మత్స్యకారులు ఏపీవ్యాప్తంగా విశాఖతో పాటుగా తొమ్మిది జిల్లాలలో ఉంటున్నారు. వారు ఇపుడు బీసీలుగా ఉన్నారు. సామాజికవర్గ పరంగా రాజకీయంగా చూసుకుంటే బీసీలుగా బలమైన ఓటు బ్యాంక్ గా ఉంటున్నారు. అయితే వారికి చిరకాల కోరిక ఒకటి ఉంది. మత్స్యకారులను ఎస్టీలలో చేర్చాలని.
దీని మీద చాలా ఏళ్ళుగా పోరాటం చేస్తూ వస్తున్నారు. గత టీడీపీ సర్కార్ ఏలుబడిలోనూ వారు ఈ డిమాండ్ తో ఏకంగా దీక్షలు కూదా చేశారు. ఇదిలా ఉంటే టీడీపీ నుంచి వైసీపీలో చేరిన విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఈ డిమాండ్ ని మళ్ళీ తెర మీదకు తెచ్చారు.
అది కూడా వైసీపీ ప్లీనరీ వేదికగా ఆయన దాన్ని బయటపెట్టారు. మత్స్యకారులను ఎస్టీలలో చేర్చే విధంగా వైసీపీ ప్రయత్నం చేయాలని ఆయన కోరారు. ఆ దిశగా కనుక వైసీపీ కృషి చేస్తే తామంతా ఆజన్మాతం రుణపడి ఉంటామని ఆయన స్వయంగా వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డికే వినతి చేశారు.
మరి ఇది సున్నితమైన అంశం. ఈ విషయంలో మేలు చేస్తే మంచిదే కానీ. చాలా అడ్డులూ ఆటంకాలు ఉన్నాయి. అధినాయకత్వం హామీ ఇవ్వాలన్నా ఆచీ తూచి మాట్లాడాల్సి ఉంటుందని అంటున్నారు.