21 ఏళ్ల హన్సిక సెడన్ గా మిస్సయింది. ఆ తర్వాత మొబైల్ నుంచి ఓ వీడియో, ఆమె తండ్రికి వెళ్లింది. తనను ఎవరో కిడ్నాప్ చేశారంటూ అందులో హన్సిక ఏడ్చింది. ఆ వెంటనే కాల్ వచ్చింది. 10 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ అట్నుంచి డిమాండ్. ఈ మొత్తం వ్యవహారంలో పెద్ద ట్విస్ట్ ఉంది.
కాన్పూర్ లోని బరా విశ్వబ్యాంక్ కాలనీలో తల్లిదండ్రులతో కలిసి నివశిస్తోంది హన్సిక వర్మ. ఆమె ఐఐటీ రూర్కీకి కూడా ఎంపికైంది. అంతా ఓకే అనుకున్న టైమ్ లో శుక్రవారం సడెన్ గా కనిపించకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. అదే టైమ్ లో హన్సిక తండ్రికి వీడియో వచ్చింది.
ఆ వీడియోలో ఎవరో హన్సికను కిడ్నాప్ చేసినట్టుంది. వీడియోలో ఆమె ఏడుస్తూ కనిపించింది. దీంతో తల్లిదండ్రులు మరింత ఆందోళనకు గురయ్యారు. ఆ వెంటనే 10 లక్షలు కావాలంటూ కిడ్నాపర్స్ నుంచి కాల్ వచ్చింది. దీంతో కాన్పూర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు హన్సిక తండ్రి.
యువతి మిస్సింగ్ తో పోలీసులు అప్రమత్తమయ్యారు. 4 గ్రూపులుగా ఏర్పడి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ప్రాధమిక విచారణలో భాగంగా సీసీటీవీ ఫూటేజ్ ను పరిశీలించారు. అందులో హన్సిక, ఓ వ్యక్తి చేయిపట్టుకొని నడుస్తూ కనిపించింది. దీంతో పోలీసులకు అనుమానం పెరిగింది.
మరింత సమాచారం సేకరించి, ఫోన్ సిగ్నల్ ట్రాక్ చేసి 48 గంటల తర్వాత హన్సికను, ఆమెను కిడ్నాప్ చేసిన వ్యక్తిని పట్టుకున్నారు. అయితే ఇక్కడే పెద్ద ట్విస్ట్.
నిజానికి హన్సిక వర్మ కిడ్నాప్ అవ్వలేదు. తన ప్రియుడు రాజ్ సింగ్ తో కలిసి లేచిపోయే ప్లాన్ ఇది. ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ కు చెందిన రాజ్ సింగ్ కూడా మిస్ అయినట్టు కేసు దాఖలైంది. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. నేపాల్ పారిపోవాలనుకున్నారు. అంతలోనే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. వాళ్ల దగ్గరున్న మ్యారేజ్ సర్టిఫికేట్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు.
నకిలీ కిడ్నాప్ డ్రామాతో 2 రోజుల పాటు తమను ముప్పుతిప్పలు పెట్టిన హన్సిక-రాజ్ సింగ్ ను వదిలేది లేదని అంటున్నారు పోలీసులు. ఈ జంటపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.