యుద్ధం, ఒక విధ్వంసం. కొందరికి వ్యాపారం. సైనికులకి మరణం, యుద్ధాన్ని అర్థం చేసుకోడానికి పెద్దగా జ్ఞానం అక్కర్లేదు. ఊళ్లలోని తగువులాంటిదే. ఒక పెద్ద రైతు, చిన్న రైతు. చిన్న రైతు తాను చెప్పినట్టు వినాలని పెద్ద రైతు అంటాడు. భయంతో పొరుగూరి భూస్వామిని తోడు తెచ్చుకున్నాడు చిన్న రైతు. దాంతో ఇద్దరి మధ్య యుద్ధం. పెద్ద రైతు, చిన్నరైతు ఇద్దరికీ నష్టమే. చిన్న రైతుకి ఆయుధాలు అమ్మి యుద్ధం చేయిస్తున్న భూస్వామికి లాభం.
రష్యా, ఉక్రెయిన్‌లలో చలికాలం వస్తోంది. యుద్ధం ఇంకా సాగితే ఇరువైపులా ప్రాణ నష్టం తీవ్రంగా వుంటుంది. రష్యాకి నచ్చ చెప్పి యుద్ధం ఆపించాలని ఉక్రెయిన్ అభ్యర్థన. రష్యాకి నచ్చ చెప్పే పని చేయకుండా బెదిరిస్తున్నారు. అది బెదరడం లేదు. పుతిన్ అహం వీడడు.
దీని ఫలితం ప్రపంచంలోనే అన్ని దేశాలు అనుభవిస్తున్నాయి. రష్యా నుంచి వచ్చే ఎరువులు, ఆయిల్, గోధుమలు ఆగిపోయాయి. ఆఫ్రికా దేశాల్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. తిండి గింజల్ని పండించుకోలేని దేశాలు, దిగుమతి చేసుకుంటే తప్ప బతకలేవు. యూరప్‌లో 30 శాతం రష్యా నుంచి వచ్చే సహజ వాయువే ఆధారం.
అమెరికా ఆయుధాలు సరఫరా చేస్తూనే వుంది. యుద్ధం ఆపాలనే కోరిక దానికి లేదు. ఆర్థికమాంధ్యం దాన్ని కూడా వదలడం లేదు. రష్యాని దారికి తేవాలని కోరిక. నేతల అహంకారాలు, పట్టుదలల వల్ల అటూఇటూ లక్షల్లో చనిపోయారు. పైకి ప్రకటించే లెక్కలన్నీ అబద్ధాలే. కనీసం కోటి మంది నిరాశ్రయులు అయ్యారు. రేపు యుద్ధం ముగిసినా రెండు దేశాలు కోలుకోడానికి కనీసం ఇంకో పదేళ్లు పడుతుంది.
ఈ నేపథ్యంలో జీ-7 సభ్యదేశాల సదస్సు జరిగింది. జూన్ 26 నుంచి 28 వరకు జర్మనీలో జరిగిన సదస్సుకి ప్రధాని మోడీని కూడా ఆహ్వానించారు. ఆయన కేవలం అతిథి మాత్రమే. సభ్యుడు కాదు. యుద్ధం నివారణకి ఈ సదస్సు కృషి చేసిందేమీ లేదు.
యుద్ధం విషయంలో భారత్ తటస్థంగా వుంది. చైనా బూచిని చూపినా ఇండియా మొదటి నుంచి అభిప్రాయాన్ని మార్చుకోలేదు. రష్యా నుంచి వచ్చే దిగుమతుల అవసరం మనకి చాలా వుంది. భారత్ అతిపెద్ద వినియోగదారుల మార్కెట్ కాబట్టి ఆంక్షలు విధించే సాహసం ఎవరూ చేయరు. నిక్సన్ హయాంలో ఆంక్షలు విధించినా ఇండియా భయపడలేదు.
యుద్ధంతో ఆయిల్ సంక్షోభం వస్తుంది. ఆయిల్ దొరక్కపోతే శ్రీలంకలో ఏం జరుగుతోందో అర్థమవుతుంది. పెరుగుతున్న ఆయిల్ ధరలతో సమానంగా చెల్లించే డాలర్లు లంకలో లేవు. అన్ని దేశాల్లో ధరలు పెరుగుతున్నాయి. అమెరికాలో కూడా వడ్డీ రేట్లు పెరిగాయి. డాలర్‌కి 80 రూపాయల స్థాయి వచ్చేస్తోంది. ఇది పెద్ద దేశాలు ఆడుతున్న చదరంగం. ఆట వాళ్లే ముగించాలి.
జీఆర్ మహర్షి