కృష్ణపట్నం ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య విషయంలో జగన్ సర్కార్ అడుగడుగునా అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది. గత వారం రోజులుగా ఆనందయ్య ఎక్కడున్నాడో తెలియకుండా దాచి పెట్టడం, కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు నిన్న ఇంటికి తీసుకెళ్లడం, ఆ తర్వాత ఈ రోజు తెల్లవారుజామున మళ్లీ రహస్య ప్రాంతానికి తీసుకెళ్లడంలోని రహస్యం ఏంటో ఎవరికీ అంతు చిక్కడం లేదు.
ఆనందయ్య మందుపై ప్రభుత్వం కావాలనే తాత్సారం చేస్తోందనే విమర్శలకు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బలాన్ని కలిగిస్తోంది. వారం తర్వాత శుక్రవారం మధ్యాహ్నం ఆనందయ్య తన కారులో ఇంటకెళ్లారు.
ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చే వరకూ మందు పంపిణీ చేసేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఆ తర్వాత నెల్లూరు రూరల్ డీఎస్పీ హరినాథ్‌రెడ్డి, కృష్ణపట్నం సీఐ ఖాజా వలి తమ సిబ్బందితో ఆనందయ్య ఇంటికెళ్లారు. ఆనందయ్య గ్రామంలోనే ఉంటే మందు కోసం భారీగా వస్తారనే సమాచారంతో ఆయన్ను అక్కడి నుంచి తీసుకెళ్లేందుకు పోలీసులు ప్రయత్నించారు.
పోలీసుల ప్రయత్నాలను ఆనందయ్య సతీమణి ఇంద్రావతి అడ్డుకున్నారు. వారం తర్వాత ఇంటికొచ్చిన తన భర్తను తిరిగి తీసుకెళ్తామంటే ఒప్పుకునేది లేదని తెగేసి చెప్పారు. పోలీసుల ప్రయత్నాల గురించి తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. ఆనందయ్య కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనకు దిగారు. దీంతో ఆనందయ్య ఇంటి నుంచి బయటకు వచ్చి సర్ది చెప్పి పంపారు. తాను కృష్ణపట్నంలోనే ఉంటానని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజామున ఆనందయ్యను ప్రత్యేక బందోబస్తు మధ్య పోలీసులు రహస్య ప్రాంతానికి తీసుకెళ్లడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆనందయ్య మందుపై నివేదిక వెలువడే అవకాశం ఉందని, అప్పటి వరకూ ఆయన్ను రహస్య ప్రాంతంలోనే ఉంచుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
మరోవైపు వైసీపీ నేతలు తమకు కావాల్సిన మందును మాత్రమే తయారు చేసుకుంటూ ఉపశమనం పొందుతున్నారనే విమర్శలు గుప్పుమంటు న్నాయి. పదేపదే ఆనందయ్యను రహస్య ప్రాంతాలకు తరలించడం వల్లే జగన్ ప్రభుత్వం విమర్శలపాలవుతోంది.
ఆనందయ్యను దాచి పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలియదు కానీ, ప్రభుత్వానికి మాత్రం కావాల్సినంత చెడ్డపేరు వస్తోంది. కృష్ణపట్నంలో ఏదో జరుగుతోందనే అనుమానాలకు ప్రభుత్వం వ్యహరిస్తున్న తీరు కారణమైంది. కరోనా కట్టడికి మందు సరే, చెడ్డ పేరు పోవడానికి ఆనందయ్య మందు తయారు చేసే అవకాశాలు ఎంత మాత్రం లేవని చెప్పక తప్పదు.