కొంత గ్యాప్ తర్వాత ఆనందయ్య మళ్లీ మీడియా ముందుకొచ్చారు. ప్రస్తుతం తాను మందు తయారు చేయడంలేదని, ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి రాలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. రెండ్రోజుల్లో మందు తయారు చేసి పంచిపెడతారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్ని ఆయన ఖండించారు.
ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీ ఆగిపోయిన తర్వాత అనేక నాటకీయ పరిణామాలు జరిగాయి. ఆనందయ్యను పోలీసులు నెల్లూరుకి తరలించడం, కృష్ణపట్నంలో ఆయుష్ బృందం పర్యటన, ఆ తర్వాత పలు రాజకీయ పార్టీల నేతల పర్యటన అంతా చకచకా జరిగిపోయాయి.
ఆయుష్ నివేదికను కేంద్రానికి పంపించిన రాష్ట్రం, కేంద్ర సంస్థ అనుమతి కోసం వేచి చూస్తోంది. అటు హైకోర్టులో కూడా ఆనందయ్య కేసు విచారణకు వచ్చింది, త్వరగా తేల్చండి, ప్రజల ప్రాణాలు కాపాడండి అని కోర్టు సూచించింది.
ఇక మిగతా విషయాలకొస్తే.. ఆనందయ్యతో స్థానిక నాయకులు కొంతమంది మందు తయారు చేయించారని, తమ అనుచరులకు, బంధువులకు ఆ మందు పంచి పెట్టారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఆయుష్ డిపార్ట్ మెంట్ వారు కోరితేనే నమూనా కోసం తాను మందు తయారు చేశానని ఆనందయ్య వివరణ ఇచ్చారు.
ఆ తర్వాత ఆనందయ్య మకాం నెల్లూరు నుంచి కృష్ణపట్నం గెస్ట్ హస్ కి మారింది. ఇటీవల ఆనందయ్య మందు వచ్చేస్తోంది, శుక్రవారం నుంచి పంపిణీ మొదలవుతుంది, రెండ్రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా కౌంటర్లు ఏర్పాటు చేస్తారని మరో వార్త చక్కర్లు కొట్టింది.
దీంతో ఆనందయ్యే స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. కృష్ణపట్నం గెస్ట్ హౌస్ నుంచి బయటకొచ్చిన ఆయన.. ఇన్నాళ్ల తర్వాత కుటుంబ సభ్యుల్ని కలుసుకున్నారు. ప్రస్తుతం తాను మందు తయారు చేయడంలేదని, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అసత్యాలేనని చెప్పారు.
ఇంతకీ ఆనందయ్య మందు ఎప్పుడు..?
రెండ్రోజుల్లో అనుమతి వస్తుందన్నారు, ఐదురోజులన్నారు, వారం లోపు అన్నారు. రోజులు గడుస్తున్నా.. ఆనందయ్య మందు అనుమతిపై క్లారిటీ లేదు. అటు కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో.. జనంలో కూడా ఆ దిశగా ఆశలు సన్నగిల్లాయి.
ఈలోపు డూప్లికేటు మందు జనంలోకి రావడంతో.. రేపు ఆనందయ్య మందు అని ఎవరు దేన్ని ఇచ్చినా ధైర్యంగా తీసుకోలేని పరిస్థితి. మొత్తమ్మీద ఆనందయ్య తనకు తానే, ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత ఓ డేట్ చెబుతానంటున్నాడు కాబట్టి, అప్పటివరకు అందరూ ఆగాల్సిందే.