గెలుపునకు తొలిమెట్టు ఓటమి అంటారు. ఓటమి నుంచి చాలా గుణపాఠాలు నేర్చుకోవచ్చు. గెలుపోటములు శాశ్వతం కాదు. గెలుపు అహంకారాన్ని పెంచితే, ఓటమి వినయవిధేయతలను నేర్పుతుంది. తప్పటడుగులను సరి చేసుకోవాలని ఓటమి చెబుతుంది. ముఖ్యంగా రాజకీయాల్లో ఓటమికి కుంగిపోతే భవిష్యత్ ఉండదు. ఓటమికి దారి తీసిన పరిస్థితులను విశ్లేషించు కుని, అందులో నుంచి పాఠాలు నేర్చుకుని ప్రజాదరణ పొందేందుకు ప్రణాళికలు రచించుకోవాలి.
ఇలా వ్యవహరించడానికి చాలా సంస్కారం ఉండాలి. గెలుపోటములను సమానంగా స్వీకరించే స్పిరిట్ ఉండాలి. అదేంటో గానీ, సుదీర్ఘ రాజకీయ, పరిపాలనానుభవం ఉన్న చంద్రబాబు మాత్రం ఓటమిని జీర్ణించుకోలేకున్నారు. పైగా తనను ఓడించడం ప్రజల తప్పిదంగానే ఆయన ఇప్పటికీ భావిస్తున్నారు. చంద్రబాబులోని విపరీత ధోరణి ఆశ్చర్యంతో పాటు ఆందోళన కలిగిస్తోంది. ఈ ఆలోచన నుంచి చంద్రబాబు బయటకు రాకపోతే మాత్రం రాజకీయంగా ఆయన భవిష్యత్ కోల్పోయినట్టే అని హెచ్చరించక తప్పదు.
మహానాడులో టీడీపీ సంస్థాగత అంశాలపై ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే…
‘అధికారంలో ఉన్న సమయంలో పాతిక శాతం సమయం పార్టీకి ఇచ్చి ఉంటే అధికారం పోయేది కాదు. హైదరాబాద్‌లో మాదిరిగా విభజిత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో కూడా అభివృద్ధి చూపించాలని పరుగులు తీశాను. అందరం రాత్రింబవళ్లూ పనిచేశాం. కానీ దురదృష్టం … ప్రజలు దానిని అర్థం చేసుకోలేదు’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఎక్కడైనా, ఎవరైనా తమ కోసం అహోరాత్రులు పనిచేసే పాలకుడిని పోగొట్టుకుంటారా? ఇందుకు ఏపీ ప్రజానీకం అతీతమని చంద్రబాబు ఎందుకు నిష్టూరమాడుతున్నారో అర్థం కాదు. రాత్రింబవళ్లూ పనిచేస్తే ప్రజలు అర్థం చేసుకోలేదని చంద్రబాబు అనడం ఒకింత విడ్డూరంగా ఉంది. చంద్రబాబు బాగా పనిచేశారని ప్రజలు నమ్మాలి. ఏపీలో చర్చ జరగాలి. 2014లో ఇదే ప్రజలే కదా చంద్రబాబును సీఎంగా ఎన్నుకున్నది. ఓడిస్తే మాత్రం…వ్యతిరేకంగా , బుద్ధిలేని వాళ్లగా కనిపిస్తారా?
తన ఐదేళ్ల పాలనలో ఎన్నికల హామీలను ఏ మాత్రం నెరవేర్చారో విశ్లేషించుకుంటే బాబుకు ఓటమి కారణాలు తెలుస్తాయి. రైతులకు సంపూర్ణ రుణమాఫీ అని ఎన్నికల హామీ ఇచ్చి, అది నెరవేర్చారా? ఇదొక్కటి చాలదా తన వంచన పాలనను అర్థం చేసుకోడానికి. అధికారంలోకి రావడానికి నోటికొచ్చిందల్లా హామీ ఇచ్చి, ఆ తర్వాత యూ టర్న్ తీసుకోవడం అందరికీ తెలిసిందే. కనీసం ఒక్క నిరుద్యోగికి కూడా ఉద్యగం ఇచ్చిన పాపాన పోలేదు. ఇక సంక్షేమ పథకాల అమల్లో జన్మభూమి కమిటీల అరాచకత్వం గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. బాబు ఓటమిలో జన్మభూమి కమిటీలు కూడా ప్రధాన పాత్ర పోషించాయి.
యువతకు నిరుద్యోగ భృతి అని హామీ ఇచ్చి, ఎన్నికలకు ఏడాది ఉందనగా రూ.2 వేలు చొప్పున పార్టీ కార్యకర్తలకు అందించి మమ అనిపించలేదా? రాజధాని అమరావతి విషయంలో కూడా ఇదే జరగలేదా? అంతా గ్రాఫిక్‌తో మాయాజలాన్ని సృష్టించి, తన అనుకూల మీడియాతో జనాన్ని నమ్మించే ప్రయత్నం వికటించడం వల్లే ఓటమికి దారి తీసిందనే విషయాన్ని చంద్రబాబు గ్రహించకపోవడం వింతల్లో కెల్లా వింత. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసినట్టు బిల్డప్ ఇచ్చి, ప్రభుత్వ సొమ్ముతో అక్కడికి యాత్రికులను తీసుకెళ్లడం నిజం కాదా? కనీసం తన అంతరాత్మకైనా ఐదేళ్ల పాలనలోని తప్పుల గురించి సమాధానం చెప్పుకున్నారా?
తన పాలనలో జరిగిన తప్పిదాలపై విశ్లేషించుకుని, భవిష్యత్‌లో ప్రజాదరణ పొందేందుకు ఏం చేయాలో ఆలోచించ డానికి బదులు… స్వయం స్తుతి, పరనిందలకే మహానాడును పరిమితం చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాగైతే టీడీపీ బలపడటం ఎలా? అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్న.