ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా టీడీపీ మహానాడు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. బహుశా ఈ మహానాడులో చేసిన ఓ తీర్మానం టీడీపీ పాలిట మరణ శాసనమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒక వైపు కేంద్రంలో పాలన సాగిస్తున్న బీజేపీ ….”చాలు చాలు మీ మోసాలు, మీ పొత్తుకో నమస్కారం” అని ఛీ కొడుతున్నా, టీడీపీ ఏ మాత్రం సిగ్గుపడ కుండా మద్దతు ప్రకటించడం సొంత పార్టీ శ్రేణులనే ఆశ్చర్యపరుస్తోంది.
నలుగురు రాజ్యసభ సభ్యులను విలీనం చేసుకున్న బీజేపీకి ఏ విధంగా అంశాల వారీగా మద్దతు ప్రకటిస్తారు? ఏపీకి తీరని అన్యాయం చేస్తున్న మోదీ సర్కార్కు అండగా నిలవాలనే ఆలోచన ఏంటి? అసలు తెలుగు వారి ఆత్మగౌరవం నినాదంతో ఆవిర్భ వించిన టీడీపీ, చంద్రబాబు సారథ్యంలో లక్ష్యాన్ని మరిచి ఢిల్లీ పాలకులకు సాగిల పడిందనే చెడ్డపేరును మూట కట్టుకుంది.
2019 సార్వత్రిక ఎన్నికల ముందు మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు తీవ్రస్థాయిలో తిట్టిపోశారని, ఇప్పుడు అడగకుండానే, అవసరం లేకుండానే ఎందుకు మద్దతు ప్రకటిస్తూ తీర్మానం చేశారో పార్టీ శ్రేణులకు వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్టీఆర్ పార్టీ పెట్టే నాటికి ఢిల్లీ వ్యవహరించే తీరుకు, ఇప్పటికీ ఏమీ తేడా లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైపెచ్చు గతంలో కేంద్రం వైఖరిపై ప్రాంతీయ పార్టీలు విమర్శలు గుప్పించేవని, పోరాడేవని , ఇప్పుడు ఆ పరిస్థితి అసలు లేదంటున్నారు. దేశంలో అప్రకటిత నియంతృత్వం అమలవుతోందని ప్రజాసంఘాలు, రచయితలు , పలు రాజకీయ పక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లో మోదీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా గళం విప్పాల్సింది పోయి, సాగిలపడ డం టీడీపీకి ఆత్మహత్యా సదృశ్యం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాలే పరమావధిగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి అంశాల వారీ మద్దతు ఇచ్చేందుకు తీర్మానించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్లో అన్ని రాజకీయ పక్షాలు మోదీ పక్షమే కావడమే గమనార్హం.