టీడీపీ ఘోర పరాభవానికి నేటితో మూడేళ్లు. పార్టీ పెట్టిన తర్వాత ఎప్పుడూ ఇంత దారుణమైన రిజల్ట్ టీడీపీకి రాలేదు. కానీ బాబు హయాంలో 2019లో ఆ ముచ్చట తీరింది. పోనీ ఈ మూడేళ్లలో చంద్రబాబులో ఏమైనా మార్పు వచ్చిందా అంటే అదీ లేదు. బాబు, చినబాబు, టీడీపీ.. ఎక్కడా ఒక్కశాతం కూడా మార్పు రాలేదు. వచ్చే అవకాశం కూడా కనిపించడంలేదు.
2014 ఎన్నికల్లో అంచనాలు తప్పడంతో జగన్ లో ఆలోచన మొదలైంది. ఎన్నికలకు అటుఇటుగా రెండేళ్ల ముందు ఆయన ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేపట్టారు. ఆ తర్వాత 6 నెలలకు నవరత్నాలు అనే పేరుతో కొత్త పథకాలు ప్రకటించారు. ఆ నవరత్నాలను జనంలోకి తీసుకెళ్లారు.
తాను పర్యటించిన ప్రతి చోటా స్థానిక సమస్యలను తెలుసుకుని అక్కడికక్కడే వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఓ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుని జనంలోకి వెళ్లారు, సక్సెస్ అయ్యారు. వైసీపీ అధికారంలోకి రావడానికి చంద్రబాబు చేసిన తప్పులతోపాటు, జగన్ చేపట్టిన పాదయాత్ర ప్రధాన పాత్ర పోషించింది.
2014 ఎన్నికల్లో ఓడిన తర్వాత వైసీపీ ఎలా ఎదిగిందో అందరికీ తెలుసు. ముఖ్యంగా ఎన్నికలకు ముందు రెండేళ్లు జగన్ బాగా కష్టపడ్డారు. నాయకులు కూడా అలానే శ్రమపడ్డారు. ఇప్పుడు టీడీపీది కూడా అదే పరిస్థితి. ఓట్లు-సీట్ల లెక్కలు వేస్తే టీడీపీలో మరింత కసి ఉండాలి. కానీ అది లేదు. జగన్ నవరత్నాలు ఇప్పటికే సూపర్ హిట్. వాటిని మరిపించాలంటే ఇంకేదో చేయాలి. కానీ చంద్రబాబు ఇప్పటికీ ఆ దిశగా ఆలోచించలేదు.
ఎంతసేపు బాదుడే బాదుడు అంటున్నారే కానీ, తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే విషయాన్ని వారు చెప్పలేకపోతున్నారు. అప్పనంగా అధికారం వస్తే ఎంజాయ్ చేయాలనే ఉద్దేశం కనిపిస్తుందే కానీ.. ముందస్తు ప్రణాళికలు టీడీపీలో శూన్యం.
వాలంటీర్ వ్యవస్థ విఫలమైందని అంటున్న చంద్రబాబు.. ఆ వ్యవస్థను రద్దు చేస్తారో లేక కొనసాగిస్తారో చెప్పాలి. అమ్మఒడి అందరికీ అందడంలేదు అంటున్న చినబాబు.. తాము అధికారంలోకి వస్తే రెండో బిడ్డకు కూడా అమ్మఒడి ఇస్తారో లేదో చెప్పడంలేదు. ధరలు పెరిగాయంటున్న టీడీపీ నేతలు, తాము అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తామనే హామీ ఇవ్వడంలేదు.
మద్యపాన నిషేధం విషయంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైంది అని అంటున్నారే కానీ, టీడీపీ హయాంలో మద్యపాన నిషేధం ఉంటుందనే భరోసా ఇవ్వలేకపోతున్నారు. సో.. ప్రతి విషయంలోనూ విమర్శే ఉంటుంది కానీ, సమస్యకు పరిష్కారం మాత్రం చూపెట్టలేక పోతున్నారు.
గతంలో పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లిన జగన్.. విమర్శలతోపాటు.. సమస్యలకు పరిష్కారం చూపించారు. నిరుద్యోగ సమస్యకు సచివాలయాలతో పరిష్కారం చూపెడతామన్నారు. ప్రైవేటు ఫీజుల పెంపుదలకు.. అమ్మఒడితో చెక్ పెడతామన్నారు. రైతులకు రైతు భరోసాతో సాయం చేస్తామన్నారు. మొత్తంగా అన్ని సమస్యలకు తమదైన శైలిలో పరిష్కారం చూపెట్టారు. ఫలితం సాధించారు.
కానీ ఇప్పుడు చంద్రబాబులో ఆ ఆలోచన లేదు. ప్రతి విషయంలోనూ విమర్శే కానీ, సమస్యకు పరిష్కారం లేదు. అంటే అప్పుడు జగన్ కి ఉన్న కసి, ఇప్పుడు చంద్రబాబులో లేదు. ఆ ఆలోచన బాబులో కనిపించట్లేదు. దీన్నిబట్టి భవిష్యత్ ఏంటో ప్రజలు ఈజీగా అర్థం చేసుకోవచ్చు.