ఏపీ బీజేపీకి కొత్త కమెడియన్ చిక్కాడు. ఇంతకాలం కామెడీ పాత్రను ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మాత్రమే పోషిస్తున్నారు. ఆయనకు కాస్త విశ్రాంతి ఇవ్వాలనో లేక ఆయన స్ఫూర్తో తెలియదు కానీ, విశాఖలో ఇవాళ బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మాత్రం మాట్లాడుతుంటే నవ్వులే నవ్వులు. కావాలంటే జీవీఎల్ మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో ఆయన పక్కనే ఉన్న మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత విష్ణుకుమార్రాజును గమనించొచ్చు. జీవీఎల్ కామెడీకి విష్ణుకుమార్ రాజు నవ్వు ఆపుకోలేకపోయారు.
ఏపీలో తమ పార్టీతో పొత్తుపై వైసీపీ, టీడీపీ దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. తమ కార్యకర్తలు, నాయకులు ఇటుఅటు పారిపోకుండా బీజేపీతో పొత్తు కుదురుతుందని టీడీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మరోవైపు వైసీపీతో బీజేపీకి సంబంధాలున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారని జీవీఎల్ అన్నారు. మరి తమ వెంట పొత్తుల కోసం టీడీపీ ఎందుకు వెంపర్లాడుతోందని ఆయన ప్రశ్నించారు.
వైసీపీపై వ్యతిరేకత వచ్చిందంటే కేవలం బీజేపీ వల్లే అని ఆయన అన్నారు. టీడీపీని కూడా ఎవరూ నమ్మడం లేదన్నారు. టీడీపీ, వైసీపీ మధ్య లోపాయికారి ఒప్పందాలు జరుగుతున్నట్టు తమకు సమాచారం ఉందన్నారు. చంద్రబాబు, వైఎస్ రాజశేఖరరెడ్డి మధ్య ఎలాంటి సంబంధాలుండేవో అందరికీ తెలుసని, తాను కొత్తగా చెప్పాల్సిన పనిలేదన్నారు. పైకి కనిపించేది వేరన్నారు. టీడీపీ, వైసీపీ నేతల మధ్య వెనుకాల మంచి అండర్ స్టాండింగ్ ఉందన్నారు.
టీడీపీ, వైసీపీలకు ప్రత్యామ్నాయంగా, అలాగే కుటుంబ పార్టీలకు వ్యతిరేకంగా రాజకీయంగా ఎదగాలని చూస్తున్న పార్టీ బీజేపీనే అని జీవీఎల్ అన్నారు. 175కు 175 లేదా 150 సీట్లు గెలుస్తామనే ధైర్యం వుంటే వైసీపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసురుతున్నట్టు జీవీఎల్ తెలిపారు. ఖచ్చితంగా వాళ్లకు ప్రత్యామ్నాయంగా ఎదగగలమన్న నమ్మకం తమకున్నట్టు జీవీఎల్ తెలిపారు.
జగన్ ప్రభుత్వంతో ప్రజలు పూర్తిగా విసిగిపోయారన్నారు. టీడీపీ ప్రత్యామ్నాయంగా కనిపించడం లేదు. ప్రజల్లో ట్రెండ్ మారడానికి పెద్దగా సమయం పట్టదన్నారు. ఏపీలో ఇప్పుడు ఎన్నికలు జరిగినా గొప్ప ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుం దన్నారు.
ముందస్తు ఎన్నికలొస్తే డిపాజిట్ దక్కించుకుంటామనే నమ్మకం ఎలా కలిగిందో జీవీఎల్ చెప్పాలి. ఏపీలో జరిగిన మూడు ఉప ఎన్నికల్లో బీజేపీ కనీసం డిపాజిట్ దక్కించుకోని సంగతి తెలిసి కూడా… వైసీపీకి సవాల్ విసరడం జీవీఎల్కే చెల్లింది. ఏపీకి అడుగడుగునా అన్యాయం చేస్తున్నామన్న కనీస స్పృహ కూడా లేకుండా నోటికొచ్చినట్టు జీవీఎల్ మాట్లాడ్డం కామెడీ కాక మరేంటి?.
టీడీపీ, వైసీపీలకు బీజేపీ ప్రత్యామ్నాయమట…. బహుశా తన మాటలకు తనే పడిపడి నవ్వుకుంటారామో. జీవీఎల్ మాట్లాడుతున్నంత సేపూ విష్ణుకుమార్ రాజు మాత్రం తెగ ఎంజాయ్ చేశారు.