ఏ అంశం గురించైనా ఎవరైనా మాట్లాడొచ్చు. ఇది స్త్రీలే మాట్లాడాలి, ఫలానాది పురుషులే మాట్లాడాలని ఎవరూ నియంత్రించరు. కానీ భారతీయ సమాజం కొన్ని నైతిక కట్టుబాట్లతో నిర్మితమైంది. అందుకే మన వ్యవస్థ అంటే మిగిలిన ప్రపంచానికి గౌరవం. గుంపులో గోవిందా అన్నట్టు విచ్చలవిడిగా మనం తిరిగితే… ఇక గౌరవ మర్యాదలకు స్థానం ఎక్కడ? అందుకే భారతీయ సమాజంలో కొన్ని విషయాల్లో మహిళలు జోక్యం చేసుకోరు. కొన్ని అంశాలపై వారు మాట్లాడరు.
స్త్రీపురుష సమానత్వం అనేది అన్నింటికీ వర్తించదు. మంచి విషయాలకు మాత్రమే మనం తీసుకోవాలి. ఏపీ అసెంబ్లీలో ఒకరోజు మద్యానికి సంబంధించిన అంశంపై టీడీపీ ఎమ్మెల్యే, దివంగత మాజీ ఎంపీ ఎర్రన్నాయుడు కుమార్తె ఆదిరెడ్డి భవానీ మాట్లాడే ప్రయత్నం చేశారు. స్పీకర్ తమ్మినేని సీతారాం జోక్యం చేసుకుని అమ్మా….మీకెందుకు తల్లి మద్యం సంగతులు అని ఆత్మీయంగా మందలించారు. దాన్ని భవానీ కూడా పాజిటివ్‌గా స్వీకరించి మద్యం విషయమై మాట్లాడలేదు. అంతే తప్ప, మహిళా ఎమ్మెల్యే వాక్ స్వాతంత్ర్యాన్ని అణిచివేస్తున్నారని భవానీ గానీ, టీడీపీ ఎమ్మెల్యేలు అనలేదు. ఎందుకంటే సమాజ కట్టుబాట్ల గురించి తెలిసిన వాళ్లు కాబట్టే.
కానీ తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత మాత్రం పదేపదే మద్యం బ్రాండ్ల గురించి మాట్లాడుతూ, సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురి అవుతున్నారు. ఇటీవల మద్యం బ్రాండ్లు, అందులోని విషం గురించి ఆమె జగన్ ప్రభుత్వం ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ కూడా మీడియాతో ఆమె మాట్లాడుతూ ఆంధ్రా గోల్డ్, సిల్వర్ స్ట్రైప్స్ , 9సీ హార్స్ మద్యం బ్రాండ్‌లలో విషం లేదని చెప్పే దమ్ము ప్రభుత్వానికి లేదన్నారు. ఈ బ్రాండ్స్ అన్నీ ఇప్పుడెందుకు ప్రభుత్వ దుకాణాల్లో కనిపించట్లేదని ఆమె ప్రశ్నించారు.
తెలుగుదేశం ఆధారాలు బయటపెట్టాకే ఇవి కనిపించకుండా పోవటం వెనక ఆంతర్యమేంటని నిలదీశారు. వాటిలో విషం ఉందని ప్రభుత్వం పరోక్షంగా ఒప్పుకుందని అనిత పేర్కొన్నారు.
ఏపీలో అమ్ముతున్న మద్యం బ్రాండ్‌లు ఇతర రాష్ట్రాల్లో ఎందుకు అమ్మట్లేదు? వైసీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు 100 డిస్టలరీలు రిజిస్ట్రయితే కేవలం 16కు మాత్రమే అనుమతులు ఇచ్చినట్లు స.హ.చట్టం ఇచ్చిన సమాధానానికి ఏం చెప్తారు? అని ప్రశ్నించారు. మద్యం బ్రాండ్ల గురించి అనిత మాట్లాడ్డం తప్పని కాదు. కానీ మద్యం గురించి పదేపదే అనిత మాట్లాడుతుండడం వల్ల …ట్రోలింగ్‌కు అవకాశం ఇచ్చినట్టు అవుతోంది. మద్యంతో బాగా పరిచయం ఉన్నట్లుగా మాట్లడుతున్నారే అనిత అంటూ కామెంట్స్ రావడం అనితకు ఇబ్బందికరమే.
ఈ కామెంట్స్ వరకే పరిమితమైతే ఫర్వాలేదు. ఇంకా దారుణంగా మీడియాలో అనితపై ప్రత్యర్థులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయినప్పటికీ అనిత వెనక్కి తగ్గకపోగా, మరింత దూకుడుగా మాట్లాడుతున్నారంటే, ఆమె ఇలాంటివే కావాలని కోరుకుంటున్నారేమో అని అనుమానించే వాళ్లు లేకపోలేదు. రాజకీయ ట్రెండ్ మారిన నేపథ్యంలో ఎవరి మనసుల్లో ఏముందో కనుక్కోవడం కష్టమైందనేందుకు అనిత పంథానే నిదర్శనం.