పండగలు, పుట్టినరోజుల సందర్భంగా సినిమావాళ్లు అభిమానులతో ఏదో ఒక కొత్త విషయాన్ని పంచుకోవాలనుకుంటారు. తమ సినిమాల అప్ డేట్లు కూడా సోషల్ మీడియా వేదికగానే బయటపెడుతుంటారు. ఇలాంటి ట్వీట్లకు, మెసేజ్ లకు ఎక్కడలేని రెస్పాన్స్ వస్తుంది. టపాటపా రీట్వీట్లు పడిపోతుంటాయి. ఆహా ఓహో అంటూ మోసేసే బృందం కూడా ఒకటి రెడీగా ఉంటుంది.
అభిమానులే కాదు, సినీ వర్గం నుంచి కూడా రెస్పాన్స్ ఉంటుంది. ఫలానా హీరో ఫొటోపై, ఫలానా హీరో ఇలా స్పందించారు అనేది కూడా వెబ్ సైట్లకు, యూట్యూబ్ ఛానెళ్లకు ప్రధాన వార్తే. అయితే ఇలాంటి ఎపిసోడ్ లలో ఎందుకో బాలయ్య ఒంటరివాడిగా మిగిలిపోయాడని అనిపిస్తుంది.
గతంలో శివశంకరీ పాట పాడిన సందర్భంలో కూడా బాలయ్య సాహసంపై ఎవరూ స్పందించే సాహసం చేయలేదు. ఇప్పుడు శ్రీరామదండకం ఆలపించినప్పుడు కూడా ఎవరూ స్పందించడానికి ముందుకు రాలేదు.
బాలకృష్ణ శ్రీరామదండకంపై రాజమౌళి, పూరీ జగన్నాథ్ స్పందిస్తారనుకోలేం. కనీసం ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ అయినా ఓ ట్వీట్ వేయొచ్చు కదా. తాతకు నివాళిగా బాబాయ్ చేసిన ఈ ''ఘన కార్యాన్ని'' అభినందించొచ్చు కదా. పోనీ కల్యాణ్ రామ్ అయినా ఆ పని చేయొచ్చు కదా. తన బింబిసారుడు మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి, పనిలో పనిగా బాబాయ్ పాడిన దండకాన్ని పొగిడితే.. మరింత ప్రచారం వచ్చేది కదా. అయినా కూడా వారంతా వెనకడుగు వేశారు. కారణం అందరికీ తెలిసిందే.
బాలకృష్ణ శ్రీరామదండకం విన్న ప్రతి ఒక్కరికీ శివశంకరీ పాట గుర్తుకు వస్తే అందులో ఎలాంటి ఆశ్చర్యం లేదు. గుర్తు రావడమే కాదు, ఈ దండకం కంటే ఆ పాటే బాగుందనిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే బాలయ్య జోలికి ఎవరూ రాలేదు, బాలయ్య పాటపై స్పందించే సాహసం చేయలేదు.
బాగుంది అంటే ఎక్కడ సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వస్తుందేమోననే భయం, బాగాలేదు అంటే, నందమూరి అభిమానులకి బలవ్వాల్సిందే. అందుకే మధ్యేమార్గంగా బాలయ్య దండకంపై టాలీవుడ్ మౌనం పాటించింది. బాలయ్యని ఆయనపాటికి ఆయన్ను వదిలేసింది. కనీసం ఆయన కొత్త సినిమాతో అసోసియేట్ అయ్యే బ్యాచ్ కూడా దండకం ఎపిసోడ్ కి దండం పెట్టిందంటే పరిస్థితి ఎంత బీభత్స భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.