వ్యాక్సినేషన్ విషయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఒక ప్రశ్న వేశారు. రాహుల్ ను పప్పుగా తీసిపారేసే బీజేపీ వాళ్లు, మోడీ భక్తులు ఆయనకు సమాధానం చెబితే చాలు. ఆయనేమీ వీళ్ల మేధస్సుకు అందని ప్రశ్నను వేయలేదు.
జస్ట్ వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రం వద్ద ఉన్న ప్రణాళిక ఏమిటి? అని రాహుల్ అడుగుతున్నారు. ఇది రాహుల్ అడిగినా, మరొకరు అడిగినా కేంద్రం ఈ పాటికి స్పష్టతను ఇవ్వాల్సింది. అయితే.. వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి సామాన్య ప్రజల్లో ఇప్పటికే అసహనాన్ని పుట్టించేలా మారింది!
జనాలు ఫస్ట్ వేవ్ కరోనా తర్వాత లైట్ తీసుకున్నారు. ఇక కరోనా రాదనే అనుకున్నారు. అయితే సెకెండ్ సృష్టించి వెళ్లిన విలయంతో.. త్వరలోనే సెకెండ్ వేవ్ కరోనా పూర్తిగా సద్దుమణిగినా వ్యాక్సినేషన్ మాత్రం మరవరు అని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి. ఈ వేవ్ ముగియగానే అంతా మామూలు అయిపోతుందని ప్రజలు ఈ సారి కచ్చితంగా లైట్ తీసుకోరు.
వ్యాక్సినేషన్ విషయంలో గ్రామీణులు కూడా ఈ సారి కచ్చితంగా సీరియస్ గానే ఉన్నారు. ఎందుకంటే.. ఐదారు వందల జనాభా ఉన్న గ్రామాల్లో కూడా ఐదారు మంది కరోనా కారణంగా మరణించారు రెండో వేవ్ లో. తమ కళ్ల ముందు పరిణామాలను ప్రజలు అంత తేలికగా మరవలేరు. వ్యాక్సిన్ ఇచ్చేంత వరకూ ప్రభుత్వాలను ఈ సారి ప్రజలు వదలరు.
ఇక ఇదే సమయంలో.. దేశంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్ డోసేజ్ ల సంఖ్య ఎనిమిదిన్నర కోటిగా తెలుస్తోంది. అందులో గత నెల రోజుల వ్యవధిలో రాష్ట్రాలకు అందించిన వ్యాక్సిన్ కేవలం ఐదు కోట్లు మాత్రమేనట. అది కూడా కేంద్రం వాటా, రాష్ట్రం వాటా కలిపి అని పత్రికలు చెబుతున్నాయి. ఏకంగా మూడున్నర కోట్ల వ్యాక్సిన్ డోసేజ్ లు ప్రైవేట్ కు తరలి వెళ్లాయనే వార్తలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
ప్రభుత్వాలు కూడా వ్యాక్సిన్ లను డబ్బులు ఇచ్చే కొంటున్నాయి. ప్రైవేట్ లో భారీ లాభానికి వ్యాక్సిన్ లను అమ్ముకునే సదుపాయాన్ని కేంద్రమే జారీ చేసినట్టుగా ఉంది. పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉన్న మే నెల లోనే ఏకంగా మూడున్నర కోట్ల వ్యాక్సిన్ డోసేజ్ లు ప్రైవేట్ వైపు తరలి వెళ్లాయనే కథనాలు విస్మయాన్ని కలిగించక మానవు.
సామాన్య గ్రామీణులకు ప్రైవేట్ లో కూడా వ్యాక్సిన్ అందే పరిస్థితి లేదు. అక్కడ చెబుతున్న రేట్లు వెయ్యి, 1500 అయినా.. వాటిని బ్లాక్ చేసి, ఏకంగా పదివేలు, ఇరవై వేల రూపాయలకు అమ్ముకుంటున్నారని స్పష్టం అవుతోంది. డబ్బున్న వాళ్లు లక్ష రూపాయలు అయినా ఇచ్చి డోస్ వేయించుకునేలా ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో గ్రామీణుల, సామాన్యుల, మధ్యతరగతి ప్రజల పరిస్థితి ఏమిటి? అనే దానికి కేంద్ర ప్రభుత్వమే సమాధానం చెప్పాలి.
ఒకవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి కోట్ల డోసేజ్ ల వ్యాక్సిన్ ను విదేశాలకు తరలించిన వైనం పై స్పందించారు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాక్సిన్ ను ప్రైవేట్ కు ఇవ్వడాన్ని ప్రశ్నించారు. ఈ పరిస్థితుల్లో మొత్తం వ్యాక్సిన్ ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకే కేటాయించేలా చూడాలని ప్రధానికి జగన్ లేఖ రాశారు.
సెకెండ్ వేవ్ కరోనాలో మోడీ ప్రతిష్ట చాలా వరకూ దెబ్బతింది. ఇక ఇప్పుడు వ్యాక్సినేషన్ పోకడలను సామాన్య ప్రజలు కూడా తీక్షణంగా గమనిస్తున్నారనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లను ఆ స్థాయిలో ప్రైవేట్ కు కేటాయించడం.. ప్రజల ప్రాణాలతో ఆట ఆడటం లాంటిదే. ఈ విషయంలో భక్తులు ఏ డొంక తిరుగుడు, తప్పుడు ప్రచారాలతో సమర్థించినా.. మోడీ ప్రతిష్ట మరింత మసకబారే అవకాశాలున్నాయి.
ఈ తీరును మార్చుకోకుంటే.. రాజకీయంగా కూడా బీజేపీకి తీవ్ర నష్టం కలిగే అవకాశాలు లేకపోలేదు. ప్రజలు వేడి మీద ఉన్నారు. ఎన్నికల నాటికి ఆ వేడి చల్లారిపోతుందనుకోవడం భ్రమ. ఎందుకంటే.. ఇది ప్రాణాల మీదకు వచ్చిన వ్యవహారం. ప్రతిదీ కౌంట్ అవుతూ ఉంటుంది జాగ్రత్త.