ఎన్నికల వేడి దిగిందా..తగ్గిందా?

గత నెలా రెండునెలలుగా ఆంధ్రలో ఒకటే ఎన్నికల హడావుడి. ముందస్తు ముచ్చట్లు. నాయకుల యాత్రలు. ప్రసంగాలు. అదివో ఎన్నికలు..ఇదిగో ఎన్నికలు అంటూ. దానికి తోడు జనసేన నాయకుడు ఓపక్క, తెదేపా నాయకుడు మరోపక్క ప్రచారం…

గత నెలా రెండునెలలుగా ఆంధ్రలో ఒకటే ఎన్నికల హడావుడి. ముందస్తు ముచ్చట్లు. నాయకుల యాత్రలు. ప్రసంగాలు. అదివో ఎన్నికలు..ఇదిగో ఎన్నికలు అంటూ. దానికి తోడు జనసేన నాయకుడు ఓపక్క, తెదేపా నాయకుడు మరోపక్క ప్రచారం కూడా మొదలెట్టేసినంత హడావుడి చేసారు. 

కానీ ఇప్పుడు చూస్తుంటే అదంతా సర్దు మణిగినట్లు కనిపిస్తోంది. నాయకులు ఎవరి ప్లేస్ ల్లో వాళ్లు కూర్చుని ప్రకటనలు ఇవ్వడం, లేదా ట్విట్టర్ ను నింపడం తప్ప పెద్దగా యాక్టివిటీ కనిపించడం లేదు.

ప్రస్తుతానికి ఆంధ్ర నాట రాజకీయ వాతావరణం ఎలా వుందీ అంటే మీడియాకు కంటెంట్ ఇవ్వడానికి తప్ప మరెందుకు పనికి వచ్చేలా కనిపించడం లేదు. తలా వైపు నుంచి తలో లీడర్ ఇస్తున్న స్టేట్ మెంట్లు కూడా జిల్లా ఎడిషన్లకు పరిమితం అవుతున్నాయి. తేదేపా పార్టీ నేతలు మాత్రం రోజూ ఏదో ఒక స్టేట్ మెంట్ ఇచ్చి, తమ తమ అనుకూల చానెల్ల సాయంకాలం డిస్కషన్లకు తమ వంతు సాయం పడుతున్నారు.

రాజకీయాలు పక్కన పెడితే సినేరియా వేరుగా వుంది. అమ్మ ఒడి డబ్బుల హడావుడి ఒకపక్క, వర్షాలు బాగా పడుతుండడంతో పొలం పనులు మరోపక్క ఊపందుకున్నాయి. దాంతో నేతల మాటలు పట్టించుకునే తీరుబాటు ఎవ్వరికీ లేదు. ఎన్నికల హడావుడి 2023 లో వుంటుందని ఫీలర్లు వచ్చేసరికి రాజకీయ కోయిలలు అన్నీ ముందే కూయడం ప్రారంభించాయి. కానీ ఇదంతా జగన్ స్ట్రాటజీ అని వార్తలు వచ్చేసరికి సైలంట్ అయిపోయాయి.

ఇప్పుడు వైకాపా వంతు వచ్చింది. ప్లీనరీ హడావుడి మొదలు కాబోతోంది. మహానాడును మించిన జన సమీకరణ అన్నది వైకాపా కు తక్షణ కర్తవ్యం అయింది. అంతకు మించి ఏ విధమైన హడావుడి లేదు. ఇక ముందు కూడా వుండకపోవచ్చు. ఎందుకంటే రైతులకు పొలం పనులు, జనాలకు పండగల సీజన్ ప్రారంభం కాబోతున్నాయి. నాయకులు ఊళ్ల మీద పడితే వచ్చి జేజేలు కొట్టేవారు కనిపించడం తక్కువ అవుతుంది. అందువల్ల కొన్నాళ్లు రాజకీయ వాతావరణం స్తబ్దుగానే వుంటుంది.

అన్న మాట ప్రకారం జనసేన నాయకుడు పవన్ రోడ్ల మీదకు వస్తే తప్ప, రాజకీయ వాతావరణం మారదు. అన్నమాట ప్రకారం వస్తారో, రారో వేచి చూడాలి.