగేళ్లలో ఆయన నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకున్నదేం లేదు. ఇప్పుడిక పొత్తులు, పంపకాలు, ఎన్నికలు దగ్గరపడుతున్నాయ గనుక.. అప్పుడప్పుడూ అక్కడ కనిపిస్తూ.. తాను పోటీచేయడం గ్యారంటీ అని అందరికీ చెప్పుకుంటున్నారు.
తెలుగుదేశంతో పొత్తులు కుదరకుండానే.. పవన్ కల్యాణ్ కూడా చాలా అనుచితమైన రీతిలో తెనాలి నియోజకవర్గంలో నాదెండ్ల పోటీ గురించి ప్రకటించేశారు. అక్కడ తెదేపా తరఫున బలమైన నాయకుడిగా ఆలపాటి రాజా ఉండడంతో.. దాన్ని వదలుకోవడానికి వారు ఇష్టపడరు. అయితే నాదెండ్ల మాత్రం పట్టుపడుతున్నారు.
పవన్ కల్యాణ్ కు వచ్చే ఎన్నికల్లో తాను ఏ నియోజకవర్గాల్లో పోటీచేస్తానో చెప్పగల ధైర్యం లేదు గానీ.. పొత్తుల సంగతి పట్టించుకోకుండా.. నాదెండ్లకు మాత్రం తెనాలిని కట్టబెట్టేశారు. ఈ వ్యవహారం అటు తెదేపా దళాల్లో కూడా చర్చనీయాంశంగా వినిపిస్తోంది. నాదెండ్ల వైఖరి పొత్తులకు ముసలం పెడుతుందని పలువురు అంటున్నారు. తెనాలి వేదికగా స్నేహం కోరుకుంటున్న వారికి పొరపొచ్చాలు తప్పకపోవచ్చు.