ఒకవైపు కరోనా భయంతో ఏవేవో వాయిదా పడుతున్నాయి. అయితే తమకు అధికారం అందే వ్యవహారాలను మాత్రం రాజకీయ నేతలు వాయిదా వేయడం లేదు! రెండో రోజు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ సరిగా జరగలేదని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆగ్రహం వ్యక్తం చేశారట. అయితే .. మధ్యప్రదేశ్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడుతోంది. ఈ రోజు రాత్రి తొమ్మిది గంటలకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ మరోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.
ప్రజలు తనను ముఖ్యమంత్రి పదవి నుంచి దించేసిన దాదాపు ఏడాదిన్నరకు ఆ ప్రజల ప్రమేయం లేకుండా మళ్లీ ముఖ్యమంత్రి అవుతున్నారు చౌహాన్. బీజేపీ మార్కు రాజకీయంతో అక్కడ కమలం పార్టీ సర్కారు ఏర్పడుతూ ఉంది. వరసగా మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసినా చౌహాన్ కు, బీజేపీ వాళ్లకు అధికార దాహం తీరలేదు. తమ ప్రత్యర్థులకు పొరపాట్లు చేసే అవకాశం అయినా ఇవ్వకుండా.. ఆ బాధ్యత కూడా వీళ్లే తీసుకుంటున్నారు. కమల్ నాథ్ ప్రభుత్వాన్ని ఏడాదిన్నర కూడా మనుగడలో ఉంచకుండానే పడగొట్టేశారు.
తిరుగుబాటు దారులకు పదవుల తాయిలాలు పంచుతున్నారు. ప్రజలు విసుగెత్తి తిరస్కరించిన చౌహాన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతున్నారు. కరోనా భయాల నేఫథ్యంలో అన్నీ కట్టడి చేయాలని ఒక వైపు ఆదేశిస్తున్న ప్రధానమంత్రి మోడీ, తన పార్టీ వాళ్ల ప్రమాణ స్వీకారాన్ని మాత్రం రద్దు చేసుకొమ్మన్నట్టుగా లేరు! కరోనా కరోనానే.. అధికారం అధికారమేనా!