రాజకీయ నాయకులు అవమానాలు భరించాల్సిందే

రాజకీయ నాయకులు దేనికీ ఎక్కువ ఫీలవకూడదు. ఫీలింగ్స్ అనేవి ఉండకూడదు. ఒకవేళ ఉన్నా బయటకు చెప్పుకోకూడదు. మనసులోనే పెట్టుకోవాలి. అవమానాలు ఎదురైతే పంటినొప్పిన భరించాల్సిందే. తనకు అవమానం జరిగిందని నలుగురికీ అదే పనిగా చెప్పుకుంటే…

రాజకీయ నాయకులు దేనికీ ఎక్కువ ఫీలవకూడదు. ఫీలింగ్స్ అనేవి ఉండకూడదు. ఒకవేళ ఉన్నా బయటకు చెప్పుకోకూడదు. మనసులోనే పెట్టుకోవాలి. అవమానాలు ఎదురైతే పంటినొప్పిన భరించాల్సిందే. తనకు అవమానం జరిగిందని నలుగురికీ అదే పనిగా చెప్పుకుంటే రాజకీయ భవిష్యత్తు ఉండకపోవొచ్చు. కాబట్టి రాజకీయంగా మనుగడ సాగించాలంటే కొన్నిటిని భరించాలి. తప్పదు. ఒక నాయకుడికి అవమానం జరిగిందని ప్రజలు భావించవచ్చు. 

కానీ ఆ నాయకుడి పార్టీ దృష్టిలో అది రాజకీయ వ్యూహం కావొచ్చు. ఇలా పోటికల్ ఈక్వేషన్స్ ఎన్నో ఉంటాయి. సాధారణంగా ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు ఉప ముఖ్యమంత్రి పదవి చేయాల్సి వస్తే ఎలా ఉంటుంది? చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. మరో మాటలో చెప్పాలంటే అవమానకరంగా కూడా ఉంటుంది. కానీ ఒక్కోసారి ఆ అవమానాన్ని భరించి ఆ పదవి చేయాల్సి వస్తుంది. నేను చేయను అని చెప్పి నిరాకరించి వెళ్ళిపోవొచ్చు.

కానీ అలా చేస్తే ఆ నాయకుడికి రాజకీయ భవిష్యత్తు ఉంటుందో లేదో తెలియదు. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఒకప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన దేవేంద్ర ఫడణవీస్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టాడు. ఈ విషయంలో ఆయనకు అవమానం జరుగుతున్నదనే ఫీలింగ్ కలిగి ఉండొచ్చు. కానీ బీజీపీ అధిష్టానం ఆయన్ని ఒప్పించింది. 

మహా రాష్ట్రలో ఈమధ్య జరిగిన పరిణామాలు, హై డ్రామా అందరికీ తెలుసు. ఏక్ నాథ్ షిండే ధాటికి ఉద్దవ్ థాక్రే తోక ముడిచాడు. షిండే ముఖ్యమంత్రి అయ్యాడు. ఫడణవీస్ డెప్యూటీ సీఎం అయ్యాడు. రాజకీయాల్లో చిత్ర విచిత్రాలు ఎలా జరుగుతాయో మహారాష్ట్ర రాజకీయాలను చూస్తే అర్ధమవుతుంది. మహారాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్‌ షిండే, ఉప ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ పదవులు స్వీకరించడం నిజంగా ఆశ్చర్యమే.  రాజకీయవర్గాలన్నీ ఆశ్చర్యపోయాయి.

ముందుగా ఫడణవీస్‌ సీఎంగా, ఏక్‌నాథ్‌ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటారని మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఒక్కసారిగా సీన్‌ మారిపోయింది. మొదట్లో ప్రభుత్వంలో చేరేందుకు ఫడణవీస్‌ నిరాకరించినా చివరకు బీజేపీ అధిష్ఠానం ఆదేశాలతో లేదా బుజ్జగింపులతో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. శివసేనకు చీలికలు కొత్త కాదు. అయితే ఈ సారి మాత్రం మెజార్టీ ఎమ్మెల్యేలు వేరుకుంపటి పెట్టారు. అయితే తెరవెనుక సూత్రధారి బీజేపీ అని తెలిసిపోయింది. 

