లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ వైసీపీలో చేరుతున్నారా. విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారా. ఇది ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న ప్రచారం. వాస్తవానికి చూస్తే కొంతకాలంగా ఈ రకమైన ప్రచారం సాగుతూ వస్తోంది. అయితే అది చాలా సైలెంట్ గా సాగేది
ఇటీవల విజయవాడలో జరిగిన ఆప్కాబ్ వజ్రోత్సవ వేడుకలలో ముఖ్యమంత్రి జగన్ తో పాటు జేపీ పక్కనే కూర్చుని మాట్లాడుకోవడంతో అది కాస్తా వైరల్ అయింది. ఒకే ఫోటోలో కనిపించిన ఈ ఇద్దరిని చూసి ఎవరికి వారు తోచిన కామెంట్స్ చేస్తూ వచ్చారు.
అది నిజమే అనేంతగా పాకింది. దీని మీద లోక్ సత్తా ఏపీ ప్రెసిడెంట్ భీశెట్టి బాబ్జీ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ జేపీ వైసీపీలో చేరడం కానీ పోటీ చేయడం కానీ జరగదని స్పష్టం చేశారు. జేపీకి పదవుల మీద వ్యామోహం లేదని ఆయన అన్నారు.
జేపీ ఆప్కాబ్ కి ఎంతో సేవ చేసారని, ప్రభుత్వం ఆహ్వానం మీదనే ఆయన విజయవాడ సమావేశానికి హాజరయ్యారు తప్ప అందులో ఎలాంటి రాజకీయాలు లేవని అన్నారు. జేపీ వ్యవస్థలను ప్రేమిస్తారు, ప్రజలను ఎక్కువగా ప్రేమిస్తారు. ఆయన ఎన్నికల రాజకీయాల్లోకి ఇక వచ్చే అవకాశం ఎప్పటికీ లేదని బాబ్జీ తేల్చేశారు. లోక్ సత్తా ఈ రోజున ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం జేపీ అని ఆయన లోక్ సత్తా విధానాలను దేశమంతా చాటారని ఆయన ప్రజా కోసమే పోరాడుతారు తప్ప పదవుల కోసం కానే కాదని అన్నారు
చవకబారు ప్రచారాలు ఇకనైనా మానుకోవాలని ఆయన కోరారు. జేపీ ఏపీ ప్రభుత్వం తీసుకున్న విద్యా సంస్కరణలతో పాటు కొన్ని నిర్ణయాలను గతంలో మెచ్చుకున్నారు. వికేంద్రీకరణ పాలన లోక్ సత్తా కూడా సమర్ధిస్తుంది అయితే ఇవన్నీ చూసి ఆయన వైసీపీలో చేరుతారు అన్నది ఉత్త ప్రచారమే అని ఆ పార్టీ నేతలు అంటున్నారు. రాజకీయాల్లో ఇలాంటివి మామూలే. ఒక్కోసారి మామూలు గాలి మాటలూ నిజలైన సందర్భాలు ఉన్నాయి. అందువల్ల ఇది ప్రచారంగానే నమ్మాలి.