పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమకెలాంటి ప్రయోజనం లేదని వైసీపీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తిగా వున్నారు. అధినేత వైఎస్ జగన్‌ను సీఎంగా చేసుకుంటే, తామే అయ్యినంతగా వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఫీల్ అయ్యారు. ఎలాగైతేనేం జగన్‌ను సీఎం చేసుకున్నారు. అయితే తమకేంటని ప్రశ్నించుకుంటే…ఈ మూడేళ్లలో అధికార పార్టీ కార్యకర్తలకు కలిగిన ప్రయోజనం శూన్యం.
ఈ నేపథ్యంలో మరో రెండేళ్లలో ఎన్నికలుండడంతో కార్యకర్తలపై వైసీపీ అధిష్టానం సీరియస్ దృష్టి పెట్టింది. వారిని సంతృప్తపరచడానికి సీఎం జగన్ తీవ్ర కసరత్తు చేస్తున్నారని సమాచారం. ఇందులో భాగంగా వారి కోసం ప్రత్యేకంగా స్కీంను తీసుకొచ్చేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నట్టు తెలిసింది. ఈ విషయాన్ని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మాటలు బలపరుస్తున్నాయి.
కర్నూలు జిల్లా వైసీపీ ప్లీనరీలో బుగ్గన మాట్లాడుతూ కష్టపడి పనిచేసే కార్యకర్తలకు పార్టీ ఓ స్కీంను తీసుకురాబోతుందన్నారు. కార్యకర్తలకు మంచి రోజులు వస్తున్నాయని భరోసా కల్పించారు. కార్యకర్తల్లో అసంతృప్తి ఇలాగే కొనసాగితే ఎన్నికల్లో నష్టపోతామని గుర్తించే అధిష్టానం వారి కోసం ఆలోచించినట్టు బుగ్గన మాటలను బట్టి అర్థం చేసుకోవాల్సి వుంటుంది.
కార్యకర్తల విషయంలో ఇప్పటికైనా వైసీపీ నిద్ర మేల్కొన్నటే… తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి. గడపగడపకూ మన ప్రభుత్వంలో ముఖ్యంగా సొంత పార్టీ కార్యకర్తల నుంచే నిరసనలు, ప్రశ్నలు ఎదురుకావడం కూడా…. వైసీపీ అప్రమత్తం కావడానికి దోహదం చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.