శివసేనకు ముంబయి, కొంకణ్‌, ఠాణె, మరాఠ్వాడా ప్రాంతాల్లో మంచి పట్టుంది. క్యాడర్‌ అలాగే ఉంది. దీనికి తోడు తటస్థంగా ఉన్న ఓటర్లు శివసేన వైపు వచ్చే ఎన్నికల్లో సానుభూతితో మొగ్గుచూపితే శివసేనకు ఆధిక్యం లభిస్తుంది. ఈ అంశాలను పూర్తిగా విశ్లేషించిన బీజేపీ సీఎం పీఠానికి దూరంగా జరిగింది. బీజేపీ అసలైన వ్యూహం ఏమిటంటే …ప్రస్తుత అసెంబ్లీ గడువు కూడా వచ్చే రెండేళ్లలోనే ముగుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ రిస్క్‌ తీసుకోదలుచుకోలేదు.

ఒకవేళ కమలనాథులు ప్రభుత్వం ఏర్పాటు చేసినా.. రెండేళ్లలో పెద్ద కార్యక్రమాలు చేపట్టలేరు. మరో వైపు ప్రభుత్వ వ్యతిరేక ఓటుతోపాటు సేనను చీల్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్న అపవాదు వచ్చే ప్రమాదముంది. దీంతో అధికారాన్ని శివసేన తిరుగుబాటు దారులకే అప్పగించింది. ఒక వేళ ప్రభుత్వ వైఫల్యాలుంటే ప్రభుత్వానికే వ్యతిరేకంగా మారుతుంది తప్ప బీజేపీకి  కాదు. బీజేపీకి విపక్ష ప్రభత్వాలను కూలుస్తుందనే పేరుంది. కానీ మహారాష్ట్రలో మాత్రం సంయమనంగా వ్యవహరించి శివసేన అంతర్గత విభేదాలతోనే ప్రభుత్వం కూలిపోయేట్టు చేసింది. కానీ ఈ పరిణామాలకు సూత్రధారి బీజేపీ అనేది బహిరంగ రహస్యమే. 

తమ ద్వారానే ప్రజాస్వామ్య పరిరక్షణ జరిగిందని.. ప్రధానంగా సీఎం పదవికి దూరంగా ఉండటం ద్వారా తాము ఎలాంటి తెర చాటు యత్నాలు చేయలేదని నిరూపించేందుకు ప్రయత్నించింది. .2019 ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇప్పుడు శివసేన చీలిపోవడంతో హిందూ అనుకూల పార్టీల్లో బీజేపీదే పైచేయి కానుంది. రానున్న ఎన్నికల్లో ఈ పరిణామాలన్నీ తమకు కలిసి వస్తాయని బీజేపీ ఆశిస్తోంది. అయితే షిండే సర్కారు పూర్తిగా బీజేపీ మీద ఆధారపడాల్సిందే. బీజేపీకి శాసనసభలో ఉన్న సంఖ్యాబలమే అందుకు కారణం. మరో వైపు రాష్ట్రంలో ఎన్సీపీ, కాంగ్రెస్‌లు బలహీనంగా మారుతున్నాయి. 

ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయంగా దూకుడు కంటే ఓపికగా ఉండటమే మేలని బీజేపీ భావించింది. అందుకునే డిప్యూటీ సీఎం పదవిని దేవేంద్ర చేపట్టారు. తమిళనాడులో కూడా ఇలాగే జరిగింది. అక్కడ అన్నాడీఎంకే నాయకుడు పన్నీర్ శెల్వం మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అవినీతి ఆరోపణలు, అక్రమాస్తుల కేసులో జయలలిత సీఎం పదవి నుంచి దిగిపోయినప్పుడు రెండుసార్లు, ఆమె మరణించినప్పుడు మూడోసారి పన్నీర్‌ సెల్వం సీఎం అయ్యాడు. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో పళని సామి సీఎం అయినప్పుడు పన్నీర్‌ సెల్వం డెప్యూటీ సీఎం అయ్యాడు. రాజకీయాలు ఇలాగే ఉంటాయి మరి